వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!  సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది.  భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే  చెమట  జుట్టు  మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి.  చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి.. హీటింగ్ టూల్స్ వద్దు.. హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు.  కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి,  జుట్టు  ఫ్రీగా ఉండటానికి బదులుగా  తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది.   తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుడ్డు వాడాలి..  వారానికి ఒకసారి జుట్టుకు  గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు  జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. నూనె రాయాలి.. పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో  చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె  కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది.  అందుకే ఉదయానికి బదులు  రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును  శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.  కండీషనర్‌.. చాలా మంది మహిళలకు   కండీషనర్‌ని  ఉపయోగించడం సరిగ్గా తెలియదు.  దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం  తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది,  బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.   డ్రై షాంపూ.. ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.  జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై  షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే  బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.                                             *రూపశ్రీ.  

  ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.  చాలా స్పష్టంగా పెళ్లికి ముందు పెళ్ళి తర్వాత అని చెబుతుంటారు కొందరు. ఇది కేవలం జీవనశైలి గురించి మాత్రమే కాదు..ఆరోగ్యం, శరీరాకృతి గురించి కూడా. ముఖ్యంగా అమ్మాయిలను గమనిస్తే పెళ్ళికి ముందు సన్నగా, నాజూగ్గా ఉన్నవారు కాస్తా పెళ్లి తర్వాత లావుగా బొద్దుగా మారిపోతుంటారు. నిజానికి దీని వల్ల చాలామంది కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత అమ్మాయిలు లావు కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పెళ్ళి నిశ్చయం అయినప్పటి నుండి పెళ్లి తంతు ముగిసిన భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టడం వరకు అమ్మాయిల ఆహార  విధానాలు మొత్తం మారిపోతాయి. ఇక కొత్తగా పెళ్లైన జంట బయటకు వెళ్లడం. ఇద్దరూ కలసి సరదా కోసం ఆహారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అమ్మాయిల ఆహారంలో కేలరీలు బాగా పెరుగుతాయి. ఇదే వారు లావు అవ్వడానికి కారణం అవుతుంది. ఆహార విధానం మారినా కొందరు బరువు పెరుగుతారు. పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయిలు అక్కడి ఆహారపు అలవాట్లు. వంట విధానం, తినే వేళలు ఇలా ప్రతి విషయంలో మార్పులు ఎదుర్కుంటారు. ఈ కారణంగా  జీర్ణక్రియ కూడా మార్పులు చోటు చేసుకుంటుంది. కొత్త పద్దతికి జీర్ణ క్రియకు అలవాటు పడేవరకు బరువు పెరగడం కామన్. భార్యాభర్తలు కలిసి భోజనం చేయడం అనేది కొత్తజంటకు కామన్. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోవడం,  కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం, భోజనంలో కాస్త ప్రత్యేక వంటకాలు ఉండేలా చూసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణం కంటే ఎక్కువ తింటూంటారు. ఇది కూడా అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                             *నిశ్శబ్ద.


పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్  వంటివి చేతిలో పెట్టి వారిని  కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

  మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ! ఆడది అమ్మయితే ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఆఖరు అనుకుంటారు చాలామంది. కానీ జీవితంలో ఎదగాలన్న తపనే ఉంటే అటు కుటుంబ జీవితంలోను, ఇటు లక్ష్య సాధనలోనూ అద్భుతాలు సాధించవచ్చని నిరూపించిన మనిషి మేరీ కాం. మహిళలకు అనువుగాని ఆటలనీ, అందులోనూ తల్లి అయ్యాక దూరంగా ఉండాల్సిన పోటీలని భయపడిపోయే బాక్సింగ్‌లో పతకాల పంటని పండిస్తున్న మేరీ కాం గురించి మరికొంత... పేదరికం... మేరీ కాం మణిపూర్‌లోని కన్‌గెతే అనే మారుమూల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు చేసుకునే కూలీలు. మేరీ కాం కూడా పూట గడిచేందుకు తరచూ ఆ పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయపడాల్సి వచ్చేది. లక్ష్యం... మేరీ కాంకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టంగానే ఉండేది. కానీ తన రాష్ట్రానికే చెందిన డింగ్‌కో సింగ్‌ ఎప్పుడైతే ఆసియా క్రీడలలో బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని తీసుకువచ్చాడో, అప్పటి నుంచి తాను కూడా బాక్సింగ్‌లో రాణించాలని నిర్ణయించేసుకుంది. పోరాటం... మేరీ ఆశయాన్ని ప్రపంచమంతా ఎగతాళి చేసింది. బాక్సింగ్‌ అనేది పురుషుల ఆటనీ, ఆడవాళ్లకు తగిన సున్నితమైన ఆటని వెతుక్కోమని హెచ్చరించింది. ఆఖరికి మేరీ తల్లిదండ్రులు కూడా ఆమె ఆసక్తిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మేరీ తన పట్టు వీడలేదు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చేరుకుంది. అక్కడ నర్జిత్‌ సింగ్‌ అనే బాక్సింగ్‌ శిక్షకుడి వద్దకు తనకు బాక్సింగ్‌ నేర్పమంటూ ప్రాథేయపడింది. శిక్షణ... తొలుత నర్జిత్‌ సింగ్‌ మేరీని తేలికగా తీసుకున్నాడు. కానీ ఇతరులకంటే తీవ్రమైన ఆమె సంకల్పాన్ని గ్రహించిన తరువాత తన శిక్షణపటిమనంతా ఆమెకు అందించాడు. నర్జిత్‌ ఆశలకు అనుగుణంగా మేరీ కాం రాష్ట్ర స్థాయి నుంచి ఒకో పోటీలో గెలుస్తూ 2001 నాటికి ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో రజతాన్ని సాధించింది. ఆ తరువాత మరో ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో బంగారు పతకాన్ని గెల్చుకుని, ఆ పోటీలలో ఆరు పతకాలను గెల్చుకున్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. పెళ్లి... 2001లో మేరీ, ఆన్లర్‌ కామ్‌ను కలుసుకుంది. మేరీ ప్రతిభతో ముగ్ధుడైన ఆన్లర్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. 2005లో ఆ జంట వివాహం చేసుకుంది. మేరీ వివాహం చేసుకుంటే ఆమె కెరీర్‌ నాశనం అయిపోతుందని నర్జిత్‌ సింగ్‌ వంటి పెద్దలంతా భయపడ్డారు. వారు ఊహించినట్లుగానే మేరీ 2006-08 కెరీర్‌కు దూరమయ్యింది. ఈ మధ్యలో ఆమెకు కవల పిల్లలు కూడా జన్మించారు. కుటుంబం అడ్డుకాలేదు... అందరి భయాలనూ తిప్పికొడుతూ మేరీ 2008లో తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించింది. మళ్లీ ఒకదాని తరువాత ఒక పోటీని నెగ్గుకుంటూ పతకాల పంటని ప్రారంభించింది. ఒక పక్క గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లవాడిని గమనించుకుంటూ, ఆ బాధని దిగమింకుకుంటూనే రికార్డుల మోత మోగించింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆన్లర్‌ కామ్‌ అందించిన ప్రోత్సాహం కూడా అసామాన్యం. 2011 ఆమె ఆసియా కప్‌లో స్వర్ణాన్ని సాధించి వచ్చేనాటికి ఆమె పిల్లవాడికి ఆపరేషన్‌ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. చరిత్ర ముగిసిపోలేదు... 2012లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పడమే కాదు, ఆ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తన పతకాల రికార్డుని మరింత పదిలం చేసింది. మేరీ కామ్‌ ప్రతిభను గమనించిన కీర్తి ఆమె వెంటపడింది. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఆమెను వరించాయి. మేరీ కాం జీవిత చరిత్ర ఆధారంగా 2013లో ‘అన్‌బ్రేకబుల్‌’ అనే పుస్తకాన్నీ, ఆ పుస్తకం ఆధారంగా ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రతో చలనచిత్రాన్ని రూపొందించారు. మేరీకాం ప్రతిభను, పోరాటపటిమను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభకు ఎంపికచేసింది. అయినా మేరీ కాం ప్రస్థానం ఇక్కడితో ఆగేట్లు లేదు. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో అర్హత సాధించడం మీదే ఆమె దృష్టంతా! - నిర్జర.