బ్రహ్మచర్యం గురించి పురాణాలు ఏమి చెప్పాయి?

మనిషి సుఖాలకు దూరంగా ఉండాలని, బ్రహ్మచర్యం చేయాలని అనుకుంటూ వుంటాడు. అయితే బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న భీష్ముడైనా పరకాంతలతో మాట్లాడుతూ కనిపిస్తే అపకీర్తి పాలవుతాడు. అలాగే మంచి శీలవతి అయినా పరపురుషుడితో స్నేహంగా ఉంటే నిందలు మోయాల్సివస్తుంది. రావణాసురుడు 'సీత'ను అశోకవనంలో ఉంచాడని, అతడితో తిన్నగా మాట్లాడక సీత 'గడ్డి పోచ' ద్వారా రావణుడితో మాట్లాడిందని అందరికీ తెలుసు. ఐనా 'సీత'ను శంకించారు. నీలాపనిందలను ఆమె భరించాల్సి వచ్చింది. పదిమంది ఓ అబద్ధాన్ని పదిసార్లు పలికితే, ఆ అబద్ధమే నిజమై కూచుంటుంది. కాబట్టి స్త్రీపురుషులు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట.

భారతీయధర్మంలో ఓ చోట బ్రహ్మచర్యదీక్షలో విజయం సాధించాలనుకున్నవాడు సజీవస్త్రీలను పక్కనబెడితే కనీసం స్త్రీల చిత్రాలను కూడా చూడరాదు. కొయ్యతో చేసిన స్త్రీ చిత్రం. పాదాంగుష్టాన్ని కూడా తాకరాదు  అని ఓ నియమం ఉంది. ఇప్పుడు ఈ నియమం విన్నవారు నవ్వవచ్చు. 'స్త్రీల చిత్రపటాలను చూస్తే ఏమవుతుంది? కొయ్య బొమ్మను తాకితే ఏమవుతుంది? అంతా చాదస్తం అని కొట్టేయవచ్చు. దీన్ని వివరిస్తూ ఓ పురాణకథ ఉంది.

బ్రహ్మ రతీదేవిని సృజించాడు. ఆమెని చూడగానే అంత వరకూ నియమంగా ఉన్న దేవతలందరి మతి చలించింది. ఆమెను పొందేందుకు దేవతల నడుమ కొట్లాటలు మొదలయ్యాయి. బ్రహ్మకు కూడా రతిపై మోహం కలిగింది. అంటే, అందానికి చలించి, మోహించటం అన్నది స్వభావం అన్నమాట. దేవతలు సైతం రతిమోహ పరవశులయ్యారంటే, ఇక మామూలు మనుషుల గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకే పరస్త్రీని తలెత్తి చూడరాదు. బొమ్మలను చూడకూడదు. చివరికి స్త్రీ కొయ్య బొమ్మని కూడా తాకకూడదు అని నియమాలు విధించాడు బ్రహ్మ.

ఓ తపస్వి ఏకాంతంలో ఉంటూ, ఎండుటాకులను తింటూ నిరంతరం తపోనిరతుడై ఉన్నాడు. అతడికి తపస్సు చేయాలన్న సంకల్పం తప్ప మరో కోరిక లేదు. ఎటువంటి కోరిక కోరీ అతడు తపస్సు చేయటం లేదు. ఆయన ఓ రోజు ఉదయం స్నానానికి వెళ్తుంటే, కాలికి కొయ్య బొమ్మ తగిలింది. ఓ సుందరమైన స్త్రీ కొయ్య బొమ్మ అది.. దాన్ని చూస్తూ ఆ తపస్వి ఆ బొమ్మను తయారుచేసిన కళాకారుడి కళాకౌశలానికి ఆశ్చర్యపోయాడు. ఆ స్త్రీ లావణ్యానికి, శరీరనిర్మాణానికి ముగ్ధుడయ్యాడు. 'ఈ బొమ్మకు ప్రాణం వస్తే ఎంత బాగుండు' అనుకున్నాడు.

అంత వరకూ ముని ఎటువంటి కోరికా కోరలేదు. దాంతో ఒక్క కోరిక కోరాడు కదా అని సంతోషించి భగవంతుడు వెంటనే అతడి కోరిక తీర్చాడు. ఆ కొయ్య బొమ్మ సజీవమూర్తి అయింది. తపస్వి ఆశ్చర్యపడ్డాడు. ఆపై ఆమె గురించి తెలుసుకోవాలని కుతూహలపడ్డాడు. ఆమెని తాకాడు. ఇద్దరూ పరవశులయ్యారు. వివశులయ్యారు. 

ముని తపస్సు, గిపస్సు మరచిపోయాడు. ఆమెను వివాహమాడాడు. పిల్లల్ని కన్నాడు. సంసారంలో పడ్డాడు. తపశ్శక్తి మొత్తం పోగొట్టుకున్నాడు. ఎప్పుడూ సంసారం గురించిన ఆలోచనలేని  తపస్వి భ్రష్టుడై సంసారి అయ్యాడు. పతనమయ్యాడు. అందుకే, స్త్రీ కొయ్య బొమ్మని తాకినా బ్రహ్మచర్యవ్రతం భంగమయ్యే అవకాశం ఉంటుందంటుంది శాస్త్రం. 

బ్రహ్మచర్యం పాటించాలనుకున్నవాడు కాముక పురుషుల సాంగత్యానికి దూరంగా ఉండాలన్న నియమం ఉంది. ఎలాగయితే సిగరెట్ తాగేవారి వద్దనుండి సిగరెట్ వాసన వచ్చి పక్కనున్న వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో, అలాగే కాముకుల సాన్నిహిత్యం ఎటువంటివాడి దృష్టినైనా కామం వైపు ఆకర్షింపచేస్తుంది.

సౌభరి అనే మహర్షి అందరి సంగమానికి దూరంగా జలంలో ఉండి తపస్సు చేసుకొనేవాడు. ఆ జలంలో అతడు మైథునంలో ఉన్న చేపలను చూశాడు. వాటి ప్రభావంతో అతడి మనస్సు చలించింది. 'నేనింతకాలమూ తపస్సు చేస్తూ గృహస్థు సౌఖ్యాలను అనుభవించలేదు' అనుకున్నాడు. ఆ సంకల్పం ఫలితంగా అతడు యాభైమంది రాజకుమార్తెలను వివాహమాడాడు. ఈ పురాణకథలన్నీ బ్రహ్మచర్యం ఎంత కఠినమో నిరూపిస్తాయి. 

                                     ◆నిశ్శబ్ద.


More Subhashitaalu