శివుడికి చేసే రుద్రాభిషేకం కు, జలాభిషేకం కు మధ్య గల తేడాలు తెలుసా..
పరమశివుడు ఆది దేవుడు అని పిలువ బడతాడు. ఆయన లయ కారుడు. సర్వాన్ని తనలో లీనం చేసుకునేవాడు. అందరు దేవుళ్లకంటే పరమేశ్వరుడి స్వబావం, ఆయన సిద్దాంతాలు, ఆయన పూజా విధానం, ఆయన ప్రీతి చెందే విధానం చాలా వేరుగా ఉంటుంది. చాలామంది శివ లింగం మీద కాసింత వీభూతి, చెంబుడు నీళ్లు, మారేడు దళాలు వేస్తే చాలు ఆయన సంతృప్తి పడతాడు అని అంటుంటారు. అయితే శివుడికి చేసే అబిషేకాలలో రెండు రకాలు ఉన్నాయి. అవి రుద్రాభిషేకం, జలాభిషేకం. ఈ రెండింటి మధ్య చాలా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇవి రెండూ శివారాధనలో భాగమైన అభిషేక విధానాలు అయినా, వాటి ఉద్దేశ్యం, విధానం, శాస్త్రీయ ప్రాముఖ్యత లో చాలా వ్యత్యాసం ఉంది.
రుద్రాభిషేకం.. అర్థం..
"రుద్ర" అంటే శివుని ఒక రూపం. "అభిషేకం" అంటే స్నానం చేయించడం. కాబట్టి రుద్రాభిషేకం అనేది శివుని రుద్ర రూపానికి శాస్త్రోక్తంగా అభిషేకం చేయడం.
విధానం..
ఇందులో శివలింగానికి పాలు, తేనె, తక్కువ నీరు, చందనం, ఐదు ద్రవ్యాలు (పంచామృతాలు – పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) తదితరాలతో అభిషేకం చేయడం జరుగుతుంది.
ఈ అభిషేకం చేసే సమయంలో శ్రీ రుద్రం (ఋగ్వేదం/యజుర్వేదం లోని ఘట్టం) లేదా ఓం నమః శివాయ జపంతో పాటుగా అభిషేకం చేయడం అనేది శాస్త్రీయంగా ఉంటుంది.
పూజారి లేదా భక్తుడు మంత్రోచ్ఛారణతో కూడిన అభిషేకం చేయాలి. ఇది ప్రాముఖ్యత కలిగిన శైవ శాస్త్ర విధానం. శివరాత్రి, సోమవారాలు, కార్తీక మాసం వంటి పవిత్ర రోజుల్లో రుద్రాభిషేకం చేస్తారు.
ఫలితాలు (ఉద్దేశ్యం):
శాంతి, ఆరోగ్యం, సంపద, మనశ్శాంతి కలుగుతుంది.
పాప విమోచనం, దోష నివారణ కోసం చేస్తారు.
కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేస్తారు.
జలాభిషేకం.. అర్థం..
"జల" అంటే నీరు. కాబట్టి జలాభిషేకం అనేది శివలింగంపై శుద్ధ నీటితో మాత్రమే అభిషేకం చేయడం.
విధానం..
ఇది సాధారణంగా రోజు నిర్వహించే అభిషేకం. ఒక్క శుద్ధ నీటితో మాత్రమే శివలింగాన్ని అభిషేకం చేస్తారు.
శాస్త్రీయ మంత్రాలు అవసరం లేకపోయినా, నిష్టతో "ఓం నమః శివాయ" అని జపిస్తూ చేయవచ్చు.
కొన్ని ఆలయాలలో నిత్య అభిషేకంగా కూడా చేస్తారు. గంగాజలము లేదా పవిత్ర నదీ జలాలతో చేస్తే మరింత పుణ్యం కలుగుతుందని నమ్మకం.
ఫలితాలు..
శివుడికి ఎంతో ఇష్టమైన పూజ విధానం ఇది. భక్తి, శ్రద్ధతో చేసినప్పటికీ మంత్రపఠన లేకుండానే ఇది పుణ్యఫలితాన్ని ఇస్తుంది.
దైనందిన పూజల్లో భాగంగా శివుడికి నీటిని సమర్పించడం అంటే ఆయనను శుభ్రపరచడం, శాంతిని కోరడం.
ఇదీ వివరణ..
రుద్రాభిషేకం అంటే శైవ శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో శివుడిని అభిషేకించడం, ఇది విశేష ఫలితాలను అందిస్తుంది.
జలాభిషేకం అంటే భక్తితో నీటిని సమర్పించడం, ఇది సులభంగా సాధ్యమయ్యే ప్రతిరోజూ చేయదగిన పూజ విధానం.
ఏమైనా శివారాధనలో భక్తి ప్రాధాన్యం ఎక్కువ. శ్రద్ధగా, శుద్ధమనస్సుతో చేసిన ఏ అభిషేకమైనా శివుడు తృప్తిగా స్వీకరిస్తాడు.
*రూపశ్రీ.
