మిగతావాళ్ళు ఆ చాలెంజ్ ఏమిటోనని వెయిట్ చేస్తున్నారు.

 

    "చెప్పు ఏం చెయ్యమంటావ్... వూ... క్విక్..." మెడలోని గోల్డ్ చెయిన్ ని రఫ్ గా సర్దుకుంటూ అన్నాడు మధుకర్.

 

    ఏ ఛాలెంజ్ చేసినా, మధుకర్ సాధిస్తాడని మహతికి తెల్సు. కానీ ఆ ఛాలెంజ్ వల్ల మధుకర్ కి చాలా నష్టం రావాలి. ఆ ఎఫెక్టు మధుకర్ తండ్రి అనుభవంలోకి రావాలి. మహతి వేసిన ప్లాన్ అది.

 

    ఆ ప్లాన్ ఆమెను ఎంతవరకు తీసికెళుతుందో మాత్రం ఊహించలేకపోయింది.

 

    పది సెకండ్లలో తనేం ఛాలెంజ్ చెయ్యాలో నిర్ణయించుకుంది మహతి.

 

    "ఎస్... మధుకర్... దిసీజ్ ఛాలెంజ్... కొత్తగా కన్ స్ట్రక్టు చేసిన ఓపెన్ అసెంబ్లీ హాల్ వుందా... అందులో హాల్ డెకరేషన్ కోసం పెట్టిన వండర్ ఫుల్ స్టాచ్యూస్ పదిహేనున్నాయ్. వాటిని నువ్వు డిస్ట్రాయ్ చెయ్యాలి. చెయ్యగలవా...?"

 

    "ఇంతేనా... ఏ తాజ్ మహల్నో పడగొడతావా... అని పందెం కడతావేమో ననుకున్నా. నువ్వు ఛాలెంజ్ చేస్తే తాజ్ మహల్ని కూడా డిస్ట్రాయ్ చెయ్యాడానికి నేను రెడీ..." విసురుగా అన్నాడు మధుకర్.

 

    "అసెంబ్లీ హాల్ లోని స్టాచ్యూస్ డిస్ట్రాయ్ చెయ్యడమా... మహతీ నీకేం మతిపోయిందా... ఇట్స్ టూ బేడ్... థికింగ్ ఒన్స్ ఎగైన్... చాలా గొడవవుతుంది" సురేష్ అన్నాడు.

 

    "మిస్టర్ సురేష్... నేనన్నీ ఆలోచించే చెప్పాను... మధుకర్ చేస్తాడా? చెయ్యడా? నాక్కావలసింది అదే. మీ ఒపీనియన్ కాదు"సీరియస్ గా అంది మహతి.

 

    ఇద్దరికీ స్క్రూ లూజెక్కువ. ఆపినకొద్దీ ఇద్దరూ రెచ్చిపోతారు... అందుకే వాళ్ళిద్దరికీ కుదిరింది. మరిక వాళ్ళిద్దరూ వెనక్కి తగ్గరని అక్కడున్న ఫ్రెండ్స్ అందరికీ తెల్సు!

 

    అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 

    "ఎప్పుడు డిస్ట్రాయ్ చెయ్యాలి?" అడిగాడు మధుకర్.

 

    "సో! ముహూర్తం ఇప్పుడే..." కవ్విస్తూ అంది మహతి.

 

    "ఛాలెంజ్ లో నేను గెలుస్తా... గెలిస్తే... నువ్వేమిస్తావ్... చెప్పు...మధుకర్ రెచ్చిపోతూ అడిగాడు.

 

    "ఆ ఛాయిస్ నీకే ఇస్తున్నాను..." అంది మహతి మరింత కవ్వింపుగా.

 

    "ఛాయిస్ నాదేనా... ఓ.కె... అయితే విను... అందరూ చూస్తుండగానే నువ్వు నన్ను ముద్దుపెట్టుకోవాలి.... ఓ.కె...?"

 

    "ఓ.కె... డన్... నేను ముద్దుపెట్టుకోవాలి అంతేకదా... అలాగేలే. మన స్టూడెంట్స్ అందరిముందూ... అంతేకదా. మరోసారి చెప్తున్నాను.

 

    నా పెదవులు నీ పెదవుల్ని ఆ సమయంలో ఎక్కడ కనబడితే అక్కడ ముద్దు పెట్టుకుంటాయి. అంతేకదా ఫ్రెండ్స్... మీరే సాక్ష్యం. ఎస్. అయామ్ రెడీ" అంది మహతి హుషారుగా.

 

    వాడేదో ఆ వాల్యుబుల్ స్టాచ్యూస్ ని డిస్ట్రాయ్ చేస్తాడట. ఈవిడేమో పబ్లిగ్గా కిస్ ఇస్తుందట. బాగానే వుంది. మూర్తిగాడికి మాత్రం మహతి మాటల వెనక ఏదో మాజిక్ వున్నట్టనిపించింది.

 

    "రెడీ... స్టార్ట్... బయలుదేరు... మరి..." అంది మహతి.

 

    మరేమాత్రం ఆలోచించలేదు మధుకర్.

 

    మహతిమీదున్న కసి తీర్చుకోడానికి సరైన అవకాశం దిరికినట్టనిపించింది మధుకర్ కి. అదొక రకమైన హ్యూమన్ వీక్ నెస్. శత్రువునేమీ చెయ్యలేనప్పుడు ఆస్తిని నాశనం చెయ్యడం... ఆత్మానందం పొందడం... ఇలాంటిదే! గబగబా తన కారువేపు నడిచాడు.

