మృదువైన పాదాల కోసం...!

 

 

అందంగా ఉండటం అనగానే ముఖాన్ని పట్టించుకుంటాం తప్ప పాదాలను పట్టించుకోం. అవి కూడా అందంలో భాగమనే విషయం మర్చిపోతాం. అది కరెక్ట్ కాదు. చీర కట్టుకుంటే పాదాలు కనిపించకపోవచ్చు కానీ మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మాత్రం పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు పాదాలు అందంగా లేవనుకోండి... మన గ్లామర్ కి మార్కులు తగ్గిపోయినట్టే. కాబట్టి కాస్త పాదాలను కూడా పట్టించుకోండి.

 

* పాదాలు పొడిబారి చిట్లిపోతుంటే... రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెను వేడి చేసి దానితో పాదాలను బాగా మర్దనా చేయండి. ఆ తరువాత సాక్స్ వేసుకోవాలి. ఉదయం లేచిన తరువాత నలుగుపిండి పెట్టి బాగా రుద్ది కడిగేసుకోవాలి. కొన్నాళ్లపాటు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు అందంగా, మృదువుగా తయారవుతాయి.


* ఉప్పు, నిమ్మరసం కలిపి బాగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోయి పాదాలు చక్కగా మెరుస్తాయి. మృదువుగానూ ఉంటాయి.


* బొప్పాయి గుజ్జులో తేనె కలిపి పాదాలకు ప్యాక్ వేయాలి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుని, మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాసుకోవాలి.


* ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ ను కలిపి పాదాలకు పూయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసి మరోసారి వట్టి రోజ్ వాటర్ ను రాయండి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 


* వేడినీటిలో నిమ్మరసం వేసి పాదాలను అందులో ముంచండి. పదిహేను నిమిషాల పాటు అలా ఉంచాక బైటికి తీసి ఫ్యూమిస్ స్టోన్ తో బాగా రుద్ది కడగండి. తరువాత బట్టతో తుడుచుకుని మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాయండి. రోజు విడిచి రోజు ఇలా చేస్తుంటే పాదాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి.

-Sameera