మాతృ హృదయం

మా అమ్మ పేరు సులోచనాదేవి . ఆరోజుల్లోనే HSLC చదివింది వరంగల్ లో , వాళ్ళ అమ్మమ్మ ,పెద్దమ్మ గారిళ్ళలో ఉండి. తెల్లగా ,5 అడుగుల ఎత్తు ,కోల ముఖం ,చక్కని చిరునవ్వుతో అమ్మ అందంగా ఉండేది. నాన్న అమ్మని ప్రేమగా “లోచన్” అని పిలిచేవారు. అమ్మకి 12 ఏళ్ల వయసులోనే వివాహమైందట.. 14 సం.లకే అన్నయ్య పుట్టాడు . 19 ఏళ్ళకి నేను ..మూడో సంతానంగా .ఇద్దరు మొగపిల్లల తరువాత. పెద్దగారం చేసినట్టు కనపడేది కాదు గానీ ,కోరకముందే అన్ని కోరికలూ తీర్చేసేవారు అమ్మా,నాన్నా. నాన్న పెద్ద జమిందారు . అమ్మ చాలా తెలివైనది అనేవారు మా బంధువులంతా . చాలా ఓపిక .వంటలు అద్భుతంగా చేసేది. పుస్తకాలు బాగా చదివేది. అప్పట్లో వచ్చే అన్ని వార,మాస పత్రికలూ కొనేది అమ్మ. అలాగే ప్రసిద్ధ రచయిత్రుల /రచయితల నవలలు కూడా చాలా కలెక్షన్ ఉండేది. ప్రమదావనంలో మాలతీచందూర్ గారి వంటలు చదివి ,కొత్తవంటలు చేసేది. నాన్న ఏదైనా హోటళ్ళలో తిని ,రుచి ఇలా ఉంది అని వర్ణించి చెప్పేవారు . అలాగే చేయగలిగేది. అమ్మ ఊరగాయల స్పెషలిస్ట్ కూడా.. దాదాపు 10,12 రకాల ఊరగాయలు ,మామిడికాయతోనే వేసేది. ఆవకాయ ,మాగాయ, వెల్లుల్లి ఆవకాయ , నువ్వుగాయ,కొబ్బరికారం, మెంతికాయ, నీళ్ళావ ,తురుము పచ్చడి , పెసరావ, బెల్లపావ ,సన్నముక్కల తొక్కు పచ్చడి, పచ్చావ ..అబ్బో ..ఎన్నిరకాలో. మాకు మామిడి తోట వుండేది. తోటనుండి వెయ్యి కాయలు తెప్పించి ..మరీ వేసేది.

అమ్మ-నేను            

అమ్మకు రాని  విద్య ఉండేదికాదు. అన్నింటిలో కొద్దిగా ప్రవేశం ఉండేది. రకరకాల జడలు (హెయిర్ స్టయిల్ ) వేసేది నాకు. ఎండాకాలంలో మల్లె పూలజడ తప్పనిసరి. సీజన్ అయిపోయేలోపు ఒక 5,6 సార్లు వేసేది ..తనకే సరదా వెయ్యాలని. నేను అడిగకపోయినా పెద్ద సైజు మల్లెమొగ్గలు వచ్చినరోజున ఎక్కువగా తీసుకుని నాకు పూలజడ వేసేది. ఇంట్లో ఉన్న గోరింటాకు మెత్తగా రుబ్బించి , చేతిమీద అగ్గిపుల్లతో డిజైన్లు పెట్టేది. వెన్నెల రాత్రులు పెద్ద బేసిన్ లో అన్నం ,ఆవకాయ ముద్దలు కలిపి పెట్టేది మా అందరికీ..  ఇవన్నీ 12 సం.లోపు జ్ఞాపకాలు.

ఒక అమ్మగా ..కూతురుకి ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం వస్తే ఎలా పరిష్కరించిందో చూడండి. ఇప్పటివరకూ ఎవ్వరికీ చెప్పుకోలేదు నేను కూడా..కానీ ఇప్పుడు అనిపిస్తోంది..ఇది ఇప్పటి తల్లులకు కూడా ఉపయోగపడుతుంది అనిపించింది .అందుకే పంచుకుంటున్నా.

మేం చదువులకోసం ,పల్లెటూరినుండి , దగ్గరలో ఉన్న చిన్న టౌన్ కి షిఫ్ట్ అయ్యాము. అక్కడే నాన్న ఇల్లు కట్టకముందు ,మూడు పోర్షన్లు ఉన్న ఇంట్లో పెద్ద పోర్షన్ లో అద్దెకు ఉన్నాము. పక్కన రెండు వాటాల్లో మాకు దూరపు బంధువులే ఉండేవారు. అందరం చాలా కలిసిమెలిసి ప్రేమగా ఉండేవారం. నేను ఇంటర్ చదువుతున్న రోజులవి.ఎండాకాలంలో ,ఆరుబయట అందరం మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. చాలా అల్లరి చేస్తూ,పాటలు పాడుతూ..ఎంతోసందడిగా ఉండేది మాయిల్లు. 

