నందికేశ్వర తీర్థ వృత్తాంతం ఏమిటి?

పరమశివుడి వాహనం నంది. ఈయన వెలసిన క్షేత్రాలలో నందికేశ్వర తీర్థం ఒకటి. ఆ తీర్థ ప్రత్యేకత, దాని వృత్తాంతం గురించి వివరంగా...

'రేవా నదీ తీరంలో 'కర్ణకి' అనే గ్రామం ఉన్నది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణమతి. అతని కుమారుడు కర్మసిద్ధుడు.. జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తరువాత భార్యను కుమారుడికప్పగించి కాశీ నగరానికి వెళ్ళి తనువు చాలించాడు. కొడుకు, కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు సుగుణమతికి కూడా వయస్సు పైబడింది. వృద్ధాప్యము వచ్చింది. ఒకరోజు కుమారుడిని, కోడలిని పిలిచి, "నాయనా! ఇంతకాలము నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు ఏమీ చెయ్యలేదు. కనీసం కాశీ నగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణానంతరము అస్తికలు గంగలో కలుపుతానని మాటిస్తే నేను నిశ్చింతగా కన్నుమూస్తాను" అన్నది. 

కొడుకు, కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు. సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది.

శాస్త్ర ప్రకారము తల్లికి కర్మచేసి, అస్థికలు మూటకట్టుకుని కాశీ నగరం బయలుదేరాడు. కర్మసిద్ధుడు. అతడలా కొంతదూరం ప్రయాణం చేసి 'శుభ' అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందన కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు. రాత్రి ఎనిమిది గంటలయింది. గ్రామాంతరము వెళ్ళిన గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఒక ఆవు ఉన్నది, దొడ్డిలో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పితకటానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలనే ఉత్సాహంలో దూడ ఎగురుతూ యజమాని కాలు త్రొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను నాలుగు బాదాడు. తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది. కాని దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము కొట్టుకుపోయింది. అప్పుడు తల్లీబిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది.

దూడ : అమ్మా! ఎందుకు దుఃఖిస్తావు. పొరపాటున యజమాని కాలు తొక్కాను. అది పొరపాటని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించి ప్రయోజనము ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా!

ఆవు: బిడ్డా! జీవులన్నీ కర్మకు ఆధీనములే. కర్మఫలాన్ననుభవిస్తూ జీవి విర్రవీగటము, లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానము, మాయామోహితుణ్ణి అజ్ఞానమావరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పు నిన్ను కొట్టటమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడకు పుత్రశోకము కలిగించాలనుకుంటున్నాను అప్పటికి గాని నా కసి తీరదు.

దూడ : అమ్మా! పొరబడుతున్నావు. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో పశువులమై పుట్టాము. మళ్ళీ బ్రహ్మహత్యా పాతకమెందుకు చేస్తావు?..

ఆవు: బిడ్డా! ఈ మాట నాకు తెలుసు. మాయను జయించినవాడు సాక్షాత్తు భగవానుడే. అవుతాడు. బ్రాహ్మణ బాలుని చంపితే బ్రహ్మహత్యాపాతకము అని కదా నీ భయం. ఏం ఫరవాలేదు. బ్రహ్మహత్యా పాతకము ఒక్కటే కాదు. పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను అప్పుడు బ్రహ్మ హత్యా పాతకం వల్ల నా శరీరమంతా నల్లగా మారిపోతుంది. తరువాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. మళ్ళీ నా శరీరము తెల్లగా మెరుస్తూ ఉంటుంది.. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్దుడు ఈ మాటలన్నీ విన్నాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యా పాతకము ఎలా తొలగిపోతుంది తెలుసుకోవాలని అనుకున్నాడు.

మరునాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకటానికి ఆవు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వెంటనే అవు ఆ బాలుణ్ణి కాళ్ళతో తన్ని, కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తుండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి హాహాకారాలు చేస్తున్నారు. ఆవు పరుగెత్తుకుంటూ వెళ్ళి నర్మదానదీ తీరంలోని నందికేశ్వర తీర్ధంలో మూడుసార్లు మునిగింది. అంతే దాని శరీరము తెల్లగా మెరిసిపోతోంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడికి ఎదురుగా వచ్చి "ఎవరు నువ్వు?' అని అడిగింది. తన వృత్తాంతం చెప్పాడు కర్మసిద్ధుడు. 'ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమి నీ తల్లి అస్తికలను ఈ తీర్థంలో కలుపు. నేను గంగామాతను, నీ తల్లి పుణ్యలోకాలకు వెళుతుంది" అన్నది. 

గంగాదేవి మాట ప్రకారం తల్లి ఆస్తికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యము, తల్లి దివ్య శరీరము ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ తీర్ధానికి నందికేశ్వర తీర్థమని పేరెందుకొచ్చిందంటే......

పూర్వకాలంలో 'ఋషిక' అనే బ్రాహ్మణ కన్య చిన్నవయసులోనే భర్తను కోల్పోయి, నర్మదానదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్టించి దీక్షతో అర్చన చేస్తోంది. ఆ సమయంలో 'మూర్ఖుడు' అనే రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయ పెట్టసాగాడు. అవి భరించలేక ఆమె 'శంకరా! పాహిమాం!' అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించటానికి ముందుగా నందీశ్వరుడు తరువాత శంకరుడు. తరువాత గంగ వచ్చారు. 

గంగాదేవి ఆమెను చూసి "నీకేం కావాలో కోరుకో" అన్నది. దానికి ఆమె "ఓ గంగా భవానీ! సంవత్సరంలో ఒక రోజున నేను స్నానమాడిన నదీ తీర్థంలో నీవు ఉండాలి" అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి, కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్ధంలో ఉంటుంది.  అంతే కాదు. విప్రశాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినవాడు నందికేశ్వరుడు. కాబట్టి దానికి 'నందికేశ్వర తీర్ధము" అని పేరు వచ్చింది. ఇదీ నందికేశ్వర తీర్థం వెనుక కథ.

                                    ◆నిశ్శబ్ద.


More Shiva