Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 29


    స్విమ్మింగ్ సూట్ లో పాలరాతి శిల్పంగా నిలిచి వుంది మంజు.

    పదినెనిమిదేళ్ళ పరువపు కన్నెపిల్ల ఎప్పుడూ ఏ చుడీదారో, ఏ స్కర్టో వేసుకు తిరుగుతూ వుంటే వయసుతో వచ్చే అందచందాలు అంతగా ఏమీ బయటకు కనిపించేవికాదు. ఇంకా చిన్నపిల్లే అనుకుంటూ వుండేది అపర్ణ.

    కాని, ఇప్పుడు, ఆ బికినీ డ్రెస్ లో...ఆడవాళ్ళకే అసూయ జనించేంతగా కనుపించే లేబ్రాయపు ముద్దుల గుమ్మ! మేలిమి బంగరు శరీరచాయ. వంపుసొంపుల వయారిభామ! ఆ లేజవ్వని ఎత్తుపల్లాలు... తన దిష్టే తగులుతుందేమో, ఆకుందనపు బొమ్మను ఇక మరీమరీ నోరెళ్ళబెట్టి చూడతగదు-అనుకున్నది అపర్ణ.

    అదే క్షణాన కనిపించిన దృశ్యంతో ఆమె కొయ్యబారిపోయింది!

    ఆరడుగుల ఆజానుబాహుడు. కండలు తిరిగిన మొనగాడు. నిగనిగ మెరిసే మిసిమి వన్నెల చినవాడు. తుమ్మెద రెక్కలవంటి నల్లని రోమాలతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే వింత శోభల వయసుకాడు. అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడకు వచ్చాడు.

    రెప్పవేయడం మరచిపోయి ఆపాదమస్తకం అతని మగసిరినే మైమరిచి చూస్తున్న మంజు అప్రయత్నంగా అలవోకగా అంది: "గుడ్ మార్నింగ్ సర్...!"

    "వెరీ గుడ్ మార్నింగ్!" తలెత్తి ఆమెను చూడకనే, పదానికి పదంగా అన్నాడతను.

    అతను స్విమ్మింగ్ కోచ్. పేరు సురేష్. వృత్తిధర్మం మీద అచంచలమైన విశ్వాసం కలవాడు. ఆ విషయాన్ని అతని ప్రతి కదలికా చెప్పకయే చెబుతూ వుంటుంది. అతను యువకుడు!

    "బికినీ డ్రెస్ ఎలా వుంది సార్...?" అతనితో మాటలు కలపడానికా అన్నట్టు, అతనిని ప్రసన్నం చేసుకోవాలి అనే ధోరణిలో అడిగింది మంజు.

    అతని నుంచి ఆశించిన జవాబు రాలేదు! అటు ఇటు చూసింది.

    స్విమ్మింగ్ పూల్ వద్దకు ఇంకా వేరెవ్వరూ రాలేదని, తాము ఇరువురే వున్నట్టు నిర్ధారించుకున్న మ్మాజు మరి కొంచెం చొరవ చేసింది.

    "సర్! ఈ కొత్త బికినీ కాస్త ఇబ్బంది పెడుతున్నది, జిప్ ను కొంచెం సరిచేయరూ!" అంటూనే అతనికి చేరువైపోయి తన వీపును అటువైపుకు తిప్పింది!"

    అతని కళ్ళు జిగేల్ మన్నాయి. నిజానికి, ఆమె అసలు జిప్ వేసుకోనేలేదు! లోన బ్రా కూడా లేకపోవడంతో, ఆమె పైపై అందాలన్నీ కొట్టవచ్చినట్టు మెరుస్తూ కనిపిస్తున్నాయి!

    "ఏమిటి ఈ యువతి మనస్తత్వం...?" అనుకున్నాడు అతను. ఆలోచనలో పడ్డాడు.

    ఏమాత్రం తొట్రుపాటును కనబరచకుండా జిప్ ను సరిచేశాడు!

    స్విమ్మింగ్ పూల్ అంచున నిలిచివున్న మంజు హఠాత్తుగా జారి లోనికి పడిపోయింది!

    "ఆఁ..." అంటూ బిగ్గరగా అరచింది అంతే!

    చెట్టుచాటు నుంచి ఈ తతంగాన్నంతటినీ ఇందాకటినుంచి చూస్తూనే వున్న అపర్ణ ఈ హఠాత్ పరిణామానికి ఖంగారు ఖంగారుగా ముందుకు పరుగెత్తుకు రాబోయింది. అయితే, ఈలోగానే సురేష్ నీళ్ళలోకి దూకివేయడంతో, ఆగిపోయింది.

    ఈతకొలను నిండుగా నీరు వుండడంతో మంజు ఎక్కడా కనిపించలేదు సురేష్ కు. నీటిలో పడిన ఆమె అసలు తేలనేలేదు!

    అతను గాభరాగా మునుగుతూ తేలుతూ స్విమ్మింగ్ పూల్ నేల భాగం అంతటా తెగ వెతుకుతున్నాడు. ఆమె ఆచూకీ అందడంలేదు...     

    నిమిషాలు గడిచిపోతున్నాయి. ఈసారి అతను కూడా మునిగి మరి తేలలేదు...

    అపర్ణలో ఆందోళన అధికమవసాగింది.

    సరిగ్గా అదే సమయంలో చెట్లచాటు నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, మంజు ఎయిర్ బ్యాగ్ ను దొరకపుచ్చుకుని దౌడుతీశాడు, మెరపు వేగంతో.

    క్షణంలో జరిగిన ఈ దుర్ఘటనకు మరింతగా కృంగిపోయింది అపర్ణ. అరవబోయి, తన ఉనికి ఎక్కడ బయటపడుతుందోననే ఉద్దేశంతో తెరచిన నోటిని చేత నొక్కుకుంది.

    మరి పది సెకన్లకు మంజును రెండు చేతులా ఎత్తుకుని నీటిపైకి తేలాడు సురేష్.

    ఒడ్డుకు చేరి, వెంటనే ఆమెను వెల్లకిలా పడుకోపెట్టాడు. ఆమె బొడ్డుకు పైగా పొట్టమీద చేయివేసి నిదానంగానే అయినా బలంగా అదిమాడు.

    ఆమె నీళ్ళు తాగి వుంటే వెంటనే కక్కేస్తుందని, తేరుకొంటుందని అతని ఉద్దేశం. కాని, అటువంటి దేమీ జరగలేదు! తెల్లబోయాడు సురేష్.

    అప్పటి వరకు బిగబట్టిన శ్వాసను మెల్లిమెల్లిగా వదలింది మంజు. తేటపడింది. తన బొడ్డుపైన సురేష్ వుంచిన చేతివ్రేళ్ళ స్పర్శకు మంజు కనుదోయి అరమోడ్పులయ్యాయి. విచ్చీవిచ్చని దోర పెదవులపై దరహాసం లాస్యమాడింది!

    సురేష్ ఆలోచిస్తున్నాడు. ప్రమాదవశాత్తు పడిపోతే, సహాయానికి దూకిన తనను నామమాత్రంగా అయినా ఎందుకు పట్టించుకోలేదు? క్లబ్బులో చేరినప్పుడు తనకు అసలు ఈదడం రానేరాదని చెప్పినామె సుమారు మూడు నిమిషాలకు పైగా నీటిలో మునిగి ఎలా వుండగలిగింది? తను పొట్ట నొక్కినప్పుడు కనీసం పుక్కిలి నీరైనా కక్కలేదేమి? అంటే, ఆమె స్విమ్మింగ్ లో నిపుణురాలే నన్నమాట...! మరి, తనను ఆటపట్టించడం కోసమా ఇంతా చేసింది...?  

 Previous Page Next Page