ధేనుకాసురుడు ఎవరు...బలరామకృష్ణుల చేతిలో ఎలా మరణించాడు!

బలరామకృష్ణులకు శ్రీదాముడూ, సుబలుడూ అనే ఇద్దరు స్నేహితులున్నారు. వాళ్ళు ఒక రోజున బలరామకృష్ణుల దగ్గరకు వెళ్ళి అక్కడికి కొద్దిదూరంలోనే తాళవనం వున్నదనీ, ఆ తోటలో పళ్ళు చాలా రుచిగా వుంటాయనీ చెప్పారు. వెంటనే బలరామకృష్ణులు స్నేహితుల్ని వెంటపెట్టుకుని తాళవనానికి వెళ్ళారు.

ఆ వనంలో ధేనుకుడు అనే ఒక రాక్షసుడు వున్నాడు. అతడు అమిత బలవంతుడు. గాడిద రూపంలో వుండేవాడు. తన బంధువులందరితోనూ ఆ రాక్షసుడు అక్కడ విహరిస్తూ వుండటంవల్ల సాధారణంగా ఆ వనంలోకి ఎవరూ వెళ్ళేవారు కాదు. పొరపాటున ఒకవేళ ఎవరయినా వెళ్తే మళ్ళీ వచ్చేవారు కాదు. ఆ వనంలోకి వెళ్ళినవాళ్ళను ధేనుకుడు, అతని సహచరులు సంహరించేవారు. శ్రీదాముడూ, సుబలుడూ ఆ సంగతి బలరామకృష్ణులకు ముందే హెచ్చరికగా చెప్పారు. అయినా రామకృష్ణులకు భయమేమిటి? స్నేహితులతో కలిసి ఆ వనంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళాక బలరాముడు తాటిచెట్లను తన బాహువులతో చుట్టి కదలించి పళ్ళన్నీ రాల్చాడు. ఆ చప్పుడు చెవుల పడగానే ధేనుకాసురుడు భీకరంగా అరుస్తూ గబగబ అక్కడికి వచ్చాడు. వస్తూనే బలరాముని రొమ్ముమీద ఒక తన్ను తన్నాడు. బలరాముడికి కోపం వచ్చింది. ధేనుకుని నాలుగు పాదాలూ కలిపి పట్టుకుని, ఎత్తి గిరగిరా తిప్పి, ఆ పక్కనే ఉన్న పెద్ద తాటిచెట్టుకేసి మోదాడు. దాంతో ఆ చెట్టు కూలిపోయింది. 

అలా కూలుతూ ఆ వృక్షం పక్కనే మరో వృక్షంమీద పడింది. వెంటనే అది కూడా కూలింది. అది పడటంవల్ల దాని దగ్గరలో వున్న మరికొన్ని చెట్లు కూడా సమూలంగా నేలకూలాయి. అలా ఒకదాని వెంట మరొకటి ఫెళఫెళ శబ్దం చేస్తూ కింద పడటంతో ధేనుకుని బంధువులందరూ అక్కడికి పరుగు పరుగున వచ్చారు. వాళ్ళందర్నీ బలరామకృష్ణులు అవలీలగా సంహరించారు.

ఆవిధంగా తాళవనం అంతా చిందర వందరయింది. రాలిన తాటిపళ్ళన్నిటినీ ఏరి ఒక పెద్ద కుప్ప పోసి రామకృష్ణులు తమ స్నేహితులకు పంచి పెట్టారు. అప్పటినుంచి ఆ తాళవనం కూడా గోపబాలురకు ఆటస్థలమైంది.

ధేనుకుడు తొలి జన్మలో బలిదానవుని కుమారుడైన సాహసికుడు. అతను గంధమాదన పర్వతం మీద యధేచ్ఛగా తిరుగుతుండేవాడు. ఆ పర్వతం మీదనే ఒక గుహలో దుర్వాసమహర్షి తపస్సు చేసుకుంటుండేవాడు. సాహసికుని ఆటపాటలు మహర్షి ధ్యానానికి అంతరాయం కలిగిస్తుండేవి. అందుకని ఆయన ఆగ్రహించి 'నువ్వు గాడిదవై పుడతావు' అని సాహసికుడ్ని శపించాడు.

అలా శాపం పొందిన సాహసికుడు మధురానగర సమీపంలోని తాళవనంలో గార్దభ రూపంలో సంచరిస్తుండేవాడు. బలవంతుడు కావటం వలన ఆ తాళవనానికి అధిపతిగా వ్యవహరించేవాడు. కాలక్రమాన బలరామకృష్ణులతో పోరాడి వారి కరస్పర్శ ద్వారా శాపవిముక్తి పొందాడు. ధేనుకాసురుడు మృతి చెందాక తాళవనంలోని పళ్ళారగిస్తూ 'మాకు తెలుసు మా కృష్ణయ్య మమ్మల్ని కాపాడతాడని....' అంటూ ఆనందంతో చప్పట్లు కొడ్తూ ఆ రాక్షసుడిని తామే చంపేసినట్టు గోపబాలురందరు సంబరపడిపోయారు.

                                    ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories