తమిళుల మనసు గెల్చుకున్న త్యాగయ్య!

 


తమిళులు అనగానే తమ భాష పట్ల విపరీతమైన అభిమానం కలిగినవారుగా గుర్తుకువస్తారు. కానీ తెలుగువారి పట్ల వారికి కొంత అభిమానం కనిపిస్తుంది. శతాబ్దాల తరబడి కలిసి ఉండటం ఒక కారణం అయితే, అక్కడి పండితపామరుల మనసల్లో సైతం త్యాగరాజుల కీర్తనలు నిలిచిపోయి ఉండటం మరో కారణం. సంగీతానికి భాష ఉండదు అని చాటి చెప్పిన త్యాగరాజుల జీవితచరిత్ర సాగరమంత లోతైనది. అందులో మునకలు వేయడం అసాధ్యం కాబట్టి. ఆ జీవన తీరాన నిలబడి ఆయన్ని ఓసారి తల్చుకుందాము.

త్యాగరాజుల వారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని కాకర్ల గ్రామం నుంచి తమిళనాడులోని ‘తిరువారూరు’కు వలస వెళ్లారు. అందుకని వారికి కాకర్ల అన్న ఇంటి పేరు స్థిరపడింది. ఆయన తండ్రి పేరు రామబ్రహ్మం. గొప్ప పండితుడు, పైగా రామభక్తుడు. తిరువారూరులోని స్వామివారి పేరు త్యాగరాజస్వామి. ఆయన అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి బిడ్డకు త్యాగరాజు అని పేరుపెట్టుకున్నారు రామబ్రహ్మం దంపతులు. నాన్నగారి నుంచి ఇంటిపేరుతో పాటు రామభక్తిని కూడా సొంతం చేసుకున్నాడు త్యాగరాజు. త్యాగరాజులవారు మాటలు వచ్చిన దగ్గర్నుంచీ రామనామస్మరణ చేస్తూనే ఉండేవారు. ఏళ్లు గడిచేకొద్దీ ఆ నామస్మరణ కాస్తా కీర్తనలుగా మారసాగాయి. కీర్తన అంటే ఏమిటో తెలియని వయసులోనే అసంకల్పితంగా ‘నమో నమో రాఘవాయ’ అనే కీర్తనను తన ఇంటి గోడల మీద రాశారట త్యాగయ్య. మొదట అవేవో పిచ్చిగీతలు అనుకున్న తండ్రి, వాటిని నిశితంగా పరిశీలించి అవి పిచ్చిగీతలు కాదు పారవశ్యపు రాతలు అని గ్రహించాడు. దాంతో ఆయనను ‘శొంఠి వెంకటరమణయ్య’ అనే పండితుని దగ్గర విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చేశాడు.

వెంకటరమణయ్యకు త్యాగరాజులవారి ప్రతిభ తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వెంటనే ఆయనను తన ముఖ్య శిష్యునిగా భావించి తనలోని జ్ఞానసారాన్నంతా అందించాడు. ఆయన నమ్మకం వమ్ముకాలేదు. ఒకనాడు ప్రముఖులంతా కొలువుదీరిన ఓ పండితసభలో త్యాగరాజుని ఏదన్నా కీర్తనను ఆలపించమన్నారు గురువుగారు. అక్కడ కొలువుతీరిని గురువుగారిని కొలుచుకుంటూ ‘దొరకునా ఇటువంటి సేవ’ అన్న కీర్తనను ఆలపించారట. మరికొందరు ఆ సందర్భంలో త్యాగరాజుల వారు పాడిన కీర్తన ‘ఎందరో మహానుభావులు’ అని చెబుతారు. ఆ పండితసభ తరువాత త్యాగరాజుల వారి ప్రతిభ నలుదిక్కులా మోగిపోయింది.

కీర్తనలతో పాటు వ్యాపిస్తున్న తన కీర్తిని కాసులుగా మార్చుకోవాలన్న తపన త్యాగరాజులవారిలో ఏ కోశానా లేకపోయింది. పేదరికం ఎంతగా బాధిస్తున్నా, అన్నయ్య తన సూటిపోటి మాటలతో వేధిస్తున్నా రామనామస్మరణతోనే కాలం గడిపేవాడు. త్యాగయ్య ప్రతిభాపారవశ్యాలు ఆ నోటా ఆ నోటా తంజావూరు ఆస్థానానికి చేరాయి. ఆ కీర్తనలేవో తన ముందు నిల్చొని పాడితే కోరినన్ని బహుమతులు, తీరనంత డబ్బు ఇస్తానని కబురుపంపాడు తంజావూరు రాజు. కబురుతో పాటు విలువైన కానుకలు కూడా ఎన్నో పంపాడు. వాటన్నింటినీ ఒక్కమారు పరికించి చూశాడు త్యాగయ్య. `నిధి చాలా సుఖ‌మా, రాముని స‌న్నిధి సేవ సుఖ‌మా` అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ భక్తుని మనసులో జవాబు తట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రూకలకంటే, రాముని రూపమే తనకు ముఖ్యమని తోచింది. వెంటనే ఆ కానుకలను తిప్పి పంపేశాడు.

