"సార్, ఏం జరగుతోంది... వారం అయింది... మీ డిపార్ట్ మెంట్ ఏ మాత్రం ప్రోగ్రెస్ అవలేదు. నా కూతురు బతికుందో లేదోకూడా తెలియని దుస్థితి... కనీసం అది బతికుందోలేదో అయినా తెలిస్తే మనసు రాయి చేసుకుంటాం. ఏ స్థితిలో వుందో కూడా తెలియని ఈ దుస్థితి ఏ తండ్రికీ రాకూడదు... ప్లీజ్ డూ సమ్ థింగ్... ప్లీజ్ హెల్ప్ మీ."
    అంత పెద్దమనిషి టేబిల్ మీద తలవాల్చి రోదిస్తుంటే డి. ఐ. జి. నిస్సహాయంగా చూశాడు. "సార్ ప్లీజ్! కూల్ డౌన్, పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆ ప్రయత్నంలోనే వుంది. కాని, ఎక్కడా చిన్న ఆధారం దొరకడంలేదు..." తల పట్టుకుని అన్నాడు డి. ఐ. జి.
    "సార్.. చితక్కొట్టండి... సెల్ లో పడేసి అందరినీ కుళ్ళబొడవండి నిజం చెప్పేవరకు. ఆ డీఫాల్టర్స్ పనే ఇది. అందరినీ కలిపి జైల్లో పడేయండి..." ఆవేశంగా అన్నారు.
    ఎంతో సంయమనం పాటించే పెద్దమనిషి అంత విచలితుడైపోవడం చూసి ఏదో గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు డి. ఐ. జి.
                                          * * *
    గత వారం రోజులుగా శారద తల్లిదండ్రుల దగ్గిర వుండిపోవాల్సిన పరిస్థితి తప్పలేదు. తన కేసులు వాయిదాలు కోరుకుంది. అదృష్టవశాత్తు ఇంట్లో అత్తగారుండబట్టి రాహుల్ సంగతి, వంటావార్పూ అన్నీ ఆవిడ చూసుకుంటోంది గనుక నిశ్చింతగా వుండగలిగింది.
    ప్రకాష్ రెండు మూడుసార్లు గొణిగాడు... "ఎన్నాళ్ళుంటావు... వుండి ఏం చెయ్యగలుగుతావు? అక్కడ రాహుల్ ని అలా వదిలేస్తే ఎలా" అంటూ ఫోన్ లో అసహనంగా అన్నాడు.
    "ఏం చెయ్యను, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళిద్దరినీ వదిలి ఎలా వస్తాను... నేను లేకపోతే తోండీ తిప్పలు మాని ఏడుస్తూ కూర్చుంటారు. అమ్మ అయితే లేచి వంటమాట దేవుడెరుగు కాఫీకూడా చెయ్యకుండా రోజంతా పక్కమీద పడుకుని ఏడుస్తోంది" అంది దిగులుగా.
    "ఇక్కడ సంగతీ చూసుకోవాలిగా, రాహుల్..." ఏదో అనబోయాడు.
    "పోనీ వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయండి. స్కూల్ కి ఇక్కడినించే పంపిస్తాను. మీకు అత్తయ్యగారున్నారుగా..." అంది అసహనంగా.
    ఇంట్లో ప్రతిరోజూ సన్నిహితులు, బంధువులు, తెల్సినవారు సానుభూతి చూపించడానికి, ధైర్యం చెప్పడానికి వస్తూనే వున్నారు. ఇదంతా శారద చూసుకోవాల్సి వస్తోంది. సునీత, సుప్రియ వచ్చారు కబురు తెలిసిన మర్నాడు.
    "ఏమిటే ఈ ఘోరం..." అంది సునీత కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.
    "శారదా! అమ్మని, నాన్నని నీవే చూసుకోవాలి ఇంక..." అంది సునీత కళ్ళు తుడుచుకుంటూ.
    "శారదా! ఏదన్నా అవసరం అయితే చెప్పు" అంది సుప్రియ.
    "అప్పుడప్పుడు వస్తూండండి. వీళ్ళిద్దరి ముందు ఏడవడానికి కూడా లేదునాకు. నేనూ ఏడిస్తే మరీ బెంబేలుపడిపోతారని నా దు;ఖం దాచుకుంటున్నాను. పాపం ఆ శ్రీనివాస్ బాధ చూడలేకపోతున్నాను. మనలా పైకి ఏమీ చెప్పుకోలేని బాధ అతనిది. దాని గురించి చెప్పలేని వ్యధ అనుభవిస్తూ కూడా పేపరు ఆగకుండా లాక్కొస్తున్నాడు. నాన్నకి కొడుకు లేని లోటు తీరుస్తున్నాడు" అంది శారద మనసు విప్పి చెప్పుకుంటూ.
