ప్రస్తుత సమాజానికి పరమాత్మ చెప్పినమాట!

 

అభ్యాసం చేయాలంటే ముందు మనలో ఆ కోరిక పుట్టాలి. అందుకే మామిచ్ఛాప్తుం అని అన్నాడు పరమాత్మ. నన్ను పూజించాలి, ధ్యానించాలి. నన్నే పొందాలి అనే కోరిక ముందు నీలో పుట్టాలి. అప్పుడే ఎన్ని పనులు ఉన్నా, అవన్నీ పక్కన బెట్టి అభ్యాసం చేస్తావు అంటాడు. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదీ ఒకసారి చేస్తే రాదు కాని వదలకూడదు. మరలా మరలా చేయాలి. దానినే నిరంతర అభ్యాసము అని అంటారు. అసలు కోరికే లేకపోతే బలవంతంగా కూర్చున్నా నీ మనసు నా మీద నిలువదు. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మను పూజించాలి, ఉపాసించాలి, ధ్యానించాలి అనే కోరిక బలంగా మనలో కలగాలి. అప్పుడే నిరంతర సాధన అభ్యాసం సాధ్యం అవుతుంది.

ఉదాహరణకు సాయంత్రం 6 గంటలకు అభిమాన హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా టీవిలో వస్తోంది అనుకుందాము. రెండురోజుల ముందే ఆ విషయం తెలిసిన ఆ అభిమాని తన అభిమాన హీరో సినిమా టివిలో చూడాలనే కోరిక గాఢంగా పెంచుకుంటాడు. ఆ సమయంలో తనకు ఉన్న అన్ని అతి ముఖ్యమైన పనులను మానుకోవడమో వాయిదా వేసుకోవడమో చేసుకుంటాడు. 5.30 కే టివి ముందు కూర్చుంటాడు. రిమోట్ ఎవరికీ ఇవ్వడు. 6 గంటలకు సినిమా మొదలవగానే పొంగి పోతాడు. అర్థం పర్థం లేని అన్ని ప్రకటనలను ఓపిగ్గా భరిస్తూ సినిమా చూపి పరమానందం పొందుతాడు. ఇదంతా ఎందువల్ల జరిగింది. ఆ సినిమా టివిలో చూడాలనే కోరిక గాఢంగా అతని మనసులో పాతుకుపోవడం వలన అనే కదా!! బహుశా ఆ విషయం అందరికీ అర్థమయ్యి ఉంటుంది కూడా. 

అలాగే పరమాత్మను కూడా పూజించాలి, ఉపాసించాలి, ధ్యానించాలి, అనే కోరిక గాఢంగా ఉంటే, మనసు నిలువక ఏమిచేస్తుంది. ఆ గాఢమైన కోరికకు నిరంతర అభ్యాసం తోడైతే పరమాత్మ అతని వెంటే ఉంటాడు. కాని ఇదంతా సాధారణ మానవులకు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే, వారు ప్రతిరోజూ ఎన్నో పనులలో మునిగి తేలుతుంటారు. పనికిమాలిన విషయాలు ఎన్నో చర్చిస్తుంటారు. అర్థం పర్థం లేని సీరియళ్లు సినిమాలు పదే పదే చూస్తుంటారు. కాని దేవుడి ముందు కూర్చోడానికి తీరిక దొరకడం లేదండీ అని అంటుంటారు. ఇది మనం సాధారణంగా వినే మాట. అది నిజంగా తీరిక లేక కాదు. అలా కూర్చోవడానికి మనసు రాక, కోరిక లేక, అంటే బాగుంటుంది. 

(అంటే ఇక్కడ విషయం ఏమిటంటే దేవుడు అన్నీ ఇస్తున్నాడు, ఒకవేళ ఏదైనా అవసరం అయితే(దాన్నే కోరిక అని చెప్పుకుంటాం) ఎంచక్కా దేవుడి దగ్గరకు వెళ్లి ఎక్కడలేని భక్తి తెచ్చిపెట్టుకుని ప్రదక్షిణాలు, కొబ్బరికాయ కొట్టడాలు, ప్రసాదాల వితరణ అన్నీ చేసేస్తారు. అంటే అర్థం ఏమిటి?? దేవుడు కూడా అవసరం అయినపుడే గుర్తొస్తున్నాడు కానీ దేవుడిని పూజించడం అనేది ఒక నిరంతర ప్రవాహంలా సాగాలి. అప్పుడే దేవుడు అంటే ఏమిటో అర్థమవుతుంది)

ఇలా సమయం దొరకడం లేదనో, వీలు కుదరడం లేదనో చెప్ప వీళ్లే ప్రతి రోజూ బాగా అలంకరించుకొని దేవాలయాలకు వెళతారు. పూజలు చేయిస్తారు. మేము ఆ పూజలు చేయించా ఈ ప్రసాదాలు పంచాము అని గొప్పలు చెప్పుకుంటారు. తాము గొప్ప భక్తులము అని అందరూ అనుకోవాలని తాపత్రయం. కాని తాము ఉద్ధరింపబడాలని అనుకోరు. ఇందుకే భగవంతుడు ఈ శ్లోకం చెప్పాడు. మనం వృధాగా గడిపే సమయంలో కొంచెం సమయం అయినా భగవధ్యానంలో గడపాలి అనే కోరిక కలిగితే, ఆ కోరికకు అనుగుణంగా తగిన అభ్యాసం చేస్తే, మరుజన్మకు మంచి మార్గం వేసుకోవచ్చు అని అర్జునుడి ద్వారా మనకు ఉపదేశించాడు పరమాత్మ. ఎంత సేపు కూర్చున్నా మనసు భగవంతుని యందు నిలవడం లేదు, మనసు పరి పరి విధాల పోతూ ఉంటుంది అనే వారికి చెంపదెబ్బ ఈ విశ్లేషణ.  

                                  ◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories