ఒత్తిడిని మీరు ఓడించండి... లేదంటే ఒత్తిడి మిమ్మల్ని ఓడిస్తుంది!

 


భారతీయ స్త్రీ... ప్రపంచంలోని అందరు స్త్రీల కన్నాఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే జీవి! కాదంటారా? ఖచ్చితంగా అనలేరు. ఒకప్పుడు మన దేశంలో మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవారు. అప్పుడు వాళ్లకి కేవలం ఒక ఒత్తిడి మాత్రమే వుండేది. ఆర్దిక స్వాతంత్ర్యం లేకున్నా మానసిక ఒత్తిడి సగానికి సగం తక్కువగా వుండేది. కాని, ఇప్పుడు ఆధునిక భారతీయ మహిళ రెండు కోణాల్లో ఒత్తిడికి లోనవుతోంది. ఇంటా, బయటా ఏక కాలంలో ద్వంద్వ యుద్దం చేస్తోంది! మరి ఈ మాడన్ మానసిక ప్రెషర్ కి పరిష్కారం ఏంటి? కొన్ని సూచనలు, సలహాలు పాటిస్తే ఒత్తడి నుంచి బయటపడవచ్చు...


మన దేశపు స్త్రీల సమస్యలలో అతి పెద్ద సమస్య అత్తగారే! సీరియల్స్ లో చూపినంత దారుణంగా, ఒళ్లు గగుర్పొడిచేలా అత్తా, కోడళ్ల సంబంధం వుండకపోవచ్చు కాని...వారిద్దరి మధ్యా సంఘర్షణ సహజం, అనివార్యం. ఒక్కోసారి ఇద్దరి తప్పూ వుండకపోవచ్చు కూడా. అయినా సరే ఎక్కువ ఒత్తిడి భరించే స్త్రీగా కోడలు కాస్త ధృఢంగా వుండాలి. తాను ఎలా వుండాలో అలా వుంటూనే అత్తగారి మనసు నొప్పించకుండా వుండాలి. ఆ క్రమంలో తాను మానసిక వేదనకి గురికాకుండా మాత్రం జాగ్రత్తపడాలి. తాను తానే కాని... అత్తగారు కోరుకున్న విధంగా మారిపోయే సినిమా తెరపై నటిని కాదని చెప్పగలగాలి.


ఉద్యోగం చేయటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. కాని, ఉద్యోగం వల్ల ఇంటి బాద్యతలతో పాటూ వృత్తి బాధ్యతలు కూడా స్త్రీల నెత్తిన పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్లు ఆఫీస్ బాస్ వద్ద చాలా ప్రాక్టికల్ గా వుండాలి. ఎంత పని చేసినా గుర్తింపు దక్కపోతే క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. అప్పటికీ ఫలితం లేకుంటే కొత్త ఉద్యోగం అన్వేషించటం బెటర్. ఇది మనం అనుకున్నంత కష్టమైంది, అసాధ్యమైంది కాదు. ప్రపంచంలో టాలెంట్, హార్డ్ వర్క్ కి ఎప్పుడూ డిమాండ్ వుంటూనే వుంటుంది!


భర్తని నూటికి నూరు శాతం నమ్మటం బార్య తప్పక చేయాల్సిన పని. కాని, అందుకోసం మీ వ్యక్తిగత కోణాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల్ని నైపుణ్యాల్ని, విద్యల్ని ఎప్పటికప్పుడూ నేర్చుకుంటూ వుండండి. అప్పుడు మీ భర్త దృష్టిలో మీకు విలువ పెరుగుతూ వుంటుంది. ఆయనపై మీరు ఆధారపడ్డారన్న భావం ఆయనకు కలగదు. సమానత్వం భర్త ఇచ్చేది మాత్రమే కాదు... భార్య స్వయంగా కష్టపడి సాధించుకోవాల్సిందని గుర్తుంచుకోండి!


మగవాళ్లకు కూడా ఒత్తిడి వుంటుంది. కాని, ఆడవాళ్లకు రెట్టింపు ఒత్తిడి వుంటుంది. ఇందుక్కారణం ఆఫీస్ లో అద్భుతంగా పని చేయాల్సి రావటంతో పాటూ ఇంట్లో చక్కగా వండి పెట్టగలగాలి. పిల్లలు, భర్త, అత్త,మామలు... అందర్నీ సంతోషరచగలగాలి. ఈ క్రమంలో మీకు ఇంటా, బయటా ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలని తాపత్రయపడకండి. ప్రతీ చోటా ప్రతీ సారీ టాపర్ గా వుండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంట్లో ప్రతీ రోజు నాలుగేసి వంటకాలు చేయకపోయినా ఫర్వాలేదు. అలాగే, ఆఫీస్ లో ప్రమోషన్ కోసం అర్థరాత్రి దాకా పని చేయాల్సిన అగత్యం లేదు. మీకు ఏది ముఖ్యమో తేల్చుకుని దాని కోసం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని చేస్తూ ముందుకెళ్లండి...


పైన చెప్పిన అన్నిటికంటే ముఖ్యమైంది మీ పక్కనున్న స్త్రీలతో పోటిపడకపోవటం. ఆరోగ్యకర పోటీ మంచిదే కావచ్చు కాని జీవితంలో ప్రతీ విషయంలో పోటీ పడుతూ పోతే ఆరోగ్యం పాడైపోతుంది. ఈ విషయం గుర్తుంచుకొని సాధ్యమైనంత వరకూ పోటీకి దూరంగా వుండండి. పోలికను దరి చేరనీయకండి. అప్పుడు మీరు మీలా వుండగలుగుతారు. ఈ ప్రపంచంలో ఒత్తిడి లేకుండా వుండటానికి మనం మనలా వుండటం తప్ప మరో మార్గం లేదు!