ఆలోచన చేసే మాయ ఎలా ఉంటుంది?

మనం అందరమూ ఏదో ఒక రకం సుఖం కోసం పాకులాడుతూ వుంటాము మానసికము, ఇంద్రియ లోలత్వము, సాంస్కృతికము, సంస్కరణలతో కూడినది, ఇతరులకు ఏం చేయాలో చెబుతూ వుండడము, సంఘంలో వున్న చెడు దానిని తొలగించడం ఎలా అని, మంచి చేయడం ఏమిటి  ఎక్కువ జ్ఞానం, మరింత దేహ సుఖం, మహదనుభవం, జీవిత పరమార్థ అవగాహన, మనసు చేసే అన్ని జిత్తులు, అన్నిటినీ మించి చిట్టచివరి సుఖం భగవంతుడిని చేరుకోవడం ఇలా ఎన్నో మనను వాటి వెనుక పరుగులు తీయిస్తాయి.

సమాజం పోషించే ప్రధాన పాత్ర సుఖం. బాల్యం నుంచి మృత్యువు మనను కబళించే దాకా మనం రహస్యంగా, మర్మంగా లేక బాహాటంగానో సుఖాపేక్షతో పనిచేస్తూ వుంటాము. ఈ సుఖానికి ఏ రూపం వున్నా  అదే మన జీవితాలను నడుపుతుందనే విషయం మటుకు గమనించాలి. ఈ సుఖాపేక్షను మనలో ప్రతి ఒక్కరము జాగ్రత్తగా, దగ్గరగా, సుకుమారంగా పరిశీలించవలసిన అవసరం ఉందని గ్రహించాలి. సుఖాలను కనుగొనడం, వాటిని పోషిస్తూ నిలుపుకోవడం మన జీవితాలలో ప్రాథమిక లక్షణం. ఇది లేకపోతే మన ఉనికి బద్ధకంగా, సోమరిగా, ఒంటరిగా, అర్థరహితంగా తయారవుతుంది.

జీవితాన్ని సుఖం నడిపిస్తే వచ్చే ఆటంకం ఏమిటనే సందేహం వస్తుంది. సుఖం తప్పనిసరిగా బాధను, నిరాశను, భయాన్ని, భయం ద్వారా దౌర్జన్యాన్ని హింసను తీసుకు వస్తుంది. అప్పుడు ఆ రకంగానే జీవనం గడపాలి అనుకుంటే అలాగే చేయచ్చు. ప్రపంచంలో చాలా మంది ఇలాగే ఉంటారు. కాని ఈ దుఃఖం నుంచి పూర్తిగా బయటపడాలని అనుకునేట్లయితే మటుకు, సుఖం రూపాన్ని, నిర్మాణాన్ని పరిశీలించి అర్ధం చేసుకోవడం ఎంతో అవసరం.

సుఖాన్ని అర్థం చేసుకోవడం అంటే దాన్ని కాదనడం కాదు. మనం దానిని ఖండించడం లేదు. సరికాదు అనడం లేదు. దానినే అనుసరించినట్లయితే కళ్ళు బాగా తెరిచివుంచుకుని, సుఖాపేక్షతో నిండిన మనసు తప్పనిసరిగా దాని నీడ అయిన దుఃఖాన్ని, బాధను తీసుకు వస్తుందని తెలుసుకుని గమనిద్దాం. ఈ రెండు విడదీయరానివి. మనం  సుఖం వెనుకనే వెళ్లి దుఃఖాలను తొలగించుకోవాలని ప్రయత్నించినా ఈ రెండూ జంటగానే వుంటాయి. 

మనసు ఎందుకని ఎప్పుడూ సుఖాలను అపేక్షిస్తూ వుంటుంది? సుఖాపేక్షలో మునిగిపోయి మనం ఎప్పుడూ ఉదాత్తము, అనుదాత్తము అయిన పనులను చేస్తూ వుంటాము. సుఖం తాలూకు పలచటి పొరల దారాలపై ఎందుకు త్యాగాలు, బాధలు కొనితెచ్చుకుంటాము? అసలు సుఖం అంటే ఏమిటి? ఇది ఎలా సంప్రాప్తం అవుతుంది?  ఎవరయినా ఈ ప్రశ్నలు వేసుకుని వీటికి సమాధానాలు రాబట్టటానికి ప్రయత్నించారా?

సుఖం అన్నది నాలుగు దశలలో సంప్రాప్తం అవుతుంది. చూడడం, ఇంద్రియ స్పందన, సంపర్కం, కోరిక. ఒక అందమైన మోటరు కారును చూస్తాము. దానిని చూసిన తరువాత ఇంద్రియాలు చలిస్తాయి, స్పందిస్తాయి. తరువాత దాన్ని తాకుతాము, కనీసం తాకినామని అనుకుంటాము. ఆపైన దానిని పొందాలనే కోరిక. దానిలో తిరుగాడి దర్జా ప్రదర్శించాలని కోరిక. ఒక్కక్షణం పాటు  సమస్యలు, ఆదుర్దాలు, దుఃఖాలు మరచిపోయి ఆ దృశ్యాన్నే చూస్తూ వుంటాము కొన్నిసార్లు. ఆనందంగా ఈ క్షణం చూడవచ్చు, మరుసటి క్షణం దానిని గురించి మరచిపోవచ్చును. లేదా, మనసు అందులో ప్రవేశించవచ్చు. 

అక్కడితో సమస్య మొదలవుతుంది. మనసు తాను చూసిన దృశ్యాన్ని గురించి తలపోసుకుంటూ దాని సౌందర్యాన్ని నెమరువేసుకుంటూ వుంటుంది. ఆ దృశ్యాన్ని మరిన్ని సార్లు చూడాలని అనుకుంటూ వుంటాము. ఆలోచన ఒకదానిని మరోదానిని పోల్చుకుంటూ వుంటుంది. తీర్పు చెబుతూ వుంటుంది. రేపు మళ్లీ దానిని అనుభవించాలి అనుకుంటుంది. ఒక క్షణంపాటు పొందిన అనుభూతి, అది తీసుకువచ్చిన సంతోషము ఆలోచన మూలంగా కొనసాగుతుంది. ఇదే ఆలోచన చేసే మాయ.

                                   ◆నిశ్శబ్ద.


More Subhashitaalu