Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 27


    ఒంటరి పోరాటంలో ఒక నారిగా తను చివరి వరకు నిలవగల సత్తా తనకు వున్నదా...?

    గెలుపు-ఓటముల విషయం అలా వుంచి, కరడుగట్టిన కఠిన  హృదయుల చేతులలో తమ ఇద్దరి జీవితాలు నాశనమైపోయే ప్రమాదం లేకపోలేదు...

    ఈ ప్రత్యక్ష పోరాటంలో ఒకవేళ గెలిచినా, తనకు తన చెల్లి సింధూకు మిగిలేవి మరిన్ని కష్టాలే...! ఓడిపోతే... ఓ... భయానకం... తమ వ్యక్తిత్వాలతో పాటు శీలాన్ని సయితం కోల్పోయి, జీవితాంతం కుమిలి కుమిలి చస్తూ వుండవలసిందే...!

    ఆలోచనలు మెదడును తొలుస్తున్నా, ఇహ ఏ మాత్రం తాత్సారం చేయదలచుకోలేదు ధీరజ. చకచకా తాళం తీసి, తలుపులు తెరచి లోనికి వెళ్ళింది.

    తన సూట్ కేసును తెరచి ఒక ఫోటోను బయటకు తీసింది ధీరజ. క్షణకాలం దానిని తదేకంగా పరికించింది. ఆ ఫోటో ఆమెకు స్ఫూర్తి. జీవం. జపం !

    సూట్ కేస్ ను సర్దుకుని చేత పట్టుకుని ధీరోదాత్తంగా బయటకు వచ్చింది ధీరజ.

    తలుపుకు తాళం వేసి, ఆ నిశిరేయిలోనే నిర్భయంగా కదిలింది.

    అప్పటికే ఆమె మదిలో వ్యూహం రూపొందింది !


                         *    *    *


    అది భారత ప్రధాని నివాస భవనం.

    వేకువ ఝాము అయిదు గంటల వేళా.

    కావలివున్న సెంట్రీ గార్డులు మినహా ఆ కాంపౌండ్ ఆవరణలలో మరెవ్వరూ తచ్చాడుతున్న జాడలేదు. అంతటా నిశ్శబ్దం.

    నిర్దిష్టమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సెంట్రీ పోష్టుల నుంచి మెషిన్ గన్ లను గురిపెట్టి దశదిశలా పహరాకాస్తున్నారు గార్డులు. వాళ్ళ చేతులలో పవర్ ఫుల్ సెర్చ్ లైట్స్ కూడా వున్నాయి. అందరూ చాలా ఎలర్ట్ గా పరిసరాలను పరిశీలనగా చూస్తున్నారు.

    ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్ పర్సనల్ సెక్యూరిటీ వింగ్ లో స్కాట్ లండ్ యార్డ్ లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందివచ్చాడు. ఇప్పుడతను ప్రధాని సెక్యూరిటీని తనదైన సొంత రీతిలో పటిష్టమంతం చేశాడు. కనుకనే సెంట్రీ గార్డులు అంత జాగరూకతతో నిత్యం కావలికాస్తున్నారు.

    ప్రధాని నివాస భవనం ముఖద్వారం తలుపులు నెమ్మదిగా తెరచుకున్నాయి.

    అభిషేక్, మంజు పోర్టికోలోకి వచ్చారు.

    ఆ ఇరువురినీ చూస్తూనే సెంట్రీ గార్డులు విష్ చేశారు.

    కారు గేరేజి వైపుకు కదలబోతున్న ఇద్దరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు.

    ఎదురుగా- ఔట్ హౌస్ లో నుంచి బయటకు వచ్చి, క్రీనీడలో తమ వైపుకే కదలిన- స్త్రీమూర్తిని వారు చూశారు. ఇరువురూ తడబడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

    ఆమె తమ ఆయా అపర్ణ...!

    అభిషేక్, మంజు స్పోర్ట్స్ డ్రెస్ లో వున్నారు. భుజాల ఎయర్ బ్యాగ్స్ వ్రేలాడుతున్నాయి.

    ఆమె తమకు చేరువయేలోగా ఇద్దరూ తేరుకున్నారు. కనులతోనే సైగలు చేసుకున్నారు.

    "ఆంటీ! నువ్వు కూడా ఇంత వేకువనే లేచావు. మాతోపాటు మోర్నింగ్ వాక్ కూ గట్రా వస్తావా ఏం!" ముందుగా మంజు జోక్ చేసింది.

    'వీళ్ళిద్దరూ నిజంగానే స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికే వెడుతున్నారా?' అనుమానించింది అపర్ణ. ఆమె సందేహాలు ఆమెకు వున్నాయి!

    అపర్ణ మౌనంగా వుండడంతో ఇద్దరూ మరల జంకారు. 'కొంపదీసి తమ మీద తండ్రికి ఫిర్యాదు చేయదు గదా...' అనుకుంటూ బెంబేలుపడ్డారు.

    ఆమెను ఎలా అయినా ప్రసన్నం చేసుకుని, తమ స్వేచ్చను తాము కాపాడుకోవలెననే కృతనిశ్చయానికి వచ్చారు క్షణంలో. ఆమె తమను అర్ధం చేసుకుంటే తమకు ఇక సమస్యలు అంటూ ఉండనే వుండవు! ఇంట్లో ఆమె మాట వేదవాక్కేగదా...!

    "ఆంటీ! ఇప్పటికే మేము స్టేట్ స్పోర్ట్స్ మీట్ లో విన్నర్స్ గా వచ్చాం. నేషనల్స్ కు వెళ్ళవలెనంటే ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. మా మీద నమ్మకం లేదా?"

    ఇరువురూ కూడబలుక్కున్నట్టు ఒకరి తరువాత ఒకరు కోరస్ గా చకచకా అనేశారు.

    "భలేవారే! మీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏమిటీ!" దీర్ఘంతీస్తూ నిదానంగా అన్నది అపర్ణ. క్షణం ఇద్దరినీ పరకాయించి చూసింది.

    "చూడమ్మా, నువ్వా  ఆడపిల్లవు! అదీగాక, సెక్యూరిటీ విషయాన్ని ఉభయులూ మరచిపోతున్నారు! పోనీ, గన్ మెన్ ను అయినా వెంటబెట్టుకు వెళ్ళగూడదూ!" ఇద్దరినీ మార్చిమార్చి చూస్తూ సూచించింది అపర్ణ.

 Previous Page Next Page