 

    ఆ సమయంలో మధుకర్ తన తండ్రి రాఘవేంద్ర నాయుడు గురించి కానీ, మధుకర్ ఇండస్ట్రీస్ గురించి కానీ, తన తండ్రి ఇమేజ్ గురించి కానీ, ఆ తర్వాత వచ్చే నష్టాన్ని గురించి కానీ-

 

    ఏ విషయమూ ఆలోచించలేదు.

 

    కారెక్కి, స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఇగ్నీషన్ కీ తిప్పి, కారు స్టార్ట్ చేసాడు. ఆర్ట్స్ కాలేజీ వెనక, వరసగా స్టూడెంట్ హాస్టల్సున్నాయి. ఆ హాస్టల్స్ కి వందగజాల దూరంలో-

 

    అత్యాధునికంగా, అందంగా నిర్మించబడిన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. అంతకుమించి వీసీ రిటైరయ్యే ముందు తన అభిరుచుల కనుగుణంగా అద్భుతమైన విగ్రహాలతో కట్టించిన ఆడిటోరియం అది.

 

    అటూ ఇటూ అందమైన నృత్యభంగిమల్లో పాలరాతి అమ్మాయిలు.

 

    మధుకర్ డ్రైవింగ్ అంటే స్టూడెంట్స్ అందరికీ టెర్రర్!

 

    ఆడిటోరియంవైపు ఎనభైకిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఆ కారు వేపే అందరూ చూస్తున్నారు.

 

    "ఏమైంది మధుకర్ కి ? ఈజ్ హీ మ్యాడ్! ఏమిటిది?

 

    వాళ్ళు ఆలోచించేలోపుగానే విధ్వంస కార్యక్రమం మొదలైంది.

 

    ఎనభై మైళ్ళ స్పీడుతో పరుగెత్తిన మారుతీ ఒన్ థౌజండ్ మొదటి విగ్రహాన్ని ఢీకొంది. అంతే... అది తునాతునకలైపోయింది.  

 

    రెండు... మూడు... నాలుగు... అయిదు... ఆరు... ఏడు... ఎనిమిది... తొమ్మిది... పది... పదకొండు... పన్నెండు... పదమూడు ... పధ్నాలుగు... పదిహేను.

 

    ఒక్కొక్క విగ్రహాన్ని కారు ఢీకొన్నప్పుడు, ఆ శబ్ధం ఆర్ట్స్ కాలేజీవరకూ ప్రతిధ్వనించింది. సడన్ గా ఏదో పాత బిల్డింగ్ కూలిపోతున్న శబ్ధంలా వినిపించేసరికి- జనం... జనం... రోడ్లమీద జనం... బస్సులోంచి దిగి చూస్తున్న జనం... ఎటు చూస్తే అటు జనం... పదిహేనో విగ్రహాన్ని ధ్వంసం చేశాక, అప్పుడు ఇహలోకంలోకొచ్చాడు మధుకర్. ఏదో  పిచ్చిపట్టినవాడిలా వున్నాడు మధుకర్.

 

    కారు డోర్స్ నిండా, వంటినిండా దుమ్ముధూళి. అసలే సింగపూర్ డాల్ లా వుండే మారుతీ 1000 కారు ఫ్రంట్ పార్ట్ అంతా డొక్కు డొక్కయిపోయింది. అందరూ గణేష్ నిమజ్జనాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప, ఏ ఒక్కరూ వారించే ప్రయత్నం చెయ్యలేదు.

 

    దగ్గర్లోనే పోలీస్ స్టేషనున్నా, ఎస్.ఐ. లేకపోవడంవల్ల, పోలీసులు కూడా "ఏంది భయ్... వీడిట్టా లొల్లి చేస్తున్నాడు" అనుకున్నారు తప్ప వాళ్ళూ ఏం చేయలేకపోయారు.

 

    విజయగర్వంతో వందలమంది మధ్యనుంచి వచ్చిన మహతి మిత్రబృందం పక్కన కారాపాడు మధుకర్.

 

    ఠీవిగా కార్లోంచి దిగి, ఎడంచేత్తో జుత్తు సవరించుకొని, మూర్తి అందించిన కర్చీఫ్ తో ముఖం తుడుచుకొని-

 

    ఇప్పుడేమంటావ్ అన్నట్టుగా మహతివేపు చూసాడు.

 

    మహతి ఏమీ అనలేదు.

 

    చిన్న చిరునవ్వు నవ్వింది.

 

    కథ రక్తి కట్టబోతుందనుకున్నది.

 

    మధుకర్ చేతిలో నాశనం అయిన ఆ విగ్రహాల విలువ పాతిక లక్షలు.ఖర్చు ఎంత లేదన్నా మరో అయిదారు లక్షలు.

 

    మహతి నవ్వింది. మళ్ళీ మళ్ళీ నవ్వుకుంది. ఆ నవ్వును అణుచుకోలేకపోయింది. బయటకు నవ్వేసింది. అలా పదినిమిషాలసేపు నవ్వుతూనే వుంది. మహతి "ఎందుకలా పిచ్చిదానిలా నవ్వుతావ్... స్టాపిట్ ఐసే... నేను గెలిచానా లేదా... రా కమాన్..." పొగరు పొగరుగా అన్నాడు మధుకర్.