పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా కాశీలో ఎందుకు స్థిరపడ్డాడు..దీని వెనుక కథ తెలుసా!

 

పౌరాణిక నమ్మకాల ప్రకారం కాశీ శివుడికి చాలా ఇష్టమైన ప్రాంతం.  నేటికీ శివుడు పార్వతి దేవితో ఇక్కడే నివసిస్తున్నాడు. కాశీని వారణాసి, బనారస్ అని కూడా పిలుస్తారు.  వేదాలు, ఉపనిషత్తులు,  పురాణాలు కాశీని శివ నగరం అని,  మోక్ష భూమి అని వర్ణించాయి. ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ లింగాన్ని జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు.  అయితే శివుడి నివాసం కైలాసం అయినా, శివపార్వతుల స్థిర నివాసం కాశీ అని చెబుతున్నాయి పురాణ కథనాలు.  అసలు కాశీ శివపార్వతుల స్థిర నివాసం ఎలా అయ్యింది? తెలుసుకుంటే..

పురాణ కథనం ప్రకారం..  

శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న తరువాత   ఆమెను కైలాస పర్వతానికి తీసుకువెళ్ళాడట. కొంతకాలం అంతా బాగానే సాగింది.  కానీ ఒక రోజు, పార్వతి దేవి శివుడితో మాట్లాడుతూ వివాహం తర్వాత ప్రతి స్త్రీ తన భర్త ఇంటికి వెళుతుంది.  నేను చిన్నతనం నుండి తండ్రి ఇంట్లోనే నివసించాను అని చెబుతుందట.

పార్వతి దేవి మాటలు విన్న శివుడు చిన్నగా నవ్వి పార్వతిని తీసుకుని భూమి మీద గంగా నది ఒడ్డుకు వచ్చాడట.  అక్కడ కాశీ నగరాన్ని తన నివాసం చేసుకుని కాశీ విశ్వేశ్వరుడిగా స్థిరపడ్డాడట. అప్పటి నుండి కాశీ శివపార్వతుల ఇల్లుగా, స్థిర నివాసంగా మారిందని చెబుతారు.

కాశీలోని విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగ రూపంలో శివుడు స్వయంగా నివసిస్తున్నాడని భక్తుల నమ్మకం. పురాణాలు  కూడా ఇదే చెబుతున్నాయి. ఈ ఆలయం పరమేశ్వరుడి మీద ఉన్న భక్తి, నమ్మకానికి,  భారతీయ  సంస్కృతికి చిహ్నం. స్వచ్చమైన  హృదయంతో విశ్వనాథుడిని దర్శించే భక్తులు తమ పాపాలన్నింటినీ కాశీలో వదిలించుకుంటారని నమ్ముతారు.

తనను రోజూ  పూజంచే భక్తుల పట్ల శివుడు ఎప్పుడూ పూర్తీగా బాధ్యత వహిస్తాడని కూడా చెబుతారు. భక్తుల దుఃఖం,  కష్టాలు,  బాధలు తొలగించి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. అందుకే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు. కాశీ వీధులు, ఘాట్లు,  దేవాలయాలు.. మనిషి  జీవితానికి,  మరణానికి.. ఇలా రెండింటికి వేదక.. ఈ  రెండింటి సంగమమే కాశీ నగరం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాశీలో మరణించిన వారు మరణం తరువాత మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.

                                   *రూపశ్రీ.


More Shiva