Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 25


    డాక్టరు ఇంజక్షన్ చేయబోతుండగానే ఆ వ్యక్తి వివరాలను అడిగాడు  విక్రమ్.

    డాక్టరు విక్రమ్ ను గుర్రుగా చూశాడు.

    "కొత్త వ్యక్తులను సరాసరి బంగళాలోకి తీసుకురావడం సెక్యూరిటీ నిబంధనలను అధిగమించడమే. అది మొదటి తప్పు. ఇక అతని పూర్తి వివరాలు తెలుసుకోకుండా వైద్యం చేయడం..." విక్రమ్ మాటను వెంటనే అడ్డుకున్నాడు డాక్టరు:

    "మీ డ్యూటీ మీరు చేసుకోండి, డాక్టరుగా నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తాను. వాళ్లు ఎవరయినదీ మాకు అనవసరం - ప్రాణాపాయంలో వున్న వారిని బ్రతికించడమే మా బాధ్యత. మీకు ఎలా తోస్తే అలా చేయండి. అవసరం అనుకుంటే అతనిని అరెస్టు చేయండి! అయినా, స్పృహలో లేని వ్యక్తి వివరాలు అతను స్పృహలోకి వచ్చాకే కదా తెలిసేది...!"

    నిర్మొహమోటంగా అంటూనే పేషెంటుకు ఇంజక్షన్ చేసివేశాడు డాక్టరు.

    విక్రమ్ తల పంకించాడు. అతనికి కోపం వచ్చినా, అణచుకుంటున్నాడు.

    మౌనంగా, భారంగా క్షణాలు దొర్లాయి.

    "మీరిక దర్యాప్తు చేసికోవచ్చు. అతనిప్పుడు  పూర్తిగా స్పృహలోకి వచ్చాడు." అని సర్టిఫై చేసి వెళ్ళిపోయాడు డాక్టరు.

    ఇప్పుడు అక్కడ విక్రమ్, మిగిలిన సిబ్బంది వినా వేరెవరూ లేరు. అటెండెంట్స్ కూడా వెళ్ళిపోయారు.

    ఊరూ పేరూ తెలియని కొత్త వ్యక్తి గెస్ట్ రూమ్ లో దర్జాగా బెడ్ పై పడుకుని వుండడం విక్రమ్ కోపాన్ని రెచ్చగొడుతున్నది.

    దేశ ప్రధానికి వ్యక్తిగత వైద్యునిగా వున్న డాక్టరు ఆ కొత్త వ్యక్తికి ట్రీట్ చేయడం విశేషంగా తోస్తున్నది విక్రమ్ కు.

    ప్రధాని కుమారుడే సెక్యూరిటీ నిబంధనలను అధిగమించి ఒక అపరచితుని సరాసరి బంగళాకు తీసుకురావడం విక్రమ్ కు వూరించలేని పజిల్ అయింది.

    "మిష్టర్! నీ పేరు, వివరాలు చెప్పు!" కమాండింగ్ గా అడిగాడు విక్రమ్.

    అతను కనులు తెరచి, విక్రమ్ ను చికాకుగా చూశాడు.

    "నిన్నే ! అడిగేది వినిపించడం లేదా లేక చెముడా?" రెట్టించాడు విక్రమ్ బిగ్గరగ.

    ఈసారి అతను బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాడు.

    అప్పటికే ఈ గొడవను అటెండెంట్స్ ద్వారా తెలుసుకున్న అభిషేక్ హుటాహుటిన ఔర్ హౌస్ కు వచ్చాడు. విసురుగా వచ్చాడు. విసుగ్గా చూశాడు.

    "ఇతని వివరాలన్నీ నాకు తెలుసు, మీరు అనవసరంగా ప్రశ్నలతో ఇబ్బందిపెట్టకండి. ఇతని విషయంలో సెక్యూరిటీ అంటూ ఫార్మాలిటీస్ వగైరాలేమీ మీరు పాటించనక్కరలేదు. అవన్నీ నేను చూసుకుంటాను. ఇతనితో నేను మాట్టాడాలి, మీరు..." ఇహ వెళ్ళవచ్చు అన్నట్టు చూశాడు అభిషేక్.

    ఆ మాటతో విక్రమ్ గిర్రున వెనుదిరిగాడు. సిబ్బంది అనుసరించారు.

    పొంగి వస్తున్న కోపాన్ని అదుపు చేసికోవడానికే విక్రమ్ మాటమాత్రమైనా అభిషేక్ కు చెప్పకుండా వెళ్ళిపోతున్నట్టు అర్ధం చేసుకున్నారు సిబ్బంది.

    అవును మరి! పర్సనల్ సెక్యూరిటీలో ట్రయినింగ్ అయి, విశేషమైన ప్రతిభను కనబరచబట్టే  ఏరికోరి, రవితేజ స్థానంలో విక్రమ్ ను తీసుకున్నారు ప్రధాని.    

    జరుగుతున్న తతంగాన్ని దూరంనుంచి గమనిస్తున్న రీతు కొత్తగావచ్చిన విక్రమ్ ఉద్యోగ ధర్మానికి అబ్బురపడింది. మళ్లీ అభిషేక్ ఏదో కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నట్టు  అనుమానించి, ఆదరాబాదరా ఔట్ హౌస్ కి వచ్చింది.

    అభిషేక్ ఆమెను ఆహ్వానిస్తూ, కూర్చోమన్నట్టు కుర్చీ చూపాడు.

    బెడ్ మధ్యన మఠం వేసుకు కూర్చుని వున్న ఆ కొత్తవ్యక్తి రీతూను ఎగాదిగా చూస్తూ, పోల్చుకోవడానికి ప్రయత్నించాడు. మరుక్షణం గుర్తుపట్టి చిరునవ్వు నవ్వాడు.

    రీతూ కూడా చూసీచూడగానే అతనిని గుర్తించింది!

    "హమ్మయ్య! గుర్తుపట్టావన్నమాట! మనం కలిసి చాలా సంవత్సరాలయంది కదూ! నువ్వేమీ మారలేదు! ఇప్పుడేం చేస్తున్నావు?" ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది రీతు.

    వాళ్లిద్దరకు పూర్వపరిచయం వున్నట్టు ఇట్టే గ్రహించాడు అభిషేక్.

    అయితే, తానేమీ పొరపాటు చేయలేదన్న మాట! ఎవరో దారేపోయే దానయ్యను తీసుకువచ్చినట్టు సెక్యూరిటీవాళ్లంతా ఇప్పటి వరకు తనను తప్పుపడుతున్నారు! అయినా, తను ముందుగానే అతని దగ్గరి సంచిలోని కాగతాలను, జేబులోవున్న ఇడెంటిటీ కార్డును పరిశీలించి, అతను ఒక జర్నలిస్టు అని, పేరు ఆనంద్ అని తెలుసుకున్నాకనే కారులో వేసుకుని సరాసరి తీసుకువచ్చింది!

    ఆనంద్ తన క్లాస్ మేట్ గా అభిషేక్ కు పరిచయం చేసింది రీతు.

    రీతు, అభిషేక్ ఎంతగా అడిగినా తను ఎలా స్పృహ కోల్పోయి రోడ్డుప్రక్కన పడిపోయిందీ మాత్రం ససేమిరా చెప్పలేదు ఆనంద్. ఉభయుల వద్ద సెలవు తీసుకుని చిరునవ్వు నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇప్పడు అతను ఆలోచిస్తున్నది సింధూ గురించి....


                        *    *    *

 Previous Page Next Page