నిర్వాణానికి రాచబాట వేసే మహామంత్రం!

ఆధ్యాత్మికత అనేది ఎంతో విస్తృతమైనది, అది మరెంతో వ్యక్తి చెందింది. మన భారతదేశంలో ఇది ఒక మెట్టు పైన ఉన్నా మిగిలిన దేశాల్లో కూడా వివిధ రూపాలలో ఇది ఉనికిని కలిగి ఉంది. ముఖ్యంగా అధ్యాత్మికతలో భౌద్దం కూడా ఒక భాగం. భౌద్దంలో  గురువులు కూడా ముక్తికోసం పలురకాల మార్గాలను సూచించారు. నిర్వాణానికి రాచబాట లాంటి ఓ మహామంత్రాన్ని గురించి వివరంగా తెలుసుకుంటే...

తస్మాద్ జ్ఞాతవ్యః ప్రజ్ఞాపారమితామహామంత్రో మహావిద్యా మంత్రో2 నుత్తరమంత్రో సమసమమంత్రః సర్వదుఃఖప్రశమనః సత్యమమిథ్యత్వాత్ ప్రజ్ఞాపారమితాయాముక్తో మంత్రః తద్యథా గతే గతే పారగతే పారసంగతే బోధి స్వాహా

ప్రజ్ఞాపారమిత మహామంత్రాన్ని మహావిద్యామంత్రంగా, సాటిలేని మంత్రంగా, అసమసమ మంత్రంగా, సర్వదుఃఖ ప్రశమనంగా తెలియవలెను. మిథ్య కాదు కనుక ఇది సత్యమని తెలియవలెను. ప్రజ్ఞాపారమితలో చెప్పబడిన ఆ మంత్రం: గతే గతే పారగతే పారసంగతే బోధి స్వాహా. 

హృదయసూత్రం, ఇతర మహాయాన సూత్రాలు చీనాభాష, టిబెట్టుభాష, జపాన్ భాష మొదలగు ఇతర భాషలలోనికి అనువదింపబడినపుడు మంత్రాలు, ధారణిలకు అనువాదం జరుగలేదు. మంత్రాలు, ధారణీల్లోని పదాలకు అర్థం తెలుసుకొనే విధానం సరికాదేమో! ఇవి శబ్దశక్తి కలిగినవి కనుక శబ్దాలకే ప్రాధాన్యం. కనుక ఇతర భాషలవారు మంత్రాలను, ధారణీలను యథాతథంగా వాళ్ల లిపిలో వ్రాసుకొన్నారు. మంత్రం మీద వివరణం కొంచంగానైనా పాఠకులు ఆకాంక్షిస్తారు కనుక వజ్రపాణి అనే వ్యాఖ్యాత వివరణ ఇలా ఉంది. 

 రెండవ ధ్యానంలో చిత్తం, వితర్క విచారాలనుండి  విముక్తమవుతుంది కనుక ఆ స్థితిలో చిత్తం వాగుడు నుండి విముక్తమవుతుంది. (గతే గతే). నాలుగవ ధ్యానంలో శ్వాసప్రశ్వాసలు ఆగిపోతాయి కనుక కాయిక వ్యాపారం నుండి చిత్తం ఆ స్థితిలో విముక్తమవుతుంది. (పారగతే). సంజ్ఞా వేదనీయ నిరోధ సమాపత్తిలో చిత్తం దుఃఖం నుండి విముక్తమవుతుంది కనుక పారసంగతే. మనస్సు పూర్తిగా ఉపశమించాక బోధి. దేవీ మంత్రం కనుక ముగింపుగా స్వాహా.

శూన్యతాధ్యానం వీలుపడని వారిని కూడా అనుగ్రహిస్తూ హృదయసూత్రం చివర అవలోకితేశ్వరుడు మహాకరుణతో ఈ మంత్రాన్ని ప్రసాదించాడు. పెదవులు, నోరు, నాలుక కదిలించకుండా జపించడానికి వీలయ్యే మంత్రం ఇది. భక్తి, శ్రద్ధ, వినయం, గౌరవం తప్పించి ఇతర నియమాలు అక్కర్లేదు. చేయవలసిన దైనందిన పనులు వదలివేసి  చేయవలసిన అవసరం లేదు. ఏమీ పని చేయకుండా ఊరక కూర్చొన్న సమయాల్లో లేదా పడుకొన్నాక నిద్ర పట్టేంతవరకూ చేయవచ్చు. ఏమీ పనిలేని సమయాల్లోనే మనస్సు పనికిమాలిన ఆలోచనలు చేస్తుంది. కనుక అట్టి సమయాల్లో ఈ మంత్రాన్ని ఉపయోగించుకొంటే సరిపోతుంది.

జపించడం అనేది ఒక విధిగా కర్తవ్యంగా భావించరాదు. బరువుగా యాంత్రికంగా చేయనే చేయకూడదు. ఏదో లభిస్తుంది అనే లోభంతో అసలే చేయకూడదు. ప్రార్థన విషయంగానూ ఇంతే జపానికి ముందు కొంతసేపు ఉదాత్తమైన భావన చేస్తే చేసుకోవచ్చు. నిర్వాణానికి రాచబాట ఇది అనీ, ధర్మకాయ ప్రవేశానికి ద్వారాలు తెరచేది ఇది అనీ, బుద్ధులు, బోధిసత్వులు, యోగులు, ఋషులు మొదలగువారి చిత్రాలతో తన చిత్తాన్ని అనుసంధింపజేసేది ఇది అనీ, మారసైన్యాన్ని దూరంగా ఉంచేది ఇది అనీ ఇంకా ఇలా తోచిన రీతిలో కాసేపు ఊహించాక జపం మొదలుపెడితే బాగుంటుంది. జపించేటప్పుడు మౌనంగా జరిగే శబ్దాచ్చారణ మీదనే మనస్సు పెట్టాలి. కాలనియమం, సంఖ్యానియమం, ఆసననియమం అక్కర్లేదు. అధ్యాత్మికంగా ఎవరికివారు ప్రయోగాలు చేయడం, స్వానుభవాన్ని చూసుకోవడం చేయాలి.

                                      ◆నిశ్శబ్ద.


More Subhashitaalu