    ఒక గంట కూర్చుని వెళ్ళారు స్నేహితురాళ్లిద్దరూ. సునీతని చూసి రవీంద్ర కూడా బాధపడ్డాడు.
    "శారదావాళ్ళ పేరెంట్స్ ఎలా తట్టుకుంటున్నారో ఈ బాధ పాపం.." అన్నాడు సానుభూతిగా.
    "ఓసారి వెళ్లి చూసిరండి మీరూ..." అంది సునీత.
    "ఆఫ్ కోర్స్! నేనూ అదే అనుకున్నాను, కాని శారద ఏం అనుకుంటుందోనని" బిడియం అన్నాడు. సునీత అతనివంక చూసి "గత పదేళ్ళ స్నేహం మనది" అంది పొడిగా. తలవూపాడు రవీంద్ర.
                                           * * *
    డి. ఐ. జి. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని ముఖ్యమంత్రితో చర్చించాడు.
    "సార్! మీరొకసారి డీఫాల్టర్స్ అందరినీ మీటింగ్ పెట్టి హెచ్చరిస్తే బాగుంటుందనిపిస్తోంది సార్... బాకీల వసూలు గురించి, అంతా ఒకసారి కాకపోయినా వాయిదాల మీద డబ్బు చెల్లించేందుకు అంగీకరింపచేసి ప్రెస్ మీట్ పెట్టి తెలియచెయ్యటం ఒకటి... రెండు, వారిని అనుమానితులుగా అరెస్ట్ చేసే అధికారం నాకియ్యాలి..."
    "మనం ఒక కమిటీ వేశాం గదా! డైరెక్ట్ గా నేను ఇన్వాల్వ్ ఎలా అవుతాను... అది పద్ధతి గాదు" ముఖ్యమంత్రి అన్నారు.
    "లేదు సార్! వెంటనే బాకీలు చెల్లించకపోతే జరిగేదానికి ప్రభుత్వ బాధ్యత వుండదు. కేసు మొత్తం పోలీసుల చేతికి వెడుతుంది. పర్యవసానానికి వారే బాధ్యులు అని తెలియచెయ్యండి. శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి సెల్లో పడేస్తే ఆదివారం సెలవు. సోమవారం దసరా సెలవు. కోర్టుకి సెలవులు. బెయిల్ అప్లై చెయ్యడానికి కూడా వీలుండదు. రెండు మూడురోజులు జైల్లో కూర్చోబెట్టి ఈ వార్త ప్రముఖంగా మీడియా, పత్రికలలో వచ్చేట్టు చేస్తే పరువు పోయి కాస్త దారిలోకి రావచ్చు.
    బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అరెస్ట్ చేస్తాం... మంగళవారం కోర్టులో హాజరు పరుస్తాం. బెయిల్ ఇచ్చేదీ లేనిదీ కోర్టిష్టం. జైల్లో పడేస్తే భయపడి, నీరద గనుక ఇంకా బతికుంటే వదిలిపెట్టే ఛాన్సుంటుంది. అసలు ఈ పాటికి చంపేసి వుంటే శావాన్ని ఏం చేసి వుంటారు? ఇక్కడా అక్కడా దొరికిన రెండు మూడు శావాలని మార్చురీలో పెట్టినవి చూశాం కానినీరద అందులోలేదు. నాకెందుకోగాని ఆమెని ఇంకా చంపలేదు అనిపిస్తోంది. చంపితే శావాన్ని వాళ్ళకి పంపి 'ఇదిగో నీ కూతురికి పట్టిన గతి చూసుకో' అనేవారు కదా. సార్, ఏది ఏమైనా మీరొకసారి ఆ పెద్దమనుషులతో చర్చించండి. బెదిరించండి."
    "నేను కాదు, హోమ్ మినిస్టర్ తో చెప్పిస్తాను" సాలోచనగా అన్నారు ముఖ్యమంత్రి. దానికి అంగీకారం తెలిపాడు డి. ఐ. జి.
    ఆ మర్నాడే హోమ్ మినిస్టర్ మీటింగుకి ఏర్పాటు చేయించాడు సెక్రటరీ ద్వారా. ఛీఫ్ సెక్రటరీ, ఇన్ స్పెక్టర్ జనరల్, ప్రభుత్వ న్యాయవాది, బ్యాంక్ డైరెక్టర్లు అంతా సమావేశం అయ్యారు. పెద్దమనుషులందరూ మొహాలు మాడ్చుకుని తలలు దించుకుని కూర్చున్నారు. "మీరు తలలు దించుకునే పనిచేసి మమ్మల్ని ఇరుకున పడేసి ప్రజలముందు తలదించుకునేట్టు చేశారు.