దేవుడి మీద నమ్మకానికోక ఉదాహరణ!

ఒక సన్యాసి తన శిస్యులతో కలసి ఉత్తర భారతదేశంలో యాత్రలు చేస్తూ ఉత్తరాంచల్లో గంగోత్రి నుండి వెళుతున్నారు. వర్షాకాలం మొదలైంది. వర్షాలు పడ్డాయి. దాంతో, కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తోవలో ఒక చిన్న నదిని దాటాల్సి వచ్చింది. దాటుదామంటే వంతెన లేదు. అక్కడ నీళ్ళలోకి దిగడం చాలా అపాయకరం.  దారి పొడవునా ఉన్న రాళ్ళను దాటుతూ దిగడం కష్టంగానే ఉంది. ఒక చోట నిలబడి చూస్తున్నారు. నదికి అవతలి తీరంలో ఓ గ్రామం ఉంది. అది ఇటు నుంచి కనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే పెద్ద వాన పడినందువల్ల నదిలో నీళ్ళు వేగంగా ప్రవహిస్తున్నాయి. ఆరడుగుల కన్నా పొడవున్న ఓ వ్యక్తి అంతకు ముందే అవతల తీరంలో నిల్చొని చూస్తున్నారు. సన్నగా ఉన్న సన్న్యాసి ఆ ప్రవాహంలో దిగాలని ఆలోచించడం మృత్యువును కోరి కొని తెచ్చుకోవడంతో సమానం. కానీ వేరే దారి లేదు. అక్కడ రాత్రి గడపదగ్గ ఆశ్రయమేదీ లేదు. 

కాస్త దూరంలో ఒక వ్యక్తి ధాన్యపు సంచీలు పెట్టుకొని, ఊలు దుప్పటి కప్పుకొని, చిన్న ఆశ్రయంలా చేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆ సంచీలు కూడా ఊలుతో అల్లినవే. వాటిని ఎంత దగ్గరగా, దిట్టంగా అల్లుతారంటే  ఒక చుక్క నీరు కూడా లోపలకు దూరదు. సన్న్యాసి అతని దగ్గరకు వెళ్ళి ఎక్కడ లోతు తక్కువుందని అడిగారు. ఆ పొడుగు సన్యాసి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని చూపించాడు. 

అంతే! సన్న్యాసి తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ అటు వెళ్ళారు. చేతిలో అయిదడుగుల కర్ర ఉంది. ఒక చిన్న సంచీలో భగవద్గీత, చాకు, అగ్గిపెట్టె, కొవ్వొత్తి లాంటి చిన్న చిన్న వస్తువులు, చేతిలో ఒక కమండలం ఉన్నాయి. ఒక కంబళి, భుజం మీద రెండు బట్టలు  సన్న్యాసి దగ్గర ఉన్న వస్తువులు అంతే! సన్న్యాసి జాగ్రత్తగా నీటిలోకి దిగి నడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే రాళ్ళ మీదయితే జారిపడే ప్రమాదం ఉంది. కర్ర సహాయంతో సన్న్యాసి సగం దూరం దాటి ఉంటారు. ఇంతలో ప్రవాహం ఇంకా ఉదృతమైపోయింది. ప్రవాహానికి ఎదురుగా కర్ర ఆన్చి నడుస్తున్నారు కానీ మధ్యలో గొయ్యి ఉంది. కర్ర ఆన్చలేక పోయారు. ఫలితంగా, ప్రవాహంలో పడిపోయారు. ఒక్కసారి నీటిలోకి వెళ్ళిపోయారు. ఇంతలో ఒక పెద్ద బండరాయి కర్రకు తగిలింది. కర్ర ఆన్చడం కోసమే ఎవరో అడ్డంగా పెట్టినట్లుగా ఉందా రాయి. లేచి నిల్చొని, కర్ర పట్టుకొని నడిచి నది దాటారు.

సన్న్యాసి నోటిలోకి ఒక్క నీటి చుక్క కూడా వెళ్ళలేదు. దెబ్బలు తగలలేదు. ఆయన తిన్నగా నది దాటి, రెండో ఒడ్డుకు చేరిపోయారు. అన్ని వస్తువులూ తడిసిపోయాయి కానీ ఏదీ పాడవ లేదు. నష్టమేమీ జరగలేదు. చేతిలో ఉన్న కమండలం కూడా సురక్షితంగా ఉంది. ఆ పొడుగు వ్యక్తి, మరొక గ్రామస్థుడు  సన్న్యాసికి సహాయం చెయ్యడానికి దగ్గరకు వచ్చారు. అక్కడ నుంచి గంగానది సంగమంలో నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. నీటిలోకి దిగడం అపాయంతో కూడుకున్న పని. క్షణంలో అంతా జరిగింది. ఆ పరమేశ్వరుడే వచ్చి రక్షించాడు. ఇది ఓ సన్యాసి నిజ అనుభవం. దేవుడిని నమ్మితే కచ్చితంగా ఆ దేవుడు ప్రమాదం నుండి గట్టెక్కిస్తాడు. కావాల్సిందల్లా నమ్మకమే.

                                         ◆నిశ్శబ్ద.


More Subhashitaalu