నీటిలో ఇవి కలిపి శ్రావణమాసంలో శివాభిషేకం అభిషేకం చేస్తే..!
శ్రావణ మాసంలో చాలామంది శివాభిషేకం చేయించుకోవడానికి ఆసక్తి చూపుతారు. చాలామంది తమకు తామే శివాభిషేకం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఇంటిలో శివలింగం ఉంచుకుని ప్రతి రోజూ శివలింగానికి అభిషేకం చేయడం వల్ల చెప్పలేనంత పుణ్య ఫలం, ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కావచ్చు. అయితే నీటిలో కొన్ని పదార్థాలు జోడించి శివాబిషేకం చేస్తే అది మరింత గొప్ప ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఏ వస్తువులను అభిషేక జలంలో ఉపయోగించాలో తెలుసుకుంటే..
గంగాజలం..
సాధారణంగా కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తమ వెంట గంగాజలం తీసుకుని వస్తుంటారు. లేదా ఇతరులు అయినా తెచ్చిస్తుంటారు. శివాభిషేకం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలాన్ని కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివుడు పరమానంద భరితుడు అవుతాడట. జీవితంలోని అన్ని ప్రతికూలతలను అంతం చేస్తాడని, ఆయన చల్లని ఆశీర్వాదాన్ని అందిస్తాడని చెబుతారు. జీవితంలో సానుకూల శక్తి దీనివల్ల పెరుగుతుందట.
పచ్చిపాలు..
క్రమం తప్పకుండా పచ్చి పాలను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. దీనివల్ల దుఃఖాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి లభిస్తాయి. ఇంటి సమస్యలు తొలగిపోతాయి. గృహ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.
తేనె..
నీటిలో కొద్దిగా తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివుడి ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలోని అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. కెరీర్, వ్యాపార సమస్యలు తొలగిపోతాయి.
గంధం..
శివలింగానికి అభిషేకం చేసే నీటిలో కాసింత గంధం కలిపి శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇది గౌరవాన్ని పెంచుతుంది. జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. జీవితంలో దురదృష్టం తొలగిపోయేలా చేస్తుంది. మంచి రోజులు ప్రారంభమవుతాయి. శ్రావణమాసంలో ఇలా పూజించడం చాలా ముఖ్యం.
పెరుగు..
తాజా పెరుగును నీటిలో కలిపి శివలింగానికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంబంధం మరింత దృఢంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన చింతలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
*రూపశ్రీ.
