గురువు చేసే అద్భుతం ఇదే…!

చాలామంది గురువు దగ్గర శరణాగతి కోరుతూ ఉంటారు. 

“అసలు శరణాగతి దేనికి? ఎవరికి?" అని ప్రశ్నిస్తే, “అంతిమ అధికారానికి” అని సమాధానమిస్తారు. కాని, దానికి ఒక 'పేరు' ఆలోచించకూడదు. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు అని అంటారు భగవాన్ రమణ మహర్షి.

"శరణాగతి చాలు. తక్కింది గురువు చూసుకుంటాడు,” అనే స్థిరభావంతో, కొందరు ఆ భావాన్ని ఆశ్రయించుకుని ఆశ్రమాల్లో స్థిరపడతారు. వారిలో కొందరు తమ వ్యక్తిత్వాలను పూర్తిగా తుడిచేసుకుని, అసలు తమ ఉనికికే ఒక ఆధారమంటూ లేకుండా చేసుకుంటారు.

తాను “లఘువు" (అల్పం-స్వల్పం) అనుకున్నంతకాలం, ఎవరికైనా గురువు వుండాలి. దేహాత్మ బుద్ధి వీడని వ్యక్తిదృష్టికే, గురు-శిష్య సంబంధం, ద్వైత భావం. భగవాన్ వంటి జ్ఞాని దృష్టి నుంచి, అన్నీ, అంతా, అందరూ ఒకటే, సమానమే. ఆ ఒక్కటి ఏమిటంటే... ఆత్మ. అందుచేత ఆయన గురు-శిష్య సంబంధాన్ని ఒప్పుకోలేదు. కాని, అర్థించిన వారికి, ఆత్మ విచారణ మార్గం చూపారు, విచారణ చేయలేనివారు, సంపూర్ణ శరణాగతి చెందమన్నారు గురువుకో, ఈశ్వరునికో, ఆత్మకో. ఆ రెండుమార్గాలూ ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయన్నారు భగవాన్. అనుభవజ్ఞానం లేక, నిలకడ కానక తిరుగాడే అజ్ఞానులకు అనుభవజ్ఞానంతో తన నడపడితో ఉపదేశించిన సద్గురువు, శ్రీరమణులు.

వెలుగుతున్న దీపం, ఇతర దీపాల్ని వెలిగించడానికి సహాయ పడునట్లు, జ్ఞాని సహాయం ఇతరులకు లభిస్తుంది. అందం, ఆనందదాయకం, ఆరోగ్యకరం అయిన మన సహజ స్థితిని నిరాకరించి, మనని మనమే హద్దుల్లో, పరిమితుల్లో పెట్టుకుని అపరిమితం, అనంతం, అపారం, అనన్యం, అవ్యక్తం అయినదాని కోసం అన్వేషిస్తాం, అర్థించి ప్రార్థిస్తాం.

ఎంతకి అంతం కాని కష్టాల్ని, కలతల్ని, దుఃఖాల్ని, బాధల్ని, యాతనల్ని, నష్టాల్ని అనుభవిస్తూ, శాంతి, ఆనందం లేక, మళ్లా వాటికోసం గిలగిలలాడి, ఆ బాధల నుంచి తప్పించుకోవాలని చూసి, అనేక చోట్లకు తిరిగి, అనేకం అభ్యసించి, ఎందర్నో అర్థించి, ఎన్నో అనుసరించి, అనుష్టించి, చదివి, విని, చూసి సాధన చేసి ఏం చేసి విముక్తి కానక, ఏ విధంగానైనా వాటి నుంచి బైటపడాలని తంటాలు పడతాం. అదీ మన తీరు. 

ఆ సందర్భంలో మనం కలుసుకున్న ప్రతి ఒక్కరూ, మనకు ఏదో ఒకటి సూచిస్తారు, బోధిస్తారు. మనం చేసే సాధన, మనం వాంఛించే ముక్తీ, మనం కోరుకునే సత్యం, మనం ఎన్నుకున్న గురువూ అన్నీ, అంతా దేహానికే అంటగట్టి, ఆ మాయలో బ్రతుకుతాం. దేహం స్థూలం గనుక, మనమూ స్థూలమే అనుకుంటాం. దేహం రోగగ్రస్తమౌతుంది. అలసిపోతుంది. ఏం వొచ్చినా, అది మనకే వచ్చిందని  అనుకుంటాం. ఆ విధంగా మనల్ని మాయ కప్పివుంచుతుంది.

మన నిజమైన ప్రార్థనా ఫలితంగా ఆవిర్భవించిన వారే మన గురువు. ఆ గురువు మన తప్పుడు జీపన విధానాన్ని మార్చుకోమనీ, శాశ్వతానందాన్ని పొందమనీ, చెప్పి నడుపుతాడు. కాని, మనం స్వయం కల్పిత రొదలో, మనం తవ్వుకున్న గోతిలో, మనం కట్టుకున్న సమాధిలో మనం కూరుకుపోతూ, ఒక్కోసారి భరించలేక ఆ మహాత్ముని చేతినే కరుస్తాం.

కాని, నిజమైన అన్వేషకుని ఆర్తిననుసరించి వచ్చిన గురువు, అతన్ని కప్పిన మాయ తెరను తొలగించి, అతన్ని అంతర్ముఖుని చేసినప్పుడు, అప్పుడు తెరపై కదలాడే బొమ్మను కాక, అసలు తెరనే చూసినప్పుడు, అప్పుడు మనం అనంత చైతన్య స్వరూపులమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అప్పటి నుంచి, మనల్ని పట్టుకుని బాధించే, వేధించే, పీడించే బాధలు, కష్టాలు, దుఃఖాలు, యాతనలు, సంసారం, విలువలు అన్నీ మనల్ని బాధించడం మానేస్తాయి. అప్పుడు ఈ ప్రపంచం మనకు విడిగా, భిన్నంగా బైట లేదనీ, అది మనలోనే వుందనీ తెలుసుకుంటాం. స్థూలరూపంలో కనిపించే ప్రపంచం కూడా, శక్తివంతంగా దర్శన మిస్తుంది. ఆ అనుభవంతో సమస్త సంశయాలు కరిగి, తొలగిపోతాయి.

                                   ◆నిశ్శబ్ద.


More Subhashitaalu