ప్రహ్లాదుడి వ్యక్తిత్వం నుండి నేర్చుకోవలసినది ఏమిటి?

ఈ ఆధునిక యాంత్రిక, గందరగోళ ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ 'ప్రహ్లాదుడు' అత్యుత్తమ ఆదర్శంగా నిలుస్తాడు. ప్రహ్లాదుడి కథ అందరికీ తెలుసు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. లోకకంటకుని కడుపున విష్ణుభక్తుడు జన్మించాడు. రాక్షస గురువుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. తాను నమ్మిన విషయాలకు వ్యతిరేకంగా వారు చేసిన బోధనలను ఖండించలేదు. 'నేనీ చదువును చదవను' అంటూ హీరో డైలాగులు కొట్టలేదు. తండ్రిని వ్యతిరేకించి వాదించలేదు. తోటి విద్యార్థులకు ఉపన్యాసాలిచ్చి నోరు పారేసుకోలేదు. గురువులతో వాదించి, హీరోల్లా వారిని వెక్కిరిస్తూ పాటలు పాడలేదు. మౌనంగా తన పని తాను చేసుకుపోయాడు. ఆవేశాలకు తావివ్వలేదు. విచక్షణకు ప్రాధాన్యమిచ్చాడు. బాలుడైన ప్రహ్లాదుడు ప్రదర్శించిన విచక్షణ పెద్దలు ప్రదర్శించలేదు.

'ఏ పగిది వారు సెప్పిన,

నా పగిదిం చదువు గాని యట్టిట్టని యా 

క్షేపింపడు దా నన్నియు,

రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్.'

తనకు ఇష్టం ఉన్నా, లేకున్నా వారు చెప్పిన చదువు చదివాడు. 'ఇదేమిటి? అదేమిటి?” అని ప్రశ్నించ లేదు. కానీ తన స్వీయవ్యక్తిత్వాన్ని మాత్రం నిలుపుకున్నాడు. తన కిష్టమైన విషయాన్ని వదలలేదు. ఎదుటివారి ఇష్టాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే, ఈ ప్రపంచం సర్వం భగవంతుడి సృష్టి అన్న విజ్ఞానం ఉన్నవాడు, తనలోనూ, ఎదుటివాడి లోనూ దైవాంశను దర్శించగలిగేవాడు ఎవరిని ద్వేషిస్తాడు? ఎవరిని దూషిస్తాడు? ఎవరితో వాదిస్తాడు? అనవసరంగా ఆవేశం ప్రదర్శించి భగవంతుడు అందించిన శక్తిని ఎందుకు వృథా చేస్తాడు? ఈ విచక్షణ ఉన్నవాడు కాబట్టి తాను నిజమని నమ్మిన అంశాన్ని వదలలేదు. ఇతరులు దూషించినా ఆవేశపడలేదు.

తన హీరోని ఎదుటివాడు ఏదో అన్నాడని బాలురే కాదు, పెద్దలూ తన్నుకునే కాలం ఇది. అభిమాన సంఘాల పేరిట ఎదిగినవారు సైతం బాలుర కన్నా కనాకష్టంగా ప్రవర్తిస్తూ తమ జీవితానికి విలువలేనట్టు ప్రవర్తించటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వారికి ప్రహ్లాదుడి గురించిన జ్ఞానం బాల్యంలోనే లభిస్తే! అభిమాన సంఘాలే కాదు, తమను తప్పు దారి పట్టించే వారినెవరినైనా గుడ్డిగా అనుసరించటం మానేస్తారు.

ఇక హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడినే కాదు అతడు దైవంలా భావించే విష్ణువునూ దూషించాడు. ప్రహ్లాదుడిని హింసించాడు. విష్ణువును దూషించినందుకు ప్రహ్లాదుడు ఆవేశపడలేదు. 'నీ అంతు చూస్తా'నని హీరోల్లా సవాళ్లు విసరలేదు. ఈ కాలం సినిమాల్లోని ఆదర్శపాత్రల్లా తండ్రిని ఎదిరించి అవమానకరంగా మాట్లాడలేదు. తండ్రి వాదాన్ని ఖండించలేదు కూడా. అపహేళన చేయలేదు, కేవలం తన వాదాన్ని వినిపించాడు. తన దృక్కోణాన్ని వివరించాడు. మూర్ఖుడి లక్షణాలు చెప్పి మూర్ఖుడు కావద్దని తండ్రికి హితబోధ చేశాడు. ఇంత చేయాలంటే మనిషికి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి! ప్రహ్లాదుడు పలికిన పలుకులు ఎంత మధురమైనవంటే ప్రతి వ్యక్తీ నిత్యం పారాయణం చేయవలసిన అమృతతుల్యాలు.

చదివించిరి నను గురువులు,

చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రీ

చదువు నిత్యజీవితంలో ఉపయోగపడుతుంది. అది శరీరానికి, విద్య మనస్సుకి. వ్యక్తి మనిషిలా ఎదగటంలో తోడ్పడుతుంది. ఎంతో మర్మంగా, గుంభనగా ఈ నిజాన్ని మొదటి అడుగులోనే తండ్రికి స్పష్టం చేశాడు ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుది వ్యక్తిత్వం నుండి తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది ఎంతో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

                                      ◆నిశ్శబ్ద.


More Subhashitaalu