వ్యక్తిత్వానికి పద్యాల పాఠాలు!

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

అతిసులభంగా అర్థమయ్యే పద్యం ఇది. కోపాన్ని మించిన శత్రువు, శాంతాన్ని మించిన రక్షణ, దయను మించిన చుట్టం, సంతోషాన్ని మించిన స్వర్గం, దుఃఖాన్ని మించిన నరక బాధ లేదు... కామన్ సెన్స్ ఇది.

కోపం మనిషి విచక్షణను హరించేస్తుంది. కోపం వల్ల కలిగే ఉద్రేకంతో మనిషి పశువు అవుతాడు. ఆలోచన నశిస్తుంది. ఎదుటి వ్యక్తిని ఏదో రకంగా హింసించాలి, బాధించాలి అన్న భావన తప్ప, తన చర్యల ఫలితం గురించి ఆలోచన ఉండదు. దాంతో అనకూడని మాటలు అనేస్తాడు. చేయకూడని పనులు చేస్తాడు. కాబట్టి వ్యక్తి వీలైనంతగా కోపాన్ని అణచుకోవాలి. శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, శాంతంగా ఉండే మనిషిని ఎవరూ మోసపుచ్చలేరు.

శాంతం అభ్యాసం వల్ల వస్తుంది. వ్యక్తి తన మనోభావాలను అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం, అవిశ్రాంతంగా చేసే ప్రయత్నం వల్ల శాంతం వస్తుంది. వ్యక్తి తనకు ఎందుకు కోపం వస్తోందో గ్రహించాలి. తన కోపానికి కారణం విశ్లేషించాలి. అనేకసందర్భాలలో, గమనిస్తే, కోపం రావటానికి బయటి సంఘటనలు ప్రేరేపకాలుగా కనిపించినా, కోపం వ్యక్తి మనస్సులోంచే వస్తుంది.

ఆఫీసులో బాసు తిడతాడు. బాసుని ఏమీ అనలేదు. ఇంటికి రాగానే పిల్లవాడు చాక్లెటో, పుస్తకమో, ఫీజ్లో ఏదో అడుగుతాడు. చర్రున కోపం వస్తుంది.  అనుకున్నదేదో కాదు. ఎంత ప్రయత్నించినా పని పూర్తి కాదు. ఆ సమయంలో ఎవరు పలకరించినా కోపం వచ్చేస్తుంది. అరిచేస్తాం. అవసరమైనది దొరకదు. ఎంత వెతికినా దొరకదు. ఆ సమయంలో అవసరమైన వస్తువులను ఎక్కడో పెట్టి మరిచిపోయిన తనను తిట్టుకోడు మనిషి. దాన్ని ఎవరో తీశారని అరుస్తాడు. ఇల్లు సర్దినవారిపై విరుచుకుపడతాడు. ఆ తరువాత అందరినీ తిట్టినందుకు బాధపడతాడు.

బహుళ కావ్యములను బరికింపగా వచ్చు

బహుళ శబ్ద చయము పలుక వచ్చు 

సహన మొక్కటప్ప చాల కష్టమ్మురా 

విశ్వదాభిరామ వినుర వేమ.

అనేక గ్రంథాలు చదవవచ్చు. అనేక శబ్దాలను పలకవచ్చు. కానీ సహనం అలవరచుకోవటం చాలా కష్టం ని భావం. 

ప్రస్తుత సమాజంలో అసహనం అలంకారం అయింది. మన సినీహీరోలు ప్రతి చిన్న విషయానికీ భీకరముష్టి యుద్ధాలు చేస్తూండటం, ప్రతీకార ప్రతిజ్ఞలు పడుతూండటంతో, వారి వల్ల త్వరగా ప్రభావితమయ్యే సమాజం అసహనానికే పెద్ద పీట వేయటం చూడవచ్చు.

క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోగానే దేవుళ్ళలా భావించిన ఆటగాళ్ళను దూషించి, బొమ్మలు తగులబెట్టి నానాహంగామా చేస్తారు అభిమానులు. ఆటగాళ్ళ ఇళ్ళపై దాడులు చేస్తారు. ఓ ఇద్దరు సినీనటులు బహిరంగంగా దూషించుకుంటే, వారి అభిమానులు వీధుల్లో పడి కొట్టుకుంటారు.

ఇక రోడ్ల మీద ప్రతి చిన్నవిషయం ఆవేశకావేశాలకు దారి తీయటం మనం చూస్తూనే ఉన్నాం.  పనికి రాని ఆవేశాల వల్ల నిండు జీవితాలు వ్యర్థంగా, అనవసరంగా బలైపోవటమే కాదు, వారి మీద ఆధారపడ్డ ఇతరుల జీవితాలు అల్లకల్లోలం అవుతాయి.

ఎప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడు సహనం ప్రదర్శించాలి అన్న విచక్షణ ఉండటం వ్యక్తి జీవితంలో అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. అనవసరంగా వ్యర్థప్రేలాపన చేయటం, వాడిని చంపేస్తా, వీడిని చంపేస్తా నని ప్రగల్బాలు పలకటం, వాడెంత వీడెంత అని ఎదుటివాడి స్థాయిని గ్రహించకుండా చులకన చేయటం, సర్వం వ్యక్తి మూర్ఖత్వానికి విదర్శనాలు.

                                         ◆నిశ్శబ్ద. 


More Subhashitaalu