జపం ఎలా చెయ్యాలి ?

 

                   
మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ., మంత్రాన్ని కానీ., ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చెయ్యాలనే సంఖ్యానియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందులవల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో., మరునాడు ఈరోజు మిగిలిన జపసంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది. జపాన్ని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంఖ్య పూర్తిచెయ్యడమే ప్రధాన లక్ష్యంగా జపం చెయ్యకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.
                వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
               త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్

జపం.. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది.

వాచికము: బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని ‘వాచికము’ అంటారు.

ఉపాంశువు: బయటకు వినిపించకుండా, కేవలం పెదవులు కదుపుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ‘ఉపాంశువు’ అంటారు.

మానసికము: నాలుక, పెదవులు కదలకుండా మౌనంగా మనస్సు లోలోపలే జపం చేసే విధానాన్ని ‘మానసికము’అంటారు.
ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు., ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్ఠము అని శాస్త్ర ప్రమాణము.
                 హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
                హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ

ప్రాతః కాలమునందు చేతులు నాభి వద్దకు చేర్చి., మధ్యాహ్నమునందు చేతులు హృదయము వద్దకు చేర్చి., సాయంకాలమునందు చేతులను ముఖమునకు సమాంతరముగా ఉంచి జపం చేయవలెను. చందనపూసలతో, అక్షతలతో, పూవులతో, ధాన్యముతో, మట్టిపూసలతో జప సంఖ్యను లెక్కించకూడదు. లక్క, దర్భ, సిందూర పూసలతో కానీ., ఎండిన ఆవుపేడ పూసలతో కానీ రుద్రాక్ష, తులసి, స్ఫటిక పూసలతో కానీ చేసిన జపమాలలతో జప సంఖ్యను లెక్కించుట శ్రేష్ఠము.


జపమాల: పమాలలో 108 పూసలు ఉంటాయి. మాల రెండు కొసలు కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపము చేయునప్పుడు జపమాల కనిపించకుండా వస్త్రాన్ని కప్పి చేయాలి. కానీ, ఆ వస్త్రం తడిగా ఉండకూడదు. జపమాలను అనామిక వ్రేలు (ఉంగరపు వ్రేలు) పైనుంచి బొటనవ్రేలుతో పూసలను లెక్కించవలెను. చూపుడువ్రేలును ఉనయోగించరాదు. సుమేరుపూసను దాటి ముందుకు పోరాదు. సుమేరేపూస దాకా వచ్చిన తర్వాత మాలను వెనుకకు త్రిప్పి  జపము చేయవలెను. ఒకవేళ జపమాల చేతినుంచి జారి క్రిందపడినచో, ఆ జపసంఖ్య లెక్క లోనికి రాదు. మరల జపమాల మెదటి నుంచి జపము చెయ్యాలి.  జపమాల కాలికి తగిలిన ఎడల, దానిని నీటితో కడిగి రెట్టింపు సంఖ్యలో జపం చెయ్యాలి. జపము చేయునప్పుడు మాట్లాడుట కానీ, కదులుట కానీ చేయరాదు. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, క్షమాభావనతో భగవంతుని స్మరించి తిరిగి జపం ప్రారంభించాలి. గృహమునందు జపము చేసిన దానికన్న గోశాలయందు వందరెట్లు, వనములందు లేదా తీర్థస్థానములందు వేయిరెట్లు, పర్వతములమీద పదివేలరెట్లు, నదీతీరములందు లక్షరెట్లు, దేవాలయములందు కోటిరెట్టు, శివలింగము దగ్గర అనంతమైన పుణ్యఫలము లభించునని శాస్త్ర ప్రమాణము.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం


More Purana Patralu - Mythological Stories