పుష్కర శోభలో సింధూ సంబరం!!

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. మన భారతదేశంలో నదులు కేవలం నీటితో ఉండే వనరులు కావు. అవి దేవతా స్వరూపాలుగా ఎంతో పవిత్రతను సంతరించుకుని ఉంటాయి. అలాంటి నదులలో సింధూ నది ఒకటి. ఇది ఎంతో ప్రాచీనమైనది. ఈ సింధూనది ఆకాశగంగలో ఒక భాగంగా పురాణాలలో చెప్పబడింది. భగీరథుడి కష్టం వల్ల ఆకాశగంగలో నుండి ఒక బిందువు కొలనులో పడగా అది ఏడు భాగాలుగా విడిపోయి నదులుగా మరి ప్రవహించింది. వాటిలో మూడు తూర్పు దిశగా ప్రవహిస్తే మిగిలిన నాలుగు పశ్చిమ దిక్కు వైపు ప్రవహించాయి.  సుచక్షు, సీత, సింధు పశ్చిమ దిక్కు వైపు, హ్లాదిని, పావని, నలిని తూర్పుగానూ ప్రవహించాయి. అయితే ఏడవది భగీరథుడి వెంట వెళ్లి పాతాళంలోకి చేరి అక్కడ ఆయన తండ్రులు మరియు తాతల హస్తికలను తాకి వాళ్లకు ముక్తిని ప్రసాదించింది.

అలా ఆకాశ గంగలో భాగమైన సింధూ నదికి ఈ సంవత్సరం ప్రస్తుతం పుష్కరాల వైభవం నడుచుకుంటూ వచ్చింది. పుష్కరుడు అంటే వరుణదేవుడు వాడుకబాషలో చెప్పాలంటే వానదేవుడు. ఈయన పన్నెండు నదులలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నది మారుతుంటాడు. అలాంటి సందర్భమే పుష్కరాల సమయం. 

పుష్కరాలకు ఎందుకంత ప్రాధాన్యత??

నదులు దేవతా స్వరూపాలని, పవిత్రతను నింపుకున్నవని చెప్పుకున్నాం. ఆ నదులలో ఉన్న వానదేవుడు ఒక నది నుండి మరొక నదికి మారేటప్పుడు సకల దేవతలు ఆ నదీ ప్రాంతానికి వస్తారు, ఎందరో మహర్షులు ఋషులు అక్కడికి వచ్చి హోమాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తారు.  ఆ యజ్ఞాలు, యాగాలు నిర్వహించేటప్పుడు సకల దేవతలకు ఆహారంగా నిర్దేశించిన పదార్థాలను అగ్నిలోకి విడచడం వల్ల వాటిని స్వీకరించడానికి ఆయా దేవతలు వస్తారు. వారు అలా స్వీకరించడం వల్ల కలిగే పుణ్యఫలం, యజ్ఞ, యాగాల వల్ల  కలిగిన యాగఫలం, పుష్కరాలు జరిగినన్ని రోజులు అక్కడికి వచ్చిన యోగులు తపస్సు చేయగా వచ్చిన తపో ఫలం. ఇలా అన్నీ వారు సొందూ నదిలో నదీస్నానం చేయడం వల్ల ఆ నదిలో కలసి ఎంతో శక్తిమంతమైనది గానూ, పవిత్రతనూ సంతరించుకుంటుంది. ఇది కేవలం సింధూ నదికి కాదు ఆయా పుష్కరాలు జరిగేటప్పుడు ప్రతి నదికి ఇలాంటి శక్తి చేకూరుతుంది.

అలాంటి సమయంలో ఆ నదులలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగి మనుషుల జన్మ సార్థకం అవుతుంది. అంతేకాదు ష్ఇవుడికి ఎంతో ఇష్టమైన జలాభిషేకంను నదీ ప్రాంతాలలో చేయించడం వల్ల, అందులో ఈ కార్తీక మాసంలో మరింత శక్తివంతమైన ఫలితాలను చేకూర్చుతుంది. 

పుష్కర సమయంలో నదీ స్నానం చేసేటప్పుడు కింది శ్లోకాన్ని చెప్పుకుంటూ స్నానం చేయాలి.

"పిప్పలాద్సముత్పన్నే కృచ్చే లోక భయంకరి 

మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయ" అనే మంత్రాన్ని చెప్పుకుని నదిలోకి మట్టిని విసిరి, నీటిని తలపై చల్లుకోవాలి. ఆ తరువాత కుడిచేతితో నీటిని తీసుకుని తాగాలి. (ప్రస్తుత కాలంలో నదీ జలాలు కలుషితం అవ్వడం దృష్ట్యా నదీ నీటిని తాగడం గురించి ఎవారికైనా అభ్యంతరాలు ఉంటే వారి ఇష్టప్రకారం వదిలేయవచ్చు). 

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories