పరిస్థితి అగమ్యగోచరంగా వుంది ధీరజకు.
తన తోబుట్టువు సింధూను ఎలా రక్షించుకోవాలి...?
ఆత్మాభిమానాన్ని చంపుకునిమరీ పత్రికలలో ప్రకటించింది. తన చెల్లెలు జబ్బును నయంచేయించుకోవడానికి ఆర్ధికంగా ఆదుకోవలసిందని. అయినా ఎవ్వరి నుంచీ స్పందన లేదు...
సర్కస్ కంపెనీవారు తన ఫీట్సుకు చెల్లించే ప్రతిఫలం తమ ఇరువురి జరుగుబాతుకే బొటాబొటీ సరిపోతున్నది. పైసా మిగలడం లేదు... ఏం చేయాలి? ఎలా...?
అర్దరాత్రి దాటుతుండగా, వళ్ళంతా పులిసిపోయిన బడలికతో ఇంటికి వచ్చింది ధీరజ.
ఇంటి తలుపు గొళ్లానికి తాళం వ్రేలాడుతున్నది...
ఇంత అపరాత్రి ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి వెళ్లినట్టు సింధు?
అయోమయంగా చూసింది ధీరజ. క్షణం ఆమెకేమీ పాలుపోలేదు. ఖంగారుపడిపోయింది. ఆ ఆదుర్దాలో, అదరుతున్న గుండెను చిక్కబట్టుకుంటూ, ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్లను నిద్రలేపింది! ఆందోళనతో అడిగింది తన చెల్లిగురించి.
చుట్టుప్రక్కలవారి మాటలనుబట్టి, సింధు ఎవరితోనో జీపులో వెళ్ళిందని తెలిసింది.
ఎవరిది ఆ జీపు? ఏ రంగుది? నెంబరెంత? ఎవరు నడిపారు...?
ఎవరుమాత్రం చెప్పగలరు గనుక? వాళ్లకు ఇదేపనా!
సింధు తన ఇష్టప్రకారం వెళ్ళిందా లేక ఎవరైనా బలవంతంగా తీసుకువెళ్లారా...?
ఇప్పుడు ఎలా? ఏం చేయాలి...?
సింధూను ఎవరైనా కిడ్నాప్ చేశారా? చావు బ్రతుకుల సంధ్యారాగంలో వున్న ఆమెను తీసుకువెళ్లి ఎవరుమాత్రం ఏమి చేయగలరు? ఇప్పుడెవరు తమకు దిక్కు...?
యాధృచ్చికంగా కలసిన అధికారి, ఆ తరువాత లక్షరూపాయల కోసం తను పడిన శ్రమ అంతా గుర్తుకు వచ్చింది ధీరజకు.
అధికారి చెప్పినట్టు, అతని బాస్ తో చేయి కలిపితే, ఈపాటికి సింధూకి ఆపరేషన్ కూడా చేయించగలిగేది! కాని, తను తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేకపోయింది.
కేవలం తన ధైర్యసాహసాలకు పరీక్షేమో అన్నట్టు ఆ ఫీట్స్ అయినా చేసిందే కాని, వాళ్ల ముఠాతో తను చేరడానికని తెలిస్తే, ససేమిరా అసలు వెళ్లేదే కాదు.
మంచిదే, ముందే తెలిసింది. ఏమీ చెప్పాపెట్టకుండా సహాయం చేసి, తీరా సింధూకి ఆపరేషన్ అయిన తరువాత తనకు ఇష్టంలేని పనులు చేయమంటే తను తలవంచగలదా?
అసలు, వాళ్లు ఎవరు? ఎవరో తెలుసుకోకుండానే వాళ్లుపెట్టిన పందెంలో పాల్గోవడం తన మొదటి తప్పు. తన అవసరాన్ని గుర్తించి మరీ ముందుకువచ్చి తనకు ఎరవేయ చూశారంటే- వాళ్లు గ్రంథసాంగులై వుంటారు. ఏదో పెద్ద పథకం పన్నే వుంటారు...!
సింధూకోసం లక్ష రూపాయలను ఖర్చుచేయడానికి సిద్ధం అయ్యారంటే, తన అవసరం వాళ్లకు ఎంతగానో వున్నదన్నమాట. అంటే -తనను, తన విద్యను, నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి...
"టెలిగ్రాం!" అనే పిలుపుతో ఊహలలో నుంచి మేలుకుంది ధీరజ.
'అర్ధరాత్రి టెలిగ్రాం...' సంతకం చేసి, అందుకుని విప్పి చూసింది.
'సింధూ ఈజ్ సేఫ్ విత్ అజ్. లెటర్ నో యువర్ ఎస్ ఆర్ నో.
ఇఫ్ ఎస్ కమ్ టు 36 చౌరంగీ లైన్ ఎట్ 5-30 పి.యమ్. టుమారో - అధికారి"
తను అనుమానించినట్టే జరిగింది. సింధూని వాళ్లే కిడ్నాప్ చేశారు. తను తన ఇష్టాన్ని లోగడ తెలపనందునే ఇలా చేశారు. తనను లొంగదీసుకోవడానికి అస్త్రాన్ని ప్రయోగించారు...
'ఈ టెలిగ్రామ్ తీసుకొని సరాసరి పోలీస్ స్టేషనుకు వెళ్ళి సహాయాన్ని అభ్యర్దిస్తే...?' అని క్షణం ఆలోజించింది ధీరజ.
లాభంలేదు...వాళ్ళు చాలా చాకచక్యంగా, తెలివిగా, చురుకుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ బారి నుంచి సింధూని పోలీసులు కాపాడలేకపోవచ్చు...
పర్యవసానం...? ఊహించడానికే భయంకరంగా వుంది !
తనే సాహసించి సింధూకోసం గాలిస్తే...? ఒంటరిగా తను వాళ్ళను ఎదుర్కోగలదా ?
తను అబల కాదు, సబల. పేరే ధీరజ. ధైర్యసాహసాలు తన సొత్తు. తన శక్తియుక్తుల మీద తనకు నమ్మకం వున్నది. అడ్డంకులను అవాంతరాలను ఎదుర్కొని అధిగమించగల చెక్కుచెదరని మనో నిబ్బరం తనకు వున్నది. తనది కఠోర పరిశ్రమ. అన్నింటికీ అతీతంగా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించే దక్షత వున్నది...
అయితే, పద్మవ్యూహంలో అభిమన్యునిగా పోరాడడమే తనకు తెలుసు. కాని కుయుక్తులు, ఎత్తులు, పైఎత్తులు, దొంగ దెబ్బతీయడం తనకు తెలియదే....! ప్రత్యర్థులు సరిగా ఇవే విధానాలను అనుసరిస్తే, తన పరిస్థితి ఏమిటి...? అప్పుడు తను కుడితిలో పడిన ఎలుక ! బోనులో చిక్కిన సివంగి...!