నాలో నిండి పోయిన అమ్మ

అమ్మ గురించి రాయమంటే చేయి చిందులు వేస్తోంది ..నాలో నిండి పోయి ఉన్న అమ్మ గురించి ఎక్కడని మొదలు పెట్టి రాయను ! అమ్మ లా అయిపోతున్నాను నేను అరే అమ్మ లాగే ఆలోచిస్తున్నాను నేను ? అని ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఆశ్చర్యం లో నేను .అమ్మా ! ఏమిటీ ఈ చాదస్తం ?   అని మొన్నే కదా అమ్మని విసుక్కున్నాను ..అదే చాదస్తం తో ఇప్పుడు నేను ..పిల్లలెలా ఉన్నారో అని ఎందుకమ్మా బెంగ ? ఫోనులు రాలేదంటే క్షేమం గా ఉన్నారని అర్దం ..అనే నేను ఇప్పుడు ఎందుకు వారం అయింది పెద్ద వాడి నుంచి ఫోన్‌ వచ్చి అని ఎందుకు రోజుల లెక్కలు కొలుస్తున్నాను ..ఆకలి గా ఉంటే మేం వచ్చి తింటాం అమ్మా !వండి బల్ల  మీద పెట్టావు కదా , ఇంక నీ పని అయిపోయింది ,హాయిగా నిద్రపో కాసేపు అన్నా , వినకుండా .. చల్లారి పోతాయే ఆ కబుర్లు ఆపి వచ్చి భోజనాలు తినండి పిల్లలూ అని బ్రతిమాలే అమ్మ , ఇప్పుడు నాలో నూ కనిపిస్తోంది ..వాళ్ళ కిష్టమైనవి చేసి పెడితే వచ్చి తినరేం ? అని ఉక్రోషం తో నేనూ ..అమ్మ నే కదా ..
మా అమ్మ ,ఏమిటి ఇలా నాలో అణువణువూ నిండి పోయింది ?

తప్పులు చేసినా క్షమించే అమ్మ , పిల్లల పిల్లల కీ ఇంకా వండి పెట్టాలని బలం తెచ్చుకునే అమ్మ , మీకెందుకే ఇబ్బంది అంటూ తన ఆరోగ్య సమస్యలు దాచుకునే అమ్మ , ఇంకా ఎందుకమ్మా ఈ తాపత్రయం అంటే నవ్వే అమ్మ , వేడి కాఫీ కి ఉదయం నిద్ర లేవడానికీ ఒక్క ఐదు నిముషాలు తేడా కూడా భరించ లేని అమ్మ , వేడి వేడి గా పొగలు కక్కుతూ అన్నం ఉంటే చాలు ,పచ్చడి  , చారు అయినా చాలు , పరమాన్నమే అనే అమ్మ , నా బాంక్ పనులు అవీ నేను చూసుకుంటున్నాను అంటే అదొక కాలక్సేపమే నాకు అంటూ ,మేము దగ్గర లేక పోవడాన్ని సద్దు కుని పోయే అమ్మ , బాంక్ లో ఉద్యోగులు ఎందుకమ్మా మీరు  వస్తారు ? మీ పిల్లలెవరూ లేరా ? అంటే పిల్లలే పంపిస్తున్నారు బాబూ ..ఈ డబ్బు అంతా , దగ్గర లేక పోవడమేం ? పిలిస్తే పలుకుతారు , మొన్నే వచ్చి వెళ్ళింది మా పెద్ద అమ్మాయి అంటూ నవ్వుతూ జవాబిచ్చే అమ్మ ..

ఊరంతా స్నేహితులే , పిలిస్తే పలికే వారు కొందరైతే ,పిలవక పోయిన వచ్చి పలక రించే వారు ఎందరో ? ఫోన్‌ కి ఒక్క క్షణం విశ్రాంతి ఉండదు , అమ్మా ! అమ్మా ! అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు ..నీ చేతి కంది పొడి అన్నం తిన్నాం , నీ  సాంబారు రుచి ఎంత చెప్పినా నా భార్యకి రావడం లేదు , ఈ సారి అమ్మ దగ్గర నేర్చుకో అని చెప్పాను అంటూ , మా ఊరు ఏలురు నుంచి , నాన్న గారి స్నేహితులూ , వారి కుటుంబ సభ్యులూ ,మా పిల్లలందరి స్నేహితులూ ,స్నేహితురాళ్ళూ , మా అత్తగారి వేపు బంధువులూ ,చెలెళ్ళ వేపూనూ , విశ్వ బంధువు తను ,,అమ్మ .. మేం తను పంచే ప్రేమకి అమ్మ లా వారసులం అవుతామా ? ఏమో కాలమే చెప్పాలి .. అమ్మ ,మా అమ్మ ..ఎంత మందికో అమ్మ ..మాకెంత గర్వమో ..

అమ్మా ! అని పిలుస్తే చాలు ..కోట్లు తన దగ్గర ఒంపినంత సంతోషం ..పని వారు ప్రాణం పెడతారు ..పోటీ పడతారు ..తన ఇంట్లో పని చేయడానికి , ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే చాలు ,ఆటో డ్రైవెర్ అయినా సరే ,ముందు ఆకలేస్తోందా ? అని ఆరా తీసి ఇంత అన్నం వడ్డించే మా అమ్మ ..

ఎంత చెప్పినా ఇంకా సరిపోదు .నా దగ్గర అంత పద సంపద లేదు ..మా అమ్మ గురించి రాయడానికి ..అమ్మ నే తలుచుకుని ..ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను ..ఈ రోజు .. అమ్మా ..ఐ లవ్ యూ ..అని ఎప్పుడూ అనని మాటని ఈ రోజు అంటున్నాను ..బయటకి .

పుల్లాభొట్ల వసంత (లక్ష్మీ వసంత.)