ఆ సమయంలో ప్రధాని బంగళాలోనే వుంటారని ఎవ్వరూ ఊహించనయినా లేదు!
సెక్యూరిటీ దృష్ట్యా ప్రధాని రాకపోకలను అత్యంత గోప్యంగా వుంచుతున్నారు.
కొత్త వ్యక్తుల నెవ్వరినీ ప్రధాని నివాసంలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. పర్సనల్ ఇంటర్వ్యూలతో సహా అన్నీ టాప్ స్క్రీన్ చేసి అంతా సెంట్రల్ సెక్రటేరియట్ లోనే ఏర్పాటు చేస్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అటెండెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఈ బంగళాలో ఇరవైనాలుగు గంటలూ ఉండగలిగేది.
తండ్రిని చూస్తూనే బిక్కచచ్చిపోయాడు అభిషేక్. తనకు ఊహ తెలిసిన తరువాత తన తండ్రిలో ఇంత ఆవేశాన్ని కోపాన్ని చూడడం అతనికి ఇదే ప్రధమం.
ఈ ఉపద్రవం నుంచి తనను తప్పించగలిగేవారు ఎవరూ లేరా అన్నట్టు బిక్కుబిక్కుగా దిక్కులు చూసాడు అభిషేక్. అతనికి చెమటలుపడుతున్నాయి. గొంతు తడారిపోతున్నది...
ప్రధాని చక్రవర్తి కనులలో ఎర్ర జీరను చూసిన ఆయా అపర్ణ పక్కకు ఒదిగి నుంచుంది.
భర్త గొంతు విని బెంబేలుపడిన విమలా చక్రవర్తి తన వీల్ చైర్ ను తనే ఖంగారుగా తోసుకుంటూవచ్చి, మ్రాన్పడిపోయింది.
మరొక్క క్షణం గడిస్తే ప్రధాని ఝళిపించిన కొరడా దెబ్బలకు అభిషేక్ శరీరం వాతలు తేలేదే! అతని అదృష్టం పండింది.
"ఆగండి సార్...!" అని అరుస్తూ పరుగెత్తుకొచ్చింది పి.ఎస్. రీతు.
ఆ పిలుపుతో ప్రధాని తమను తాము సంబాళించుకుంటూ, ఎత్తిన చేతిని దించుతూ అటు చూశారు. ఆయన ముగ్గోళాలు ఇంకా అదురుతూనే వున్నాయి...!
"సర్! అభిషేక్, మంజు ఇద్దరూ ఒకరు టెన్నిస్ కు ఒకరు స్విమ్మింగ్ కు వెళ్ళివచ్చారు..." రొప్పుతూ చకచకా చెప్పింది రీతు.
భారంగా నిట్టూర్చారు ప్రధాని. అందరినీ ఒకసారి కలయజూశారు. అందరి ముఖాలలో భయం, ఆతురత, ఆందోళన...!
ఈసారి ప్రధాని తేలికగా విశ్వసించారు. కొరడాను రీతూకు అందించి, నిదానంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. వెడుతూ వెడుతూ ఒక్కసారి కొడుకు ముఖంలోకి చూశారు...!
ఆ ఒక్క కోరచూపుకే తలక్రిందులయాడు అభిషేక్.
తేలికపడిన మనసులతో పరిచారకులు అందరు ఎటువాళ్ళటు ఎవరిపనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాతావరణంలో శాంతి నెలకొన్నది.
విమలా చక్రవర్తి రీతూకు సైగద్వారా దగ్గరకు పిలుచుకొని ,ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కింది. 'పెద్ద ప్రమాదాన్ని తప్పించావు తల్లీ!' అనుకున్నది మనసులో.
"థాంక్స్ ఆంటీ...!" లో గొంతుతో రీతూకు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు అభిషేక్.
విమలా చక్రవర్తి వీల్ చెయిర్ ను తోసుకుంటూవెళ్ళి ఆమెను గదిలో దిగబెట్టివచ్చింది అపర్ణ. అప్పటికే అభిషేక్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
"అమ్మా రీతూ! నువ్వు చెప్పింది అబద్ధం కదూ?" అపర్ణ రీతూ భుజం మీద చేయి వేస్తూ నిదానంగా అడిగింది. ఆమె కనుకొనుకుల లో నీరు!
రిచ్చవోయింది రీతు. 'ఆవులిస్తే పేగులు లెక్కిస్తుంది ఈమె!' అనుకున్నది. ఈమె అనుమానించినట్టే మిగిలినవారు కూడా అనుకుంటూ వుంటే...తన పరిస్థితి ఏమిటి?
తన మాటను నమ్మినట్టే కనిపించారు ప్రధాని. తను అబద్ధం చెప్పినట్టు తరువాత ఆయనకు తెలిస్తే, తన గతేంకాను? తనను ఎంత నీచంగా అనుకుంటారు? ఫలితం ఎలా వుంటుంది? ఆపదలో ఒక్క అబద్ధం ఆడితే...
"సారీ ఆంటీ! అప్పటికి అంతకంటే వేరే ఉపాయం తట్టలేదు. ఆ వయసులో అందరి ముందూ అభిషేక్ మీద చేయిచేసుకుంటే, అతని ఆత్మాభిమానం దెబ్బతినదా...? అయినా, నేను పూర్తిగా అబద్ధం చెప్పలేదు. ఈ పిల్లలిద్దరికీ టెన్నిస్ లోను, స్విమ్మింగ్ లోను ప్రావీణ్యం వున్న మాట నిజమే! రేపటినుంచి తెల్లవారఝామునుంచీ ప్రాక్టీస్ చేసినా వచ్చే ఇబ్బంది ఏమీలేదు. ఈ విషయాన్ని వాళ్ళిద్దరకూ నచ్చచెప్పండి" పరిస్థితిని తేలికపరుస్తూ అన్నది రీతు. అంటూనే ప్రధాని గదివైపుకు అడుగులువేసింది.
ఆలోచనలో పడింది అపర్ణ. ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలా అనేదే ఆమె ఆలోచన. వాళ్ళిద్దరూ ఆమెకు రెండు నేత్రాలు మరి!
* * *
ఔట్ హౌస్ లో స్పృహతప్పి పడివున్న వ్యక్తిని డాక్టరు పరీక్షించాడు.
ప్రథమ చికిత్సానంతరం అతను కాస్త స్పృహలోకి వచ్చాడు.
ప్రధాని ప్రత్యేక అంగరక్షకుడుగా వున్న విక్రమ్ అప్పటికే అక్కడకు చేరాడు.