హిందువులు, ముస్లింలు ఇద్దరూ పూజించే శివ లింగం గురించి తెలుసా...


భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి పేరు పొందిన దేశం. ఇక్కడ ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు,  వ్యవహారాలు ఉన్నాయి.  మరీ ముఖ్యంగా హిందువులలో శైవులు, వైష్ణవులు అని వినే ఉంటారు. పరమేశ్వరుడు లింగ రూపంలో పూజలు అందుకుంటాడు. అలాంటి శివలింగాన్ని అల్లాను పూజించే ముస్లిం మతస్తులు పూజించడం గురించి వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ భారతదేశంలో హిందువులు, ముస్లింలు కూడా పూజించే శివలింగం ఉంది. ఈ శివలింగం ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకుంటే..

సరియా తివారీ..

సరియా తివారీ అనే గ్రామం ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుండి దాదాపు 25కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో జార్ఖండి శివధామ్ అనే పురాతన ఆలయం ఉంది.  ఈ ఆలయంలో ఉండే శివలింగం చాలా ప్రత్యేకమైనదట.  ఎందుకంటే ఈ శివలింగాన్ని హిందువులు,  ముస్లింలు కూడా పూజిస్తారట.

ఇక్కడ శివలింగాన్ని స్వయంభువు లింగం అని చెబుతారు.  అంటే ఈ శివలింగం దానంతట అదే ఆవిర్భవించిందట.

స్థానిక పురాణాల ప్రకారం మహమ్మద్ ఘజిని భారతదేశంపై దండేత్తినప్పుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడట.  కానీ శివ లింగాన్ని విచ్చిన్నం చేయడానికి అతను ప్రయత్నించి విఫలమయ్యాడట. ప్రజలు ఆ శివలింగాన్ని పూజలు చేయడానికి భయపడాలనే ఉద్దేశంతో శివలింగంపై ఇస్లాం కలం చెక్కించాడని చెబుతారు. మహమ్మద్ ఘజిని అలా చేసినప్పుడు శివలింగాన్ని  చూసి అందరూ భయపడటం మాని మరింత ధైర్యంగా శివలింగాన్ని పూజించడం మొదలుపెట్టారు.  దీంతో శివలింగ ప్రాముఖ్యత పెరిగింది.

మహమ్మద్ ఘజిని సంఘటన జరిగినప్పటి నుండి నేటి వరకు కూడా ఇక్కడ శివలింగాన్ని పూజించడం చాలా ప్రాముఖ్యంగా మారింది. మరీ ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఇక్కడ శివలింగానికి వేలాది మంది  హిందువులు రుద్రాభిషేకం చేయడానికి వస్తారట.

రంజాన్ మాసం సమయంలో చాలామంది ముస్లిం సోదరులు కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారట.

ఈ ఆలయం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదే ఆలయం పై కప్పు.  ఈ ఆలయానికి పైకప్పు లేదు.. ఈ పైకప్పు నిర్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయట. పైకప్పు కట్టిన ప్రతి సారి ఏదో ఒక కారణం వల్ల కూలిపోవడం జరుగుతోందని చెబుతారు. పైకప్పు లేకుండా అలా నేరుగా ఆకాశం కింద ఉండి తన భక్తులు దర్శనం ఇవ్వాలని శివుడు కోరుకుంటున్నాడని, అందుకే పైకప్పు అలా కూలిపోతోందని అక్కడి  భక్తులు నమ్ముతారట.

                          *రూపశ్రీ
 


More Shiva