మనుషుల మధ్య బంధాల తెరలు తొలగించే కథ!


మనుషుల మధ్య బంధాలు చాలా విచిత్రమైనవి. వారి వ్యక్తిత్వాలు అనుక్షణం మారిపోతూ ఉంటాయి. బయటివారు మనవారు అనే తేడా కూడా ఉండదు దీనికి. ఇలాంటి ఓ అద్భుత ఉదాహరణ చెప్పే కథ ఇదిగో….


ఓ సాధుపుంగవుడు తన శిష్యుడికి భాగవత ప్రవచనం చేస్తూ, 'నాయనా! సంసారం అనేది మిథ్య ,ఇందులో నీవు అనుకున్నట్లు శాశ్వత సుఖమేదీ లేదు! నాతో పాటు వచ్చేయ్' అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు 'లేదు గురువుగారూ! నన్నెంతగానో ప్రేమించే భార్య, ముగ్గురు పిల్లలు, తల్లితండ్రులు ఉన్నారు. వారికి నేనంటే ప్రాణం. వాళ్ళను వదలి నేనెలా రాగలను?' అని బదులిచ్చాడు. అందుకు ఆ గురువు, ‘నువ్వు నా వాళ్ళు, నా వాళ్ళు అంటున్నావు. పైగా వారు నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు. కానీ ఇదంతా నీ భ్రమే. నేనొక నాటకం ఆడతాను. దాని ద్వారా వారు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నారా? లేదా? అనే విషయం నీకర్థమవుతుంది అంటూ ఓ గుళిక ఇచ్చాడు. 'ఇంటికి వెళ్ళాక దీన్ని మింగు, దీని ప్రభావంతో నువ్వు అచేతనంగా, శవంలా పడిపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు. చుట్టూ జరిగేదంతా వినగలవు. నేను వచ్చాక మళ్ళీ నా మంత్రజపంతో నిన్ను సాధారణస్థితికి తెస్తాను' అన్నాడు.


ఇంటికి వెళ్ళి, గురువుగారు చెప్పినట్లే ఆ శిష్యుడు చేశాడు. గుళిక మింగి శవంలా పడిపోయాడు. ఇంట్లో ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. భార్య, బిడ్డలు విపరీతంగా విలపిస్తున్నారు. ఆ శిష్యుడు మనస్సులో తనపై వారికున్న ప్రేమను తలచుకొని ఎంతో పొంగిపోతున్నాడు. గురువుగారి మాటలు తప్పవుతాయని అనుకున్నాడు. ఇంతలో గురువుగారు వచ్చి, శిష్యుడి నాడి పరీక్షించి 'అరే! ఇదేంటి? ఇతడు చనిపోలేదు! నేనొక ఔషధం ఇస్తాను. అది పుచ్చుకోగానే మామూలు మనిషైపోతాడు' అన్నాడు. ఇంట్లోని వారందరి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. 'కానీ, ఈ ఔషధాన్ని ఆయనకు ప్రయోగించే ముందు, మరో వ్యక్తి దీనిని సేవించాలి. అయితే ముందుగా మందు సేవించిన వ్యక్తి మరణిస్తాడు' అని చెప్పాడు. 'మీరంతా ఇతనికి కావలసినవారే కదా! ఎవరో ఒకరు దీన్ని తాగి అతన్ని కాపాడుకోండి' అన్నాడు.  

ఆ మాట వినగానే వారందరూ ఏడుపు మాని, ఒకరి ముఖాలు మరొకరు చూసుకోసాగారు. 'నేను పోతే ఇంత పెద్ద సంసారాన్ని ఎవరు చూసుకుంటారు? పోయినవాడు ఎలాగూ పోయాడు. మిగిలిన పిల్లల్ని, కోడల్ని, మనవల్ని చూసుకొని బతుకుతాను' అన్నాడు తండ్రి. 'అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్ళే కదా! ఆయన తలరాత అలా ఉంది. పిల్లలకు తండ్రి లేకపోయినా ఫరవాలేదు. తల్లి లేకపోతే ఎలా?' అని పక్కకు వెళ్ళింది భార్య. 'అమ్మలో నాన్నను చూసుకుంటాం. మేము జీవితాన్నేమీ అనుభవించ లేదు. మేమెందుకు త్యాగం చేస్తాం' అంటూ పిల్లలు లోనికి వెళ్ళిపోయారు.


అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమైంది. తనకూ, వారికీ మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమైందో అర్థమైంది. ఇదే మనుషుల నిజ ప్రవర్తన.


                                   ◆నిశ్శబ్ద.


More Subhashitaalu