Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 30


    ఆమె బొడ్డుపైన వున్న తన చేతిని చటుక్కున తీసేశాడు సురేష్.

    చిరునవ్వు నవ్వుతూ లేచి కూర్చుంది మంజు!

    ఇవేమీ పట్టని అపర్ణ మనసు ఇప్పుడు తేలికయింది. ఆనందంతో తేలిపోయింది. వెంటనే వెళ్ళి, ఎయిర్ బ్యాగ్ ను ఎవరో తస్కరించుకు పోయిన వైనాన్ని మంజుకు చెప్పవలెనని ముందుకు కదిలింది. కాని, అక్కడ ఆ సమయంలో తన ఉనికి బయటపడడం మంచిది కాదు, అది తనకు ఇష్టమూ లేదు. మంజు ఘోరమైన ప్రమాదం నుంచి బ్రతికి బయటపడింది, అంతే చాలు అనుకున్నది. జీపు డ్రైవరుకు సైగ చేసింది అపర్ణ...

    మంజు లేచి నిలుస్తూనే ఆ ఆవరణను ఒకసారి కలయ జూసింది. తను పెట్టిన చోట తన ఎయిర్ బ్యాగ్ లేదు! ఖంగారుపడింది. ఆమె ఖంగారును చూస్తూనే అతనూ ఖంగుతిన్నాడు.

    "అమ్మో! కొంప మునిగింది...నా బ్యాగ్...ఎయిర్ బ్యాగ్...కనిపించడంలేదు!" దాదాపు అరచినట్టు అన్నది చకచక.

    సురేష్ గాభరాపడుతూ దిక్కులు చూడడం ప్రారంభించాడు.

    "దాంట్లో డైమండ్స్ పొదిగిన లాకెట్ వుంది!" కీచుగా విసురుగా అంది.

    అతని ముఖం మ్లానమయింది. ఆ మాట వింటూనే జడుసుకున్నట్టు లోలోన వణికాడు.

    "అరరె...? ఎంత విలువైన నగను బేగ్ లో వుంచి అంత అశ్రద్దగా ఎలా వదిలారు?" విసుగుదల ధ్వనించింది కోచ్ కంఠంలో.

    "మీరు ఉన్నారనే నమ్మకంతోనే- ఇదుగో-ఇక్కడ పెట్టాను! ఇంతలో ఏమైపోయినట్టు? ఇతరులెవరూ వచ్చినట్టు కూడా లేదే..." అంటూ కోచ్ సురేష్ ముఖంలోకి చూసింది.

    ఆమె చూపు తీరును, మాట ధోరణిని గుర్తించిన సురేష్ నీరుగారిపోయాడు. పాతాళంలోకి పల్టీకొడుతున్నట్టు వున్నది అతని స్థితి.

    "దాని ఖరీదు ఎంత వుంటుందేమిటి?" ఆమె తననే అనుమానిస్తున్నట్టు భావించిన సురేష్, పరువుకోసం తనే ఆ సొమ్మును కట్టేయవచ్చులే అన్నంత ధీమాగా అడిగాడు. అతనికి వళ్ళు మండిపోతున్నది.

    "డెబ్బయి లక్షల రూపాయలు!" ఠక్కున చెప్పింది మంజు.

    "ఆఁ...?" నిలువు గుడ్లు వేశాడు సురేష్. నేల కుంగుతున్నట్టనిపిస్తున్నదతనికి.

    తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం. తనమీద తీరని మచ్చ పడబోతున్నది. కృంగిపోతున్నాడు....

    అప్పటికే స్విమ్మింగ్ పూల్ కు ఆడా మగా ఒకరొకరుగా వస్తూ దూరం నుంచి కనిపిస్తున్నారు... దగ్గరవుతున్నారు. ఏం చేయాలి? కర్తవ్యం...? 

    "ఏం చేద్దామనుకుంటున్నారు?" నిలదీస్తున్నట్టు అడిగింది మంజు.

    "నన్ను...నన్నే అనుమానిస్తున్నారా...? డగ్గుత్తిగా అడిగాడు.

    "ఎలా జరిగిందీ నా కనవసరం. మీరు ఒక్కరూ వుండగానే నా బ్యాగ్ మాయమయింది. బాధ్యత పూర్తిగా మీదే కదా మరి!" హెచ్చరికగా ధ్వనిస్తున్నది ఆమె స్వరం.

    ఈతగాళ్ళు వచ్చేస్తున్నారు... వాళ్ళ ముందు తన పరువు తీస్తే...తను తిరిగి తలెత్తుకో గలడా...?

    "ఇప్పుడు నన్నేం చేయమంటారు...?" డీలాపడిపోతూ అడిగాడు.

    అతని గొంతు పొడారిపోతున్నది. చెమట్లు పడుతున్నాయి. నరాలు చిట్లుతున్నాయి...

    "ఏమీ చేయవద్దు. ఈ క్షణం నుంచి నేను చేసే పనులకు అడ్డురావద్దు. నేనేం చేసినా ఎందుకు ఏమిటి అంటూ చచ్చు ప్రశ్నలు అడగవద్దు. మీకు పట్టనట్టు వుండండి, చాలు." గంభీరంగా చెప్పింది. చెబుతూనే కుర్చీమీద వున్న టర్కీ టవల్ ను అందుకుని వంటికి చుట్టుకుంది.

    తనేదో క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నట్టు, విషవలయంలోకి పడిపోతున్నట్టు అనిపిస్తున్నది సురేష్ కు. వేరు గత్యంతరం లేదు...! ఒప్పుకోలుగా తలవూపాడు. తల దించుకున్నాడు. తల కొట్టేసినట్టే అయింది. ఇప్పుడతను ప్రాణం వున్న కట్టె.

    అప్పటికే ఆడా మగా కలిసి పాతికమంది వరకు కొత్త వ్యక్తులు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు రానే వచ్చేశారు! వీళ్ళను సురేష్ ఇంతకు ముందు ఎన్నడూ చూడనైనా చూడలేదు.

    "సర్! వీరంతా ఒక జట్టు. ఈ బ్యాచ్ కి ప్రతిరోజు స్విమ్మింగ్ కు ఉదయం అయిదు నుంచి ఏడు వరకు రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించండి. ఆ టైమ్ లోగాని, అంతకు ముందుగాని వేరెవ్వరూ ఈ పూల్ జాడలకు రాకూడదు. మీరు కూడా!" తొలి ఉత్తర్వు చేసింది మంజు. అది హెచ్చరిక, ఆజ్ఞ, శాసనం...!

    "ఆఁ..." అంటూ మూర్చపోయినట్టయాడు కోచ్ సురేష్.

    "సరే! మీరిక డ్రస్ మార్చుకొని, వెళ్ళిపోవచ్చు!"

    సురేష్ ఆకారం కదిలింది, శరీరం నడిచింది. మెదడు ఎప్పుడో గతి తప్పింది...!

 Previous Page Next Page