దాదా, ఆర్ముగం అందర్నీ నఖశిఖ పర్యంతరం గమనిస్తుంటే కాశీపతి మాత్రం సిగ్గుతో దొంగచూపులు చూస్తున్నాడు.

 

    అందర్నీ గమనిస్తున్న దాదా చూపులు ఓ అమ్మాయి దగ్గర ఆగిపోయాయి. తెల్లటి చీర, జాకెట్టులో ఆమె అందంగా ఆకర్షణీయంగా వుంది. ఇదేమీ దాదా గమనించడం లేదుగానీ ఆమెను ఎక్కడో చూసినట్టు బలంగా అనిపిస్తోంది. ఆమెను ఎక్కడ చూశానా అనే ఆలోచనలో పడ్డాడు. ఎంత గింజుకుంటున్నా ఆమె ఎవరో గుర్తుకు రావడంలేదు. లోపలికెళ్ళాక వివరాలు అడుగవచ్చునని భావించి తారతో "ఆ పిల్ల కావాలి" అని కళ్ళతోనే తెల్లచీర అమ్మాయివైపు చూపించాడు.

 

    "రాధా?" దాదాతో అని నాగరాజువైపుకు తిరిగి "ఆ పిల్లనంట పంపు" అంది.

 

    అంతలో తూలుతున్న ఆర్ముగం లావుగా, బొద్దుగా వున్న ఓ అమ్మాయి భుజంమీద చేయివేసి లోపలికి లాక్కెళ్ళాడు.

 

    ఇక తను ధైర్యం తెచ్చుకోకపోతే ఛాన్స్ మిస్ అయిపోతుందనిపించి కాశీపతి కూడా ఓ అమ్మాయివైపు చూపించాడు. ఆమెతోపాటు అతనూ ఓ గదిలోకి వెళ్ళాడు.

 

    దాదా కూడా లేచి రాధ వెనకే బయల్దేరాడు. ఆమెను ఎక్కడ చూశానా అన్న అనుమానం క్షణ క్షణానికి ఎక్కువ అవుతుండగా లోపలికి దారితీశాడు.

 

                                  *    *    *    *

 

    శరీర భారన్నంతా తనపై మోపి తూలుతూ నడుస్తున్న ఆర్ముగంవైపు బాధతో చూస్తోంది ఆమె. కానీ అదేమీ పట్టనట్టు ఆయన పొజిషన్ మార్చుకోలేదు.

 

    అతను సెలెక్టు చేసుకున్న ఆమె పేరు మంజుల. వయసు పాతికేళ్ళుంటాయి. చాలా మిజిరబుల్ లైఫ్ ఆమెది. వినేవాళ్ళకు ఆమె జీవితం విడ్డూరంగా వుంటుంది గానీ జరిగిన విషాదం మాత్రం నిజం. కావాల్సిన వాళ్ళే కాటువేయడంతో ఆమెను కాపాడే వాళ్ళే లేకపోయారు.

 

    ఆమె పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయింది. వూర్లో వాళ్ళు రకరకాలుగా అనుకుంటారన్న ఉద్దేశ్యంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఆమె చిన్నాన్న ఆమె బాధ్యతను తీసుకున్నాడు. ఆయన పేరు మాధవయ్య. పెద్ద తాగుబోతు. మందు గొంతులో పడకపోతే నిద్రరాదు. ఓసారి పందెం కాసి అన్నంలో సారాయి పోసుకుని కలిపి ఆ అన్నాన్ని తిన్న ఘనుడు అతను.

 

    ఇలాంటివాడి సంరక్షణలో ఆమె పెరిగింది. నానా కష్టాలుపడి యుక్త వయసుకొచ్చింది.

 

    ఓరోజు జరగరాని ఘోరం జరిగిపోయింది. మాధవయ్య తాగిన మత్తులో ఆమెను భయంకరంగా రేప్ చేశాడు. ఈ దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో తోచక మౌనంగా, రోధిస్తూ వుండిపోయింది. ఇక ఆ రోజు నుంచి మాధవయ్య నరమాంసం మరిగిన పులిలా ప్రతిరాత్రీ ఆమెను రేప్ చేశాడు.

 

    వూర్లో ఈ విషయంపై గుసగుసలు ప్రారంభమయ్యాయి. దీంతో మాధవయ్య ఆమెకు ఓ మనువు కుదిర్చి పెళ్ళి చేశాడు. రాక్షసుడి చెర నుంచి విముక్తి లభిస్తున్నందుకు ఆమె చాలా ఆనందపడిపోయింది.