కాలి ముందుకు వచ్చిన డబ్బుని త్యాగయ్య కాలదన్నడం, అతని అన్నగారైన జపేశయ్యకు పట్టరాని ఆగ్రహాన్ని కలిగించింది. త్యాగయ్య నిత్యం కొలుచుకునే ఇంట్లోని రాముని విగ్రహాలను పట్టుకుపోయి పారుతున్న కావేరిలో పారేశాడు. రాముని ప్రతిరూపమైన ఆ విగ్రహాలను పోగొట్టుకున్న త్యాగయ్య బాధకు అంతులేకుండా పోయింది. నిద్రాహారాలు మాని నిరంతరం ఆ రాముణ్నే పలవరిస్తూ ఉండిపోయాడు. ఎట్టకేళకు ఆ శ్రీరాముడే కలలో కనిపించి, త్యాగయ్యకు విగ్రహాలు ఉన్న చోటుని చూపించాడని అంటారు. మరోపక్క త్యాగయ్య తనతో ప్రవర్తించిన తీరుకి కోపగించిన తంజావూరు రాజుగారు అతడిని బంధించి తీసుకురమ్మని భటులను పంపారు. రాజభటులు అలా బయల్దేరారో లేదో రాజుగారు విపరీతమైన కడుపునెప్పితో విలవిల్లాడిపోయారట. త్యాగయ్య పట్ల ఆయన ప్రవర్తనే ఆ బాధకు కారణం అని ఆయన మంత్రిగారికి తోచింది. ఆ విషయాన్నే రాజుగారికి వివరించి, త్యాగయ్య అందించిన తులసి తీర్థాన్ని ఇప్పించాక కానీ రాజుగారికి ఉపశమనం కలుగలేదట.

త్యాగయ్య జీవితంతో ఇలాంటి అపురూప ఘట్టాలెన్నో ముడిపడి ఉన్నాయి. ఆయన పాడిన ప్రతి ఒక్క కీర్తనకీ ఏదో ఒక కారణాన్ని చూపిస్తారు భక్తులు. త్యాగయ్య కీర్తనలు చూపిన ప్రభావం కూడా సాధరణమైనదేమీ కాదు. అవి భక్తులను రంజింపచేయడమే కాదు, ఎన్నో మహాత్మ్యాలు కూడా చేశాయని చెబుతారు. దీపాలను వెలిగించాయనీ, చనిపోయినవారికి ప్రాణం పోశాయనీ కథలు కథలుగా చెప్పుకుంటారు. త్యాగరాజులవారికి 80 ఏళ్లు నిండాక తాను కైవల్యం పొందే సమయం దగ్గరపడిందని తోచింది. వెంటనే తన శిష్యులను పిలిచి విషయాన్ని తెలియచేశారు. తన మనసు అప్పటికే సంసారం నుంచి విముక్తి చెంది ఉన్నా, ఆశ్రమధర్మాల ప్రకారం సన్యాసాన్ని స్వీకరించారు. నాదబ్రహ్మానందస్వామి అనే పేరుని అందుకున్నారు. చివరికి 1847లో తాను చెప్పిన సమయాన్నే పరమపదించారు.
త్యాగరాజుల వారు సాక్షాత్తూ ఆ రాముని కోసమే తన కీర్తనలను ఆలపించారు. అందుకని వాటిని అక్షరబద్ధం చేయాలన్న తపన ఆయనలో ఉండేది కాదు. ఆయన భక్తి పరవశ్యంతో పాడుతుంటే ఆయన శిష్యులే వాటిని అక్షరబద్ధం చేసేవారు. వాటిలో ఎన్నో కాలక్రమేణా చెదిరిపోయాయి. ఆయన తన జీవితకాలంలో 24000 కీర్తనలని ఆలపించారని చెబుతారు. దురదృష్టవశాత్తూ వాటిలో దాదాపు 700 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితేనేం… వాటిలో ప్రతి ఒక్క కీర్తనా ఒక ఆణిముత్యమే! కావాలంటే ఈసారి ఎప్పడైనా వాటిని విని చూడండి. మీకే అర్థమవుతుంది. త్యాగరాజుల వారిని తమిళురు సైతం ఎందుకు ఆరాధిస్తారో!

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories