భగవద్గీతలో సాంఖ్యయోగం చెప్పే రహస్యమిదే...

భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. దీన్నే సంక్షిప్త గీత అని కూడా అంటారు. ఇందులో పరమాత్మ అర్జునుడిని శాంతింపజేసి యుద్దానికి సన్నద్ధుడిని చేయటానికి చావు పుట్టుకల రహస్యం, ఆత్మజ్ఞానం, మానవులందరూ కోరే సచ్చిదానందమైన భగవదైక్యం, దాన్ని పొందటానికి ఉన్న రెండు మార్గాలు సాంఖ్యయోగం, కర్మయోగం గురించి చిన్న విపులీకరణ, స్థిత ప్రజ్ఞత, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మానందం పొందటం ఎలా అనే అంశాలు వివరిస్తాడు. భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. అర్జునుడు ముందుగా "ఓ కృష్ణా! బంధువులమీద ఉండే వాత్సల్యం వల్ల నాకు కర్తవ్యం బోధ పడడంలేదు. ఈ హత్యలు చేయలేను, నాకు రాజ్యము వద్దు" అంటాడు.

అప్పుడు భగవంతుడిలా అన్నాడు "ఓ అర్జునా! పిరికిపందలా  మాట్లాడకు. అసలు చచ్చేదెవరు? చంపేదెవరు? చావంటే ఏమిటి? శరీరంనుంచి ప్రాణం పోవటం చావు కాదు.  ఆత్మ చావులేనిది. దానికి శీతోష్టాలు లేవు, నీటిలో తడవదు, ఆత్మ అగ్నిలో దగ్ధమవదు, దానికి విచారం సంతోషం లేవు. ఆత్మ మనిషి శరీరమంతా, కోటలో ఉన్నట్లుంటుంది. మనం మురికి బట్టలు వదిలేసి కొత్తవి ధరించినట్లు పాతబడ్డ జీర్ణించిన శరీరం వదలి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. దీన్ని ఆపడం ఎవరి వల్లాకాదు. ఈ ప్రక్రియే చావు. అంతే... దీనికోసం బుద్ధిమంతులు విచారించరు. 

ఏదన్నా నిత్యము, తధ్యము అంటూ ఉంటే అది చావే. కాబట్టి దానికి చింతించడం తగునా? నీవు చంపకపోయినా వాళ్ళు చచ్చేది తప్పదు. ఎందుకంటే వాళ్ళని చంపేది నువ్వుకాదు. వారి దుష్కర్మలే వారి చావుకి కారణం. సర్వవిశ్వానికి ఆధారమైనది నిర్వికార నిరంజనుడైన పరమాత్మ. మరి ఇప్పుడు నువ్వు యుద్ధం ఆపి  శత్రువులలో చులకన అవటం కంటే మరణించి యుద్ధంలో మరణిస్తావు కాబట్టి వీరుడిగా వీరస్వర్గం పొందటం మంచిది కదా. విజయం, ఓటమి  తెలిసేది ఎవరికి? వాటి గురించి ఆలోచన నీకు ఎందుకు?? అది నీకు అనవసరమైన విషయం. నీ విద్యుక్త ధర్మం (కర్మ) చెయ్యి, నువ్వు చేయవలసిన పని చేసి దాని  ఫలితం పరమాత్మకు వదిలిపెట్టు, దాని గురించి ఆలోచించకు. అప్పుడు దాని వల్ల కలిగే ఫలము ఏదైనా సరే నీకు అంటదు. కాబట్టి నీకు దోషము అంటకుండ ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏ కోరికా లేకుండా ఆచరించే కర్మలవల్ల ముక్తి లభిస్తుంది కానీ పాపం అంటదు. 

కేవలం స్వర్గ సుఖాలు కోరి యజ్ఞయాగాల వంటి కర్మలు చేసేవారు స్వర్గంచేరి సుఖాలు పొందినా నిత్యానందకరమైన భగవంతుని చేరలేరు. నిజంగా భగవంతుని కోరి వానిలో లీనమయ్యే వానికి ప్రాపంచిక సుఖాలతో పనిలేదు. చక్కగా నదిలో స్నానం చేసేవాడు బావిలో స్నానం చేయాలనుకోడు కదా. సుఖదు:ఖాలు, శీతోష్టాలు, మానావమానాల మీద ఎవడికైతే సమబుద్ధి ఉంటుందో వాడు పాపపుణ్యములను వదిలివేసి పరమాత్మయందు మనస్సును ఉంచగలుగుతాడు. అలాగే మోక్షం సాధించగలడు.

వాడే స్థితప్రజ్ఞుడు. వాడికి భయ క్రోధాలు, రాగద్వేషాలు, సుఖదు:ఖాలు, ఇష్టాయిష్టాలుండవు. ఇంద్రియాలనన్నిటినీ అవి కలిగించే సుఖాలనుండి వేరు చేయకలడు. తద్వారా విషయాసక్తి నశించి కామ, క్రోధ, మోహ, మదములనుండి విముక్తుడయి పరమాత్మ తత్త్వమెరిగి పరమశాంతి పొందుతాడు. బ్రహ్మపదం పొందగలుగుతాడు. అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తాడు.

                                  ◆నిశ్శబ్ద.


More Subhashitaalu