అందమైన కురులు కావాలంటే....

 

మగువకు కురులే అందం అంటారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటివి ఆ అందానికి అన్యాయం చేస్తున్నాయి. ప్రతిరోజూ శిరోజాలు రాలిసోతోంటే దిగులుపడటం తప్ప ఏమీ చేయలేక దిగులుపడుతున్నారు ఎంతోమంది మహిళలు. నిజానికి  జుత్తు కాపాడుకోడానికి పెద్ద కష్టపడక్కర్లేదు.... ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటే చాలు అంటున్నారు ప్రముఖ  సెటెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ మార్క్ టౌన్సెన్డ్. అవేమిటో చూడండి...

- జుత్తు పెరగడం లేదే అని బెంగపడటం కూడా జుత్తును పాడు చేసుకోవడమే. ఎక్కువగా దిగులు పడేవాళ్లు, ఒత్తిడి పడేవాళ్ల జుత్తు త్వరగా ఊడిపోవడమే కాదు, పెరిగే లక్షణాన్ని కూడా కోల్పోతుందట. మహా అయితే జుత్తు నెలకు అరంగుళం పెరుగుతుందంతే. కాబట్టి రాత్రికి రాత్రే పెరిగిపోవాలని ఆశపడటం అనవసరం.

- జుత్తు కట్ చేస్తే పొట్టిగా అయిపోతుందని దిగులుపడుతుంటారు. కానీ జుత్తును ఎంతగా కత్తిరిస్తే అంతగా పెరుగుతుందన్నది నిజం. కాబట్టి పది పన్నెండు వారాలకోసారి జుత్తుని ఒక అంగుళం కత్తిరించడమే మంచిది.

- ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. తలంటుకున్నప్పుడు మాత్రం మురికి పూర్తిగా వదిలేలా చూసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్ అప్లై చేయాలి.

- వారానికోసారి తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేయాలి. దానివల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తలపై ఉన్న చర్మంలో తేమ పెరుగుతుంది. అది జుత్తు పెరుగుదలకు దోహదపడుతుంది.

- జుత్తును ఎడా పెడా దువ్వేయకూడదు, రుద్దేయకూడదు. కొందరు నూనె రాసుకునేటప్పుడు, దువ్వుకునేటప్పుడు జుత్తును అటూ ఇటూ వేసేస్తుంటారు. అది తప్పు. జుత్తును ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో దువ్వుకోవాలి. అప్పుడే పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రాలకుండానూ ఉంటుంది.

- తలంటుకున్న తర్వాత జుత్తుని టవల్ తో మరీ గట్టిగా కట్టేసుకోకూడదు. తడిసిన జుత్తు చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటప్పుడు బిగించి కట్టడం వల్ల చిట్లిపోవడం, తెగిపోవడం జరుగుతుంది.

- మరీ వేడి నీటితో తలంటుకోకూడదు. చల్లని లేక గోరు వెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. షాంపూని ఒకే పద్ధతిలో పెట్టుకోవాలి. మురికి పోవాలి కదా అని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకోకూడదు.

- జుత్తుకీ దిండుకీ సంబంధం ఉందంటే మీరు నమ్మగలరా? కానీ ఉందట. గట్టిగా ఉండే దిండు మెడ, తల కండరాలకే కాదు... జుత్తుకి కూడా హాని చేస్తుందంటారు మార్క్. అందుకే మెత్తగా ఉండే దిండు మాత్రమే వాడాలి. అలాగే ఉన్ని, ఖద్దరు దిండు కవర్లు వాడకూడదు. అవి జుత్తుని డ్యామేజ్ చేస్తాయట. వీలైనంత వరకూ శాటిన్ కవర్లు వాడటమే మంచిదట.

చూశారా! వీటిలో చాలా తప్పులు మనం చేస్తుంటాం. కొన్ని చేయాలని తెలిసి కూడా చేయకుండా దాటవేస్తుంటాం. అందమైన కురులు కావాలంటే నిర్లక్ష్యం తగదు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తపడండి మరి!

- Sameera