 

    పెళ్ళి జరిగింది. మంజుల భర్తతో కాపురం ప్రారంభించింది. ఓ మూడు నెలల తరువాత ఓ రోజు తమ ఇంటికి వచ్చిన మాధవయ్యను చూసి వణికిపోయింది. ఆయన వియ్యంకుడితోనూ, ఆమె భర్తతోనూ మాట్లాడాడు. మంజులను చూడకుండా వుండలేకపోతున్నానని. రెండు రోజులు ఇంటికి పంపమని అడిగాడు. కనకపోయినా పెంచిన మమకారం అలాంటిదని తెలిసిన ఆమె భర్త ఇంటివాళ్ళు ఆమెను ఆయనతో పాటు పంపడానికి ఒప్పుకున్నారు తాను ఆయనతో వెళ్ళనని చెప్పాలని గింజుకున్నా ఆమె భర్తతో చివరకు చెప్పలేకపోయింది. ఇక విధిలేక దేవుడిమీద భారంవేసి మాధవయ్యతో బయల్దేరింది.

 

    టౌన్ లో ఒద్దంటున్నా మ్యాట్నీకి తీసుకెళ్ళాడు. సాయంకాలం నుంచి వూరికి బయల్దేరాడు. చిన్నాన్న వెనక భయం భయంగా నడుస్తోంది మంజుల. కొండల దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె భయపడ్డట్టే అయింది అతని పులిలా మీద పడ్డాడు. ఆమె కన్నీళ్ళతో వేడుకుంటున్నా అతను పైశాచికంగా చెరిచాడు. తన కోరిక తీరాక ఆ చీకట్లో కొండలమధ్యన ఒంటరిగా ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి ఆమె తేరుకుంది. ఇంత జరిగాక భర్తకు ముఖం చూపించడానికి మనసొప్పలేదు. చచ్చిపోదామనుకుని నిర్ణయించుకుంది. కానీ చివరి నిముషంలో తన ఉద్దేశాన్ని మార్చుకుంది. మాధవయ్య నిజ స్వరూపాన్ని భర్తకు తెలియజెయ్యాలని అత్తింటికి బయల్దేరింది. ఇక్కడే ఆమె పొరబడింది.

 

    అంతా విన్నాక ఆమె భర్త ఆమెను అసహ్యించుకున్నాడు కనీసం సానుభూతి అయినా చూపకుండా ఆ అర్థరాత్రి ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. మనుష్యుల మీదే అసహ్యంతో ఆమె బయటపడింది. ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నో బాధలుపడ్డాక ఈ నరక కూపంలోకి వచ్చిపడింది.

 

    అలాంటి ఆమె దురదృష్టం కొద్దీ ఈరోజు ఆర్ముగం చేత చిక్కింది.

 

    తూలుతూ నడుస్తున్న అతను మత్తులో ఆమె కాలుమీద తన పాదం వేశాడు. ఆమెకు ఒక్కసారిగా ప్రాణాలు పోయినట్టనిపించింది. బాధతో కెవ్వున అరిచింది.

 

    విషయం తెలియని తార ఆ కేక విని నాగరాజుతో విసుక్కుంది "విఐపీలు వచ్చినా ఇవి శుభ్రంగా పార్టీలు చేయవు. ఏమైందని ఆ పిల్ల అరుస్తోంది. రూమ్ లోకి దూరకముందు నుంచే కేకలు పెడుతోంది"

 

    అసలేం జరిగిందో తెలుసుకోవడానికి నాగరాజు అటు వెళ్ళాడు.

 

    మంజుల ఆర్ముగాన్ని మంచంమీద కూర్చోబెట్టి ద్వారం దగ్గరకు వచ్చిన నాగరాజును చూసి "ఏమిటన్నా! ఇలా వచ్చావ్?" అని అడిగింది.

 

    "ఎందుకు అరిచావ్?"

 

    ఆర్ముగం వింటాడని ఆమె ద్వారం దగ్గరికి వచ్చి మెల్లగా "బాగా తాగి వున్నాడన్నా కాలు తొక్కేశాడు" అని చెప్పింది.

 

    "భరించక తప్పదు. కేకలు అవీ పెట్టక. ఇది అమ్మ ఆర్డర్" చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అన్నట్టు అతను అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

 

    "తలుపు దగ్గర తారాట్లాటేమిటి? ఇటురా" అని పిలిచాడు ఆర్ముగం. అప్పటికే అతని కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. అది కోరికవల్లో, మందు కిక్కువల్లో తెలియడం లేదు.

 

    ఆమె భయపడుతూ అతని దగ్గరకు వచ్చింది.

 

    ఆమె రాగానే చివుక్కున అతను లేచి చాచి లెంపకాయ కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె చివుక్కున కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తనేం చేశానోనని ఓ క్షణం బిత్తరపోయింది.