ఒక రాత్రి అలాగే బయట వాకిట్లో అందరం మంచాలువేసుకున్నాము . కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాము.  ఒకరాత్రివేళ నాకు సడెన్ గా మెలకువ వచ్చింది. నామంచం మీద పక్కింటి బంధువుల ఇంటికి వచ్చిన ఒక అబ్బాయి కూర్చుని ,చెయ్యి నిమురుతున్నాడు .  గబుక్కున కూర్చుని అరవబోయ్యా..నోరుమూసి , దండం పెట్టి ప్లీజ్ అరవకు అని ,లేచి వెళ్ళిపోయాడు..కానీ నా గుండె వేగంగా , ఇక ఆగిపోతుందేమో అన్నంతగట్టిగా కొట్టుకుంటోంది. భయంతో నాలుక పిడచగట్టుకుపోయి..మాటకూడా రాలేదు.. అమ్మ మంచు పడదని లోపలే పడుకుంది. దబదబా తలుపుకోట్టా..అమ్మ తలుపుతీయగానే లోపలికి పరుగెత్తా.. అమ్మ దగ్గరికి వచ్చి ‘ ‘ఏమైందే” అనేలోపే ,గట్టిగా కౌగలించుకొని ఏడుపు మొదలుపెట్టాను. అమ్మ వీపు నిమురుతూ .. “ భయపడ్డావా ,కలవచ్చి౦దా ...” అంది..మెల్లగా జరిగింది చెప్పా.. అమ్మ ఏమీ మాట్లాడలేదు .. షాక్ తో అలా ఉండిపోయింది.

మర్నాటినుండి ఎవర్ని చూసినా నేను భయంతో వణికిపోతున్నా.. అమ్మను వదిలేదాన్ని కాదు ..కూడాతిరుగుతూ , బెడ్ రూమ్లోనుండి బయటికి వచ్చేదాన్ని కాదు. ఆ పక్కింటి వాళ్ళ బంధువుల కుర్రాడు మర్నాడే పరార్..వెళ్ళిపోయాడు. కానీ నాకు భయం పోలేదు. అమ్మ ఒక మధ్యాహన్నం నాదగ్గర కూర్చుని ,ఒక బుక్ చేతిలోపెట్టి ఇది చదువు అంది. “ఏమిటమ్మా ఇదీ”..అని అడిగా..అమ్మ “చదువు నీకే తెలుస్తుంది” అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. నాకు నవలలు చదవడం ఇంకా అలవాటులేదు. వారపత్రికలలో కొన్ని సీరియల్స్ , కథలు చదవడం 10 th సెలవుల్లో మొదలుపెట్టినా ,నవలలు చదవలేదు. చందమామ,బొమ్మరిల్లు, కార్టూన్స్ ,చిన్న కథలూ అంతే.. పెద్దగా టైం ఉండేదికాదు. ఎప్పుడూ చదువు గోలే నాకు..ఇంటర్ లో Bipc కూడా.. రికార్డులూ , బొమ్మలూ ..అదే సరిపోయేది. అది ఒక రచయిత్రి రాసిన నవల ..పేరు నాకు గుర్తులేదు..నవలపేరు కూడాగుర్తు లేదు.

..కానీ అందులో ఒక చిన్న10 సం. పాప మానసిక వేదన , ఇంటికి వచ్చిన కొందరు మగవాళ్ళు ఆ అమ్మాయిని ముద్దు చేయడం పేరుతో ,ఎక్కడెక్కడో తాకడం, అసహ్యంగా మాట్లాడడం ..ఆపిల్ల తట్టుకోలేక తల్లికి చెప్తుంది . తల్లి ఆమ్మాయినే తిడుతుంది..ఇంత చిన్నప్పటినుండే నీకు ఇవన్నీ ఎలాతెలుసు..? నీ బుద్దే మంచిదికాదు. వాళ్ళకి అలాంటి ఆలోచనలేకపోయినా , నీకే పాడు బుద్ధులు ..అని తిడుతుంది. ఆ అమ్మాయి మేనమామకూడా అలాగే చేస్తాడు.. అపుడు అమ్మమ్మకి చెప్పుకుని ఏడుస్తుంది . అమ్మమ్మ ధైర్యం చెప్తుంది. మగవారి ప్రవర్తన, ఎలాజాగ్రత్తగా ఉండాలో ,వంటరిగా ఉన్నప్పుడు ,ఎవరైనా వస్తే ఏమిచేయాలో ..వాళ్ళని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో చెప్తుంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండమని , దగ్గర షార్ప్ గా ఉండే పిన్నీసు,సూది లాంటివి దగ్గరపెట్టుకుని , ఎవరైనా మగవాళ్ళు తాకితే , అదికూడా తప్పుగా అనిపిస్తేనే ..గట్టిగా పొడవమని, భయపడవద్దని , ఎవ్వర్నీ నమ్మవద్దనీ ..చాలా ఎడ్యుకేట్ చేస్తుంది.ఆతరువాత ఆ అమ్మాయి బాగా చదువుకుని, ధైర్యంగా ఎదుగుతుంది. ఆ నవల చదివాక నాకు చాలా ధైర్యం వచ్చింది.  అందులో అమ్మమ్మ చెప్పినట్టు ,నేనొక్కదాన్నే కాదు..చాలామందికి ఇలాంటి చేదు అనుభవాలు ఉంటాయి ..వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాళ్లకు బుద్ధి చెప్పాలి..అన్నమాటలు నాకు బాగా నచ్చాయి. బుక్ చదివాక , అమ్మ ఏమీ అడగలేదు..కళ్ళతోనే ..అర్ధమయ్యిందా అన్నట్టు చూసింది. మితభాషి కదా. ఆతరువాత నేను ఎవ్వరికీ భయపడలేదు. ఎప్పుడూ దగ్గిర పెద్ద పిన్నీసు ఉంచుకునేదాన్ని . బస్సులో , సినిమాహాళ్ళలో , రద్దీగా ఉన్న ప్లేస్ లలో ...నా పిన్నీసు బాగా పనిచేసేది. అమ్మ ఏమీ మాట్లాడకుండానే, హితబోధ చెయ్యకుండానే, నా సమస్య పరిష్కరించేసింది . పదునైన చూపుతోనే ,ఆమడ దూరంలో ఉంచి మాట్లాడేదాన్ని నచ్చనివారితో .

ఉషారాణి నూతులపాటి-