కామాన్ని జయించగలిగే శక్తి ఏది?

మనిషిని నిలువనీయకుండా చేసేవి కోరికలు. అవి మనిషిలో ఒక ప్రవాహంలా సాగుతూ ఉంటాయి. ఒక కోరిక పుడితే దాన్ని తీర్చుకుంటే అంతటితో తృప్తి పడిపోదు మనసు. ఆ తరువాత మరొక కోరిక వైపు దృష్టి మరలుతుంది. దాన్ని కూడా తీర్చుకుంటే ఆ తరువాత మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి. ఇలా ఈ కోరికలకు అంతూ అదుపు ఉండదు. ఇలాంటి కోరికల నుంచి దృష్టి మళ్ళించుకోవాలంటే, మనిషి దృష్టి ఉత్తమమైన ఆదర్శం వైపు ఉండాలి. ఉత్తమమైన ఆదర్శం ఉంటే మనిషి మనసు అటు ఇటు తిరగదు. ఉత్తమమైన ఆదర్శం మనిషికి ఉన్నప్పుడు తాను అంతకు ముందు కోరుకునే చిన్న చిన్న విషయాలు అన్ని ఎంత అర్థం లేనివో అవగతం అవుతాయి. వాటిని అర్థం చేసుకుని దృష్టి మరల్చకపోతే లల్ ఏ కోరికల బారి నుండి తప్పించుకోవాలని అకుంటున్నాడో వాటి బారినే పడతాడు.

మనిషిలో ఉండే ఈ కోరికలను ఆధారంగా చేసుకుని టాల్ స్టాయ్ ఓ కథ రాశాడు. దాన్లో ఓ వ్యక్తికి బోలెడంత భూమి సంపాదించాలని ఉంటుంది. అతడు దేవుడిని ప్రార్ధిస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడుగుతాడు. నాకు బోలెడంత భూమి కావాలి అని ఆ వ్యక్తి దేవుడిని అడుగుతాడు.

 'సరే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత మేరకు భూమిని చుట్టివస్తూ నడిస్తే అంత భూమి నీకు చెందుతుంది అని వరం ఇచ్చాడు దేవుడు. 

ఇంకేం, ఆ వ్యక్తి నడవటం ప్రారంభించాడు. నడుస్తూనే ఉన్నాడు. ఎండను భరించాడు. ఆకలిని గమనించలేదు. నీరు తాగాలనే కోరికను వదిలాడు. శ్రమను, నొప్పిని గమనించలేదు. ఇలా అన్నిటినీ వదిలేసి కేవలం నడవస్తుందం మీదనే దృష్టి పెట్టాడు. సాయంత్రం వరకూ వీలైనంత భూమిని సాధించాలన్న ఆత్రంలో మామూలు కష్టాలను త్రోసి రాజన్నాడు. తాను సాధించదలచిన భూమి గురించి మనసులో కలుగుతున్న  అంచనాలను అంతకంతకూ  పెంచుకొంటూ పోయాడు. చివరికి సాయంత్రం అయ్యేసరికి ప్రాణాలు కోల్పోయాడు. 

ఇక్కడ భూమి సాధించాలనే పెద్ద గీత ముందు శ్రమ, ఆకలి, ఎండ వంటి కష్టాలు దిగదుడుపే అయ్యాయి. కానీ ఉత్తమ ఆదర్శరాహిత్యం వల్ల ఆ వ్యక్తి పతనమయ్యాడు. అందుకే మన పూర్వికులు కామాన్ని జయించాలంటే, దాన్ని మించిన కోరిక వైపు దృష్టి మరల్చాలని సూచించారు. కామం అంటే ఇక్కడ శారీరకంగా కోరిక మాత్రమే కాదు. మనిషి మనసులో కలిగే ఏ విధమైన కోరిక అయినా కామమే అన్నారు నాటి కాలం వారు. 

 నరనారాయణుల కథ గురించి అందరూ వినే ఉంటారు. అందులో నరుడి కామభావన ఊర్వశిని చూడగానే నశించింది. ఎందుకంటే 'సౌందర్యం' అన్నదానికి అంతు లేదని నరుడు గ్రహించాడు. చూస్తూ పోతూంటే ఒక దాన్ని మించిన సౌందర్యం మరొకటి వస్తూ పోతూంటుంది. ఇక సౌందర్యతృష్ణ తీరటం అంటూ ఉండదు. జీవితం అంతా అశాంతిలో, అన్వేషణలో గడిచిపోతుందన్న గ్రహింపు అతనికి కలిగింది కాబట్టి అతని మనస్సు కామం నుంచి మరలిపోయింది. కానీ, అతని కామభావనను నశింపచేసిన ఊర్వశి ఉత్తరోత్తరా ఇతరులు తపస్సు చెడగొట్టి, వారి కామోద్దీపనకు దోహదమవటం గమనించాల్సిన అంశం.

ప్రపంచంలో అన్నిటికన్నా శక్తిమంతమైనది కామం. కామాన్ని కూడా జయించగలిగే శక్తిమంతమైనది భగవద్ధ్యానం. అందుకే, భగవద్ధ్యానానికి భారతీయధర్మంలో అంత ప్రాధాన్యం ఇచ్చారు. భగవంతుడిని కీర్తిస్తూ సర్వం మరచిపోయినవారు మనకు తెలుసు. భగవన్నామజపంలో మునిగి అన్నిటినీ వదిలేసినవారి కథలు మనం వింటున్నాం. శ్రీకృష్ణుడి ధ్యానంలో మీరాబాయి తన్మయురాలై, మామూలు ప్రపంచాన్ని మరచింది. భక్త తుకారామ్, జ్ఞానదేవ్, త్యాగరాజు, అన్నమయ్య ఇలా ఎందరెందరో, తమ కోరికల కడలిని భగవన్నామమనే పడవ ఆధారంగా దాటారు. ఇతరులకు మార్గదర్శనం చేశారు.

                                   ◆నిశ్శబ్ద.


More Subhashitaalu