అందరిలో ఉండే అయిదు ఋణాలు, అయిదు ప్రాణశక్తులు ఇవే...

రోజూ మనం భోజనం చేసే ముందు పవిత్రీకరణలో భాగంగా వడ్డించిన ఆహార పదార్థాల మీద నీళ్ళు చల్లుతాం. అయిదు మెతుకులు తీసి, భోజనపళ్ళానికి ఒక వైపున ఉంచుతాం. అది మనం తీర్చుకోవాల్సిన అయిదు ఋణాలకు సంకేతం. 

1.‘దేవ ఋణం' : 

 మన మీద కటాక్షం చూపుతూ, కాపాడుతున్న దైవీ శక్తులకు మనం ఋణపడి ఉన్నాం. 

2. పితృ ఋణం:

 మనకు వంశావళినీ, కుటుంబ సంస్కృతినీ - ప్రసాదించిన పితృదేవతలకు మనం ఋణగ్రస్థులం. 

3. ఋషి ఋణం' : 

ధర్మాన్నీ, సంస్కృతినీ కాపాడి, మనకు అందించినందుకు గాను వారికి ఋణపడ్డాం. 

4. 'మనుష్య ఋణం': 

 మనం, మన తోటివాళ్ళు కలిస్తేనే సమాజం. తోటి వ్యక్తుల సహాయ సహకారాలు లేకుండా మనం జీవించలేం. కాబట్టి, 'మనుష్య ఋణం' తీర్చుకోవాలి. 

5. 'భూత ఋణం': 

 నిస్వార్థంగా సేవ చేసినందుకు గాను ఇతరుల ఋణం తీర్చుకోవాలి.

అటుపైన మనలోనే అయిదు ప్రాణశక్తులుగా నిలిచే భగవంతునికి ఆహారాన్ని నివేదించాలి. 'ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా' అంటూ శరీరంలోని అయిదు శారీరక విధులకూ ప్రాణశక్తిగా నిలుస్తున్న దేవుణ్ణి కొలవాలి. శ్వాస (ప్రాణ), విసర్జక (అపాన), ప్రసారక (వ్యాన), జీర్ణ (సమాన), ఉదాన వ్యవస్థలు అయిదింటికీ ఆధార భూతుడైన భగవంతుణ్ణి ప్రార్థించాలి. 

ఈ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవడం కోసం చాలా మంది 'భగవద్గీత'లోని ఈ శ్లోకాలను భోజనం చేసే ముందు పఠిస్తారు.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | 
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ॥ 

'ఆహుతి సాధనాలై స్రుక్సువాదులన్నీ బ్రహ్మ స్వరూపమే! హవిస్సు బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. హోత బ్రహ్మము. హవన క్రియ బ్రహ్మము. (బ్రహ్మమైన హవిస్సు, బ్రహ్మ రూపమైన అగ్నిలో, బ్రహ్మ రూపమైన హోత చేత హోమం చేయబడింది). కర్మలో బ్రహ్మ భావం గల ఆ పురుషుడు పొందదగిన ఫలం కూడా బ్రహ్మమే!' అని దాని భావం. 

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః। ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ 

'నేను జఠరాగ్ని రూపంలో ప్రాణుల దేహాన్ని సమాశ్ర యించి, ప్రాణ, అపాన వాయువులతో కూడి, వారు భుజించే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములనే నాలుగు విధాలైన ఆహారాలనూ పచనం చేస్తున్నాను' అని సాక్షాత్తూ భగవానుడు పేర్కొన్నాడు.

అలాగే, దేవుడికి నివేదించి, ఆహారం భుజించే సమయంలో పాటించాల్సిన కొన్ని అంశాలను కూడా మన పెద్దలు తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి, తినేటప్పుడు అన్నాన్ని అసహ్యించుకోకూడదు. నిందించకూడదు. అన్నం తిని ఎంగిలి కడుగుకొనని వాణ్ణి ఉచ్ఛిష్టుడు అంటారు. అంటే అపవిత్రుడు అని అర్థం. అలాంటి స్థితిలో అగ్ని, గోవు మొదలైన వాటిని ముట్టుకోకూడదు. సూర్య చంద్రులనూ, నక్షత్రాలనూ చూడకూడదని మన ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. మొత్తం మీద, మనం ఏది తిన్నా, మనకు జీవితంలో ఏది ఎదురైనా దాన్ని భగవత్ ప్రసాదంగా భావిస్తే, ఏ ఇబ్బందీ ఉండదు. అంతా మంచే జరుగుతుంది.


                                   ◆నిశ్శబ్ద.


More Subhashitaalu