సాధనలో ఇదే మొదటి అడుగు!

మనిషి మెదడు సూది మొనలాగా, ఎక్కువ శక్తిని తక్కువ స్థలంలో కేంద్రీకృతం చేయగలిగితే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలా కాక ఎక్కువ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే, శక్తి మొత్తం ఎక్కువ ప్రాంతంలో విస్తరించాల్సి రావటంవల్ల బలహీనమై పోతుంది. అందుకని ఏదైనా ఒక పనిని సంపూర్ణ ఏకాగ్రతతో సాధించే ప్రయత్నం చేస్తే సఫలమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనిషి మెదడులో 'ఏకాగ్రత' ఈ సూది మొనలాంటి పని చేస్తుందన్న మాట. ఇది గ్రహించిన మన పూర్వికులు ఈ ఏకాగ్రత సాధించేందుకు 'మననం' మంచి మార్గం అని నిశ్చయించారు. ఈ 'మననం' ద్వారా వేదాలను 'చిరంజీవి'గా నిలిపారు.

ఏదైనా నేర్చుకోవాలంటే దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి నేర్చుకొంటే, ఎంత పెద్దదైనా సులభంగా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు భగవద్గీతలోని శ్లోకాన్ని తెలుసుకుందాం.

'యథాదీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా' అనే పాదాన్ని నేర్చుకోవాలంటే దాన్ని యథా, దీపో, నివాతస్థో ఇలా విడగొట్టి నేర్పుతారు. ఆపై యథాదీపో ఇలా నేర్పుతారు. ఆ తరువాత ఇలాగే వెనుక నుంచి ముందుకు చదువుతారు. ఆపై ఒకో అక్షరాన్నీ వేరు చేసి చదివిస్తారు. ఇలా నేర్పటంతో వ్యక్తి దృష్టి మొత్తం శ్లోకం పైనే కేంద్రీకృతమౌతుంది. ఒక్కసారి నేర్చుకున్నది ఇక మరచిపోవటం జరగదు. ఏకాగ్రత సాధనకు ఇది ఒక సులువైన పద్ధతి. ఈ పద్ధతి నుంచే 'బట్టీ' పద్ధతి వచ్చింది.

'బట్టీ పట్టటం' అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. కానీ ఏకాగ్రత సాధనలో మొదటి అడుగు బట్టీ పట్టటం. ఎలాగయితే విద్యార్థి అక్షరాభ్యాసం 'అఆ'లు దిద్దటంతో ఆరంభమవుతుందో వ్యక్తి ఏకాగ్రత సాధన, ధ్యానమార్గానికి ఆరంభం బట్టీ పట్టటంతో అవుతుంది. పిల్లవాడికి 'అ ఆ' అని అనిపిస్తూ అక్షరాలు దిద్దిస్తాం. ఎందుకంటే అక్షరానికి, భావానికి నడుమ ఉన్న అనిర్వచనీయమైన అనుబంధం వివరణకు ఒదగదు. కానీ మెదడు దాన్ని గ్రహిస్తుంది. అందుకే అక్షరాన్ని ఉచ్చరిస్తూ దిద్దటం ద్వారా మెదడు, కళ్ళు, చెవులు, చేతులు అన్నీ సంయుక్తంగా ఆ అక్షరరూపాన్ని, శబ్దాన్ని, భావాన్ని తమలో ఇముడ్చుకుంటాయి. 

అందుకే కొంత కాలం గట్టిగా ఉచ్చరిస్తూ అక్షరాన్ని దిద్దిన పిల్లవాడు, కొంత కాలానికి అక్షరాల్ని చూడగానే గుర్తుపట్టగలుగుతాడు. ఆ తరువాత అక్షరాన్ని గట్టిగా పైకి అనకుండా రాయగలుగుతాడు. అంటే వ్యక్తి ఏకాగ్రత సాధనలో ఒక అడుగు దాటి పైకి వెళ్ళినట్టన్నమాట. అలా కాక నేర్పేటప్పుడు పైకి అక్షరాన్ని ఉచ్చరించకుండా మనస్సులోనే అనుకుంటూ రాయటం చేస్తే, పిల్లవాడి గ్రహణశక్తి దెబ్బ తింటుందని, పైకి ఉచ్చరిస్తూ రాసే పిల్లవాడిలో ఉన్న చురుకుదనం, మనసులోనే అనుకునే పిల్లవాడిలో ఉండదని శాస్త్రవేత్తల ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. దీనికి కారణం ఉంది.

మన ప్రపంచం నామరూపాత్మకమైనది. అంటే దేన్నైనా మనం పేరుతో, రూపంతో గుర్తించగల్గుతాం. నామరూపరహితమైనదాన్ని ఊహించటం కుదరదు. ఊహను వివరించటం కుదరదు.

'చీమ' అనగానే ఒక ప్రత్యేకరూపం కళ్ల ముందు మెదులుతుంది. అలాగే బల్ల, రాముడు, కుర్చీ, జార్జ్ బుష్ ఇలా పేరు రూపం లేకపోతే ప్రపంచంలో దేన్నయినా గుర్తించటం కుదరదు. ఉదాహరణకు 'నేను నా ఫ్రెండ్' అన్నాననుకోండి. నాకు తప్ప ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. అలా కాక నేను నా గురించి వివరించి, నా ఫ్రెండ్ రూపరేఖలను వర్ణిస్తే ఇద్దరితో పరిచయం ఉన్నవారు సులభంగా గుర్తుపట్ట గలుగుతారు. పరిచయం లేనివారికి కూడా ఓ అవగాహన కలుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ ఫ్రెండ్ ప్రసక్తి వస్తే గుర్తు పడతారు.

ఇది గ్రహించిన మనవారు పైకి అనటం, పెద్దగా చదవటం, బట్టీ పట్టటం వంటి చిట్కాలను ఏర్పరచారు. బిగ్గరగా చదువుతూ బట్టీ పట్టటం సత్ఫలితాలను ఇవ్వటం వెనుక మరో కారణం ఉంది.

మనిషి మనస్సు నిత్యచంచలమైంది. ఏ ఒక్క విషయంపై స్థిరంగా ఉందదు. పలు విషయాలపై పరుగులిడుతూంటుంది. అటువంటప్పుడు 'శబ్దం' మనసును ఒక విషయంపై కేంద్రీకృతం చేయటంలో తోడ్పడుతుంది. వ్యక్తి బిగ్గరగా చదవటం వల్ల, అతని స్వరం సృష్టిస్తున్న శబ్దాలు చెవుల ద్వారా మళ్ళీ అతనిలోకి చేరతాయి. అటూ ఇటూ పరిగెత్తుతున్న మనస్సు ఉలిక్కిపడి మళ్లీ అతడు వల్లె వేస్తున్న విషయాల పైకి ప్రసరిస్తుంది. ఈ రకంగా పైకి చదవటం వల్ల చెదురుతున్న వ్యక్తి ఏకాగ్రత స్థిరపడుతుంది. ఇది దైవసంబంధిత మంత్రాలను వల్లె వేయటంలో గమనించవచ్చు.

కొందరు స్తోత్రాలను, మంత్రాలను బిగ్గరగా చదువుతారు. దాన్ని చుట్టుపక్కలవారు. హాస్యం చేయవచ్చు. హేళన చేయవచ్చు. కానీ ఏకాగ్రత సాధనలో అది ఒక మార్గం.

                                      ◆నిశ్శబ్ద.


More Subhashitaalu