కాశీ విశిష్టత, కాశీ విశ్వేశ్వరుని వృత్తాంతం!!

పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాలలో కాశీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా, మోక్షాన్ని ఇచ్చే క్షేత్రంగా కాశీని పేర్కొంటారు. అలాంటి కాశీలో వెలసిన విశ్వేశ్వరుకి కథనమే ఇది….


సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణము ఉన్నది అని చెబుతారు. తేజోరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాలని తలచి, నిరాకారుడుగా ఉన్న తను సాకారుడైనాడు. ఆ తరువాత తన నుండి శక్తిని బయటకు పంపాడు. అదే ప్రకృతి. అప్పుడు ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది. వీరిద్దరూ సంచరించటానికి కొన్ని యోజనాల విస్తీర్ణము కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు..


పురుషుడు పరమాత్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి చెయ్యటం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. అతడు తపస్సు చేస్తుండగా అతని శరీరము నుంచి నీరు కాల్వలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి పురుషుడు  ఒక్కసారి తల ఊపాడు. ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేలమీద పడింది. ఆ కమ్మ పడిన చోటునే 'మణికర్ణిక' అంటారు. అది చాలా పవిత్రమైన ప్రదేశం,


విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు. అతడి నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు. అతడు పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యక్రమము మొదలు పెట్టాడు. మొదటగా ఐదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు.. దానికి నాలుగు వైపులా పధ్నాలుగు లోకాలు సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలి ఆడుతోంది. దాని అష్టదిగ్గజాలు మోస్తున్నాయి. ఈ బ్రహ్మాండములో సగము భూలోకము, 1/4 వంతు ఊర్ధ్వలోకము, 1/4 వంతు అధోలోకము.


ఆది నారాయణుడు, మిగిలిన బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్ధించారు. వారి ప్రార్ధనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఏ వరం కావాలో. కోరుకోండి' అన్నాడు. అప్పుడు వారంతా ముక్త కంఠంతో 'దేవదేవా! పరమ పురుషా! కైలాస వాసా! నువ్వు కాశీ పట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండాలి" అని అడిగారు. భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు.


కాశీ పట్టణంలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి. అవి  వరుణ, ఆసి, ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశము కాబట్టి వారణాసి అని పిలువబడుతోంది. కాశీనే మహా శ్మశానము అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టము అంటారు. ఇది మహా పవిత్ర క్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రములో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు కూడా ఉన్నారు.


కాశీ పట్టణంలో గంగాస్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకంలోని ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిది కాశీ వెళ్ళలేము. కాశీకి వెళ్ళకపోయినప్పటికీ, కాశి వెడదాము అనుకుంటే చాలు, వెళ్ళినంత ఫలం వస్తుంది. కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలము వస్తుంది.


కాశీలో మరణిస్తే చాలు ఎంతటి క్రూరకర్ముడైనా సరే కైలాసం చేరతాడు. రామేశ్వరములోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసినవాడికి పునర్జన్మ ఉండదు. అంతెందుకు యజ్ఞ యాగాదులు చేసి స్వర్గసుఖాలు అనుభవించేకన్నా కాశీలో పిశాచమై తిరగటము మిన్న అని చెబుతారు. అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలవబడుతోంది. ఇదీ కాశీ విశిష్ఠత, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడి కథనం.


                                        ◆నిశ్శబ్ద.


More Shiva