Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 28


    అపర్ణ ముభావానికి కారణం ఇప్పుడు అర్ధమయింది ఇద్దరికి. అంటే, ఆమెకు తమ మీద పూర్తిగా నమ్మకం కుదిరినట్టే లెక్క!

    "ఆంటీ! మా భద్రత గురించి నువ్వేమీ దిగులుపడకు! ఆ మాత్రం సెక్యూరిటీ మాకు తెలియదా, చేతకాదా? మేం కరాటే, జూడో మొదలైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నది ఆత్మరక్షణార్దమేగ!" ధీమాగా అన్నాడు అభిషేక్. అంటూనే నాలుగు ఫోజులు కొట్టేశాడు.

    "డోంట్ వర్రీ ఆంటీ! తెలతెలవారుతూనే సెక్యూరిటీ అంటూ వాళ్ళను ఇబ్బందిపెట్టడం ఎందుకు? అయినా, డాడి అజాతశత్రువు కదా! డాడీకి లేని శత్రువులు మాకెందుకుంటారు?" సాగదీస్తూ సన్నగా అన్నది మంజు.

    "బయటకు వెళ్ళగానే మేమసలు ప్రధాని పిల్లలమనే విషయాన్నే మరచిపోతాం ఆంటీ! మా ప్రవర్తన కూడా అలాగే వుంటుంది!" హుషారుగా చెప్పాడు అభిషేక్.

    "ఆంటీ! 'ఒక దేశ ప్రధాని పిల్లలు' అనే గుర్తింపు మాకు వద్దు! అందువల్ల భేషజాలు, అనర్ధాలు వెంటాడవచ్చు. సామాన్య పౌరులుగా బ్రతకడమే మాకు ఇష్టం. ఆమాత్రం స్వేచ్చనుంచి మమ్ము దూరం కమ్మంటావా ఆంటీ!" జాలిగా అంది మంజు.

    "సరే, మీ ఇష్టం ! ఈ కాలం కుర్రకారుకు ఏం చెప్పినా తంటాయే!" స్వగతంగా అనుకోబోయి బయటకే చెప్పింది అపర్ణ.

    ఆ ఒక్కమాటతోనే ఇరువురికీ ఏనుగంతబలం, గుఱ్ఱమంత సత్తువ వచ్చేసినట్టయింది. ఒక్క ఊరుకున గేరేజికి చేరుకున్నారు. చెరొక కారు తీసుకుని బయటకు తుర్రుమన్నారు. అన్నీ క్షణాలలో జరిగిపోయాయి!

    బరువుగా నిట్టూర్చింది అపర్ణ. 'ఏం పిల్లలో...!' అనుకుంది. 

    ఈపాటికి డ్రయివరు వచ్చి, గేరేజిలోనుంచి జీపును తీసుకువచ్చి ఆమె ఎదుట పెట్టి, సీటులో నుంచి దిగి ఒదిగి నిలిచాడు.

    అపర్ణ ఎక్కి సర్దుకు కూర్చోగానే డ్రయివరు ఎక్కి జీప్ ను స్టార్ట్ చేశాడు.

    "క్రీడా ప్రాంగణానికి పోనివ్...!" చెప్పింది అపర్ణ.


                         *    *    *


    స్పోర్ట్స్ స్టేడియం. టెన్నిస్ కోర్టు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

    ఆ రోజు ప్రాక్టీస్ చేయడానికి, జాగింగ్ కు , మోర్నింగ్ వాక్ కు ఒక్కొరొక్కరే మెల్లిమెల్లిగా స్టేడియంకు  చేరుకుంటున్నారు.

    అప్పటికే అభిషేక్ నిక్కరు - బనియన్ తో బేట్ తో బాల్ తో టెన్నిస్ కోర్టులోకి ప్రవేశించాడు.

    అతని రాకకోసమే ఎదురుచూస్తూ చాటుగా నిలచి వున్నదొక యువతి!

    అభిషేక్ ఆమెను చూడలేదు. కోర్టును పరిశీలిస్తున్నాడు.

    వెనుకగా, పిల్లిలా కాలులో కాలు వేసుకుంటూ వచ్చి అతని కనులు మూసింది ఆమె!

    అభిషేక్ ఆ చేతులను తడిమాడు. "హసీనా!" అన్నాడు నవ్వుతూ.

    "ఎలా గుర్తుపట్టావబ్బా...?" అన్నదామె, తను ఓడిపోయినట్టు గుర్తించి, నిష్ఠుర ధ్వనితో.

    "సింపుల్! యువర్ స్మెల్!"

    "యూ...!" అంటూ చేయెత్తిందామె.

    "ఐ మీన్...! ఏదో సెంటు పూసుకు వచ్చుంటావు!" అంటూ ఆ చేతిని అందుకున్నాడతను. 


    ఆమె చిరునవ్వు నవ్వింది. "తెచ్చావా...?" అంది గుప్తంగ.

    "ఏవిటబ్బా తేవలసింది...?" గుర్తులేదన్నట్టు నటించాడతను.

    "నేను సీరియస్ గా అడుగుతుంటే, నువ్వు జోక్ చేస్తావా? నీ సంగతి..." అంటూ ఆమె నాలుకతో వెక్కిరించింది.

    "వెయిట్ బేబీ, వెయిట్! అంత తొందరైతే ఎలా?"

    "అబ్బబ్బ...తెల్లారిపోతుంది... ఎవరైనా చూస్తే..."

    ఆమె మాట పూర్తికాక ముందే అతను తను తెచ్చిన ఎయిర్ బ్యాగ్ ను ఆమె భుజానికి తగిలించాడు__నవ్వుతూ, కొంటెగా చూస్తూ.

    "థాంక్స్! మరి...మరి...నా  లంచం...?" ఒకడుగు ముందు కేసింది ఆమె.

    "లంచమా? అదేమిటబ్బా...?" అర్ధం కానట్టు అయోమయంగా చూశాడు అభిషేక్.

    "ఒట్టి బుద్ధావతారం...!" అంటూనే అమాంతం అభిషేక్ ముఖాన్ని దోసిలిలోకి తీసుకుని అతని పెదవులతో తన పెదవులను కలిపి అతనిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది!

    మరుక్షణమే అతనిని వదలి తూనీగలా వెళ్ళిపోయింది ఆమె.

    "ఏయ్..." అంటూ ఆమె వెంట తరుముకుపోయాడు అభిషేక్.

    ఇంకా దూసుకు వెళ్ళి ఆమెను అందుకునే వాడే కాని, ప్లేయర్స్ ఎదురవ్వడంతో ఏమీ ఎరగని వాడిలా వెనుదిరిగి కోర్టు వైపుకు నడిచాడు.

   
                           *    *    *


    అదే సమయానికి స్విమ్మింగ్ పూల్ వద్ద...

    జీపును దూరంగా ఆపించింది అపర్ణ. ఒంటరిగా కాస్త ముందుకు వచ్చి చెట్ల చాటుగా చూసింది. మ్రాన్పడిపోయింది!     

 Previous Page Next Page