కురుక్షేత్ర యుద్ధాన్ని చూసిన  బర్బరికుడి కథ!!


భీమునికి హిడంబికి పుట్టినవాడు ఘటోత్కచుడు.  ఘటోత్కచునికి మోర్వివల్ల జన్మించినవాడు బర్బరికుడు.

ఈ బర్బరికుడు పూర్వజన్మలో ఓ యక్షుడు. రాక్షసులు పెట్టె హింస భరించలేక దేవతలు అందరూ కలసి  మహావిష్ణువు దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడుగుతారు. అప్పుడు మహావిష్ణువు నేను దుష్టులను శిక్షించడానికి తొందరలో మనిషి రూపంలో జన్మిస్తాను, మీరేమి అధైర్యపడకండి అని చెబుతాడు. అయితే అక్కడే ఉన్న యక్షుడు ఈ మాత్రం దానికి మహావిష్ణువు మనిషి అవతారం ఎత్తాలా?? వాళ్ళందరి పని పట్టడానికి నేనొక్కడినే చాలు అంటాడు.

అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మ యక్షుడితో "నువ్వు ఎవరిని అయితే మానవ అవతారం ఎత్తాలా అని అన్నావో అదే మహావిష్ణువు కొత్త అవతారం ఎట్టి భూలోకంలో ఉండగా, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే సంఘర్షణలో మొదట నువ్వే బలి అవుతావు" అని శపిస్తాడు. ఆ శాపఫలం వల్ల ఇతడు ఘటోత్కచుని కొడుకైన  బర్బరికుడిగా జన్మించాడు.

రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు.

పాండవులకు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు బర్బీకుడు యుద్ధం చూడటానికి వెళ్తానని, నా దగ్గర ఉన్న బాణాలను బలహీనులుగా ఎవరంటే వాళ్లకోసం ఉపయోగించి వాళ్లకు విజయం కలిగేలా చేస్తానని మాట ఇస్తాడు. యుద్ధం జరిగే చోటుకు వచ్చి నిలబడుకున్నపుడు బర్బీకుడిని చూసిన కృష్ణుడు బ్రహ్మణుడి వేషంలో వెళ్లి, ఎవరు నువ్వు?? ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అలాగే నువ్వే ఈ యుద్ధంలో ఉంటే ఎన్ని రోజులలో యుద్ధం ముగిసేలా చేస్తావు అని అడుగుతాడు. దానికి బర్బీకుడు ఒక నిమిషంలో పోయిర్తిచేస్తాను, నా దగ్గరున్న బాణాలు అంత శక్తివంతమైనవి అని చెబుతాడు. అలాగే తను తల్లికి మాట ఇచ్చిన విషయం కూడా చెబుతాడు. 

బర్బీకుడు ఒకవేళ కౌరవులవైపు నిలబడితే పాండవులు గెలవరు కదా అనే ఆలోచనతో కృష్ణుడు ఇదిగో బర్బీకుడా నువ్వు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళ పక్క చేరావనుకో వాళ్ళు బలవంతులు అవుతారు. కానీ అప్పుడు ఎదుటివాళ్ళు బలహీనులు అవుతారు కదా అని చెబుతాడు. అది నిజమేనని ఇప్పుడేం చేయాలని బర్బీకుడు కృష్ణుడిని అడిగినప్పుడు ఈ యుద్ధం జరగడానికి ముందు మంచి యోధుడు బలి అయితే మంచిది అందుకే నువ్వు బలిగా మారు అంటాడు కృష్ణుడు.

తన పూర్వ జన్మ గురించి తెలుసుకుని మహావిష్ణువు చేతిలో మరణం కావాలి కాబట్టి కృష్ణుడి కోసం మరణిస్తానని తన తలను తాను నరుక్కోబోతూ మరి నేను కురుక్షేత్ర యుద్ధం చూడటం ఎలా అంటాడు బర్బీకుడు. కృష్ణుడు ముందు నువ్వు బలి అవ్వు అనగానే తల నరుక్కుని కృష్ణుడి చేతిలో పెడతాడు. అప్పుడు కృష్ణుడు ఆ తలను యుద్ధం మొత్తం కనిపించేలా ఒక కొండ పైన పెడతాడు. 

యుద్ధం ముగిసిన తరువాత పాండవులు నావల్ల విజయం కలిగింది అంటే నావల్ల అని వాధులాడుకుంటుంటే  కృష్ణుడు వాళ్ళను బర్బీకుడి  తలా ఉన్న దగ్గరకు తీసుకెళ్లి విషయం మొత్తం వాళ్లకు చెబుతాడు. వాళ్ళందరూ బాధపడతారు.

అప్పుడు బర్బీకుడు కృష్ణుడితో యుద్ధరంగం మొత్తం ఒక సుధర్శన చక్రం చెడ్డవాళ్ళ తలలు నరకడం చూసాను, కాళికాదేవి వేల సంఖ్యలో ఉన్న తన నాలుకలతో పాపం చేసిన వాళ్ళను బలితీసుకుంది అది చూసాను ఆ శక్తి అంతా నువ్వే అని చెబుతాడు.

 ఇదీ కురుక్షేత్ర యుద్ధాన్ని చూసిన బర్బీకుడి కథ.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories