మనిషిలో ఉన్న విచిత్ర స్వభావం ఇదే...

చాలామంది అంటూ ఉంటారు కోరికలను జయించాలని. అయితే కోరికలను జయించడం వాటిని నశింపచేయడం అనేవి మాటలలో చెప్పడం చాలా సులభం. మనిషి జీవితంలో ఎన్నో అనర్థాలకు కోరికలే మూలమని నొక్కి వక్కాణించిన ఆధ్యాత్మిక గురువులు ఎందరో ఉన్నారు. వారు కూడా కోరికలను జయించాలని తమ వాణి వినిపించారు. అయితే వారు కానీ ఇతరులు కానీ చెప్పినంత సులభం కాదు ఈ కోరికలను జయించడం. కోరికలే అనర్థాలకు మూలమని ఆ కోరికలను కోరే వారికి కూడా తెలుసు. వాటికి లొంగిపోతే తమని తాము కోల్పోతామని కూడా వారికి తెలుసు. అయినా సరే వాటికి లొంగిపోయి వాటితో కలసి జీవించడానికే ఇష్టపడుతారు.   

కోరికలతో అనుబంధం లేకుండా ఉండటం కష్టం. ఎందుకంటే, సర్వసృష్టీ కోరికల మయం. కోరిక లేకపోతే సృష్టి లేదు. సముద్రంలోని అలలను ఎవరు నియత్రించగలరు? అలలు ఆగిపోవాలంటే వీచే గాలి ఆగిపోవాలి. భూభ్రమణం ఆగిపోవాలి. అంటే, సృష్టి సర్వం అదృశ్యమైపోవాలి. కాబట్టి మోహాన్ని జయించటం చెప్పినంత సులభం కాదు. ఈ నిజాన్ని గ్రహించి భారతీయశాస్త్రవేత్తలు మనస్సులను అదుపులో పెట్టుకునేందుకు ఎన్నో మార్గాలను సూచించారు.

ముందుగా అందరూ  గ్రహించవలసింది - కోరికలు కలగటం తప్పు కాదు. పాపం కాదు, కోరికలు కలగటంలో వ్యక్తి దోషం ఏమీ లేదు. కోరికలను వ్యక్తి ఆత్మవిశ్వాసంతో జయించాలి, తప్ప, ఆత్మన్యూనతాభావంతో, నేరభావనతో కాదు.ఈ విషయాన్ని  స్పష్టంగా గ్రహించటం, కోరికలను జయించటంలో మొదటి మెట్టు వంటిది. ఎందుకంటే, ఎప్పుడైతే వ్యక్తి తనలో కోరికలు కలగటం వల్ల తాను పాపం చేస్తున్నాను అని భావిస్తాడో, కోరికలుండటం తన తప్పు అని భావిస్తాడో, అలా భావించటమే, ఒక రకంగా, కోరికలు అతడిపై విజయం సాధించినట్టవుతుంది. కోరికలు 'పాపం' అన్న బరువు కింద వ్యక్తి నలిగిపోతాడు. ఎంతగా కోరికలను అణచాలని ప్రయత్నిస్తాడో, అంతగా కోరికలు విజృంభించి అతడిని అణగదొక్కుతాయి.

మానవస్వభావంలో ఓ విచిత్రమైన విషయం ఉంది. వద్దన్న అంశం వైపే అతడి దృష్టి పరుగులు తీస్తుంది. నీరు పల్లం వైపు ప్రవహించినట్టు, 'నిషిద్ధం' వైపు మనిషి మనసు ఆకర్షితమౌతుంది. కాబట్టి ఏదైనా 'పాపం' కాబట్టి ఆ పని 'చేయవద్దు' అంటే అది చేసి తీరతాడు మనిషి. ఈ విషయం మనం పసిపిల్లల్లో కూడా గమనించవచ్చు. ఏదైనా 'వొద్దు' అంటే దాని వైపు పాకుతారు. దాని కోసం చేయి చాపుతారు. 'పసితనం' కాబట్టి మనకది ముద్దుగా అనిపిస్తుంది. హాయిగా ఆడిస్తాం. కానీ ఇదే లక్షణం వ్యక్తితో పాటు ఎదుగుతుంటుంది.

మానవ స్వభావంలోని ఈ లక్షణం గమనించిన మన పూర్వికులు కామం 'పాపం' అని అననే లేదు. అవకాశం దొరికినప్పుడల్లా మనిషి నూరేళ్ళ నిండు జీవితం ఆనందంగా, సంతోషంగా గడపాలని బోధిస్తూ వచ్చారు. అయితే ఆ జీవితం ధర్మబద్ధంగా, శాస్త్ర విహితమైన కర్మలు చేస్తూ బ్రతకాలని బోధించారు.


దాంతో కోరికలు కలగటం 'సహజం' అన్న భావనతో భారతీయధర్మం ఎదిగింది. అందుకే మన దగ్గర కోరికలను అదుపులో ఉంచటానికి ప్రాధాన్యం ఎక్కువ. కోరికలు కలగటం సహజమే అయినా, కళ్ళెం లేని గుర్రంలా వదిలేస్తే కోరికలు వీరవిహారం చేస్తాయి. అదుపు తప్పి మనిషిని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి మనసుకు కళ్ళెం వేయమన్నారు. కోరికలను అణచటంతో విఫలమైనా బాధపడవద్దన్నారు. మళ్ళీ నడుం బిగించి ప్రయత్నించమన్నారు.

విశ్వమంతా భగవంతుడి మయం. 'ఈశావాస్య మిదం సర్వం'. కాబట్టి ప్రతి మనిషి భగవదంశను తనలో ఇముడ్చుకున్నవాడే. కానీ ఇంద్రియాల వశమైన శరీరంలో ఒదగాల్సి రావటంతో, మనిషి తనలోని భగవదంశను గుర్తించలేకపోతున్నాడు. తనలోని భగవదంశను గుర్తించేందుకు ప్రయత్నించటం మనిషి కర్తవ్యం. కాబట్టి, ఎలాగైతే నడక అలవాటు అయ్యేంతవరకూ పిల్లవాడు, పడుతూ లేవటం తప్పనిసరో, అలాగే వ్యక్తికి తన కోరికలపై నియంత్రణ సాధ్యమయ్యేవరకూ ప్రయత్నిస్తూండటం తప్పనిసరి. ప్రతి వైఫల్యం వెనుకా గాఢవిజయం పొంచి ఉందని భావించాలి. నిరాశ పడకుండా ముందుకు సాగాలి. ఇదొక్కటే మనిషి సమర్థవంతంగా చేయగిలిగింది. మనిషి చేతిలో వందశాతం ఉన్నది.

◆నిశ్శబ్ద.


More Subhashitaalu