"ఏం మాట్లాడను? పోనీ...నువ్వే చెప్పు..." అంది పూజ ఫోన్ కి ఆవేపు నుంచి.

 

    "ప్రస్థుతం ఏం చెప్పలేని స్థితి."

 

    "అదేం...అలా?"

 

    "అపర్ణ వచ్చింది."

 

    "చూశాను."

 

    "ఒక్కతే రాలేదు."

 

    "ఒక్కతే వస్తే...ఏదైనా చేసేందుకు వీలుండదనా?" నవ్వుతూ అందామె.

 

    "నో...నో...నన్నంత నిగ్రహం లేనివాడిలా చూడకు."

 

    "ఓకే...రాముడు మంచి బాలుడు. నమ్ముతాను...మరి..."

 

    "ఒంటరిగా వుంటే ఏదైనా, ఎంతైనా, ఎంతసేపయినా మాట్లాడుకోవచ్చని."

 

    "ఏదైనా...ఎంతైనా, ఎంతసేపయినా...ప్రాస...ప్రేమగాలి సోకితే ప్రతివాడు కవి అయిపోతాడని ప్లేటో మహాశయుడు ఊరికే చెప్పలేదు. సరి...సరే! ఉదయం బృందంతో కలిసి ఎక్కడికెళ్ళావు?"

 

    "రెస్టారెంటుకి."

 

    "రెస్టారెంట్ సంగతులేంటి?"

 

    "ఏముంటుంది? టిఫెన్ చేసి, వాళ్ళను రవీంద్రభారతి దగ్గర దింపి, నేను, నా ఫ్రెండ్ ఆఫీసుకెళ్ళిపోయాం."

 

    "అంతేనా!"

 

    "అంతే...."

 

    "ఆ రెండు సంఘటనలకు మధ్య మరేం జరగలేదా?" నవ్వును బలవంతాన దాచుకుంటూ అడిగింది పూజ.

 

    కొద్ది క్షణాలేం మాట్లాడలేదు శ్రీధర్. మాళవిక అనే స్టన్నింగ్ బ్యూటీ-యోగి ఒకప్పటి ప్రియురాలు నిర్మల కలిసినట్టు చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయాడు.

 

    "ఆ రెండు సంఘటనలకు మధ్య జరిగిన మరో సంఘటన గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావా?" నవ్వుతూ అడిగింది పూజ.

 

    ఆమె మాటలకు బిత్తరపోయాడు కొద్ది క్షణాలు.

 

    "ఆ ఇద్దరెలా వున్నారు?"

 

    "ఏ ఇద్దరు?"

 

    "వేషాలొద్దు...యోగి...అదే నీ ఫ్రెండ్...ఖాళీ బీరు బాటిల్ తో నాటకమాడి నా ఆచూకీ పట్టేసిన మేధావి, నీకెవర్ని పరిచయం చేశాడు?"

 

    ఆమె మాటలు పూర్తవుతూనే దిగ్భ్రాంతికి లోనయిపోయాడు శ్రీధర్.

 

    "నువ్వుకూడా అదే సమయంలో రెస్టారెంట్ కొచ్చావా?"

 

    "అదిప్పుడంత అవసరమా?"

 

    "మరి నీకవి ఎలా తెలిశాయి?"

 

    "నువ్వు నాక్కావాలి. ఇష్టపడే మగాడికోసం ఒక స్త్రీ ఏదయినా చేస్తుంది. ఎంతకయినా తెగిస్తుంది. ఒకవేళ ఏ స్త్రీ అయినా అలా చేయక పోతే, ఆమెకు యిష్టం విలువ-ఇతరులమీదున్న ప్రేమ విలువ తెలీని జడురాలుకిందే లెక్క... చెప్పు ఎలా వున్నారు వాళ్ళిద్దరూ?"

 

    "ఫర్వాలేదు..." అన్నాడు శ్రీధర్-ఎందుకలా అనేశాడో అతనికే తెలీదు.

 

    "మాళవికలాంటి రియల్ బ్యూటీ...నిర్మలలాంటి ఎక్సోటిక్ పర్సనాలిటీ నీకు పర్వాలేదనిపించారా? కళ్ళతోనే చూశావా?"

 

    "లేదు, మాళవిక అనే అమ్మాయి చాలా బావుంది. నిర్మల చతురత కూడా బాగుంది."

 

    "మాళవిక నా అంత బాగుంటుందా?" కవ్విస్తున్నట్టుగా అంది పూజ.

 

    "నువ్వెలా వుంటావో నాకు తెలీనప్పుడు నిన్ను ఆ అమ్మాయితో ఎలా పోల్చడం...అవునూ ఆ టైమ్ లొ నువ్వెక్కడున్నావ్? ఐయామ్ ఎ ఫూల్."

 

    "ఎందుకలా అనేసుకుంటున్నావ్?"

 

    "పరిసరాల్ని ఒక్కసారి గమనించి వుంటే అప్పుడే నువ్వు దొరికిపోయే దానివి."

 

    "అదంత తేలికైన విషయం కాదులే-ఇంతకీ మాళవికతో ఏం మాట్లాడావు."

 

    "ఏంలేదు...ఏవో పొడి మాటలు రెండు మూడు."

 

    "పొడిమాటలు...తడి చూపులు...అవునా?"

 

    "చూపులా?" ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీధర్.

 

    "నువ్వా అమ్మాయిని దొంగచూపులు చూడలేదూ? నిజం చెప్పు" నిలదీస్తున్నట్టుగా వుంది పూజ కంఠం.

 

    "దొంగ చూపులా? అదేంలేదు" బింకంగా అన్నాడు శ్రీధర్.

 

    "అసలేం...చూడలేదా?"

 

    "చూశాను."

 

    "ఎందుకలా?"

 

    "ఇది మరీ బాగుంది. అందమైన ప్రకృతిని, అమ్మాయిల్ని, వస్తువుల్ని చూడడం కూడా తప్పేనా?"

 

    "అందమయిన ప్రకృతిని చూడడానికి నువ్వేమన్నా కీట్స్ వా? అందమయిన అమ్మాయిల్ని పరిశీలించడానికి నువ్వేమన్నా కృష్ణశాస్త్రివా? అందమైన వస్తువుల్ని చూసి సొంతం చేసుకోవడానికి నువ్వేమన్నా సాలార్ జంగ్ వా?"

 

    ఆమె అంత హార్ప్ గా, వేగంగా రియాక్ట్ అవుతుందని వూహించని శ్రీధర్ మాటలు రాని బొమ్మయిపోయాడు.

 

    అయినా క్షణాల్లో తేరుకున్నాడు.

 

    "వాళ్ళే గొప్పా? మరెవరూ అందాన్ని ఆస్వాదించలేరా?" చిరు కోపాన్ని మాటల్లో ప్రదర్శిస్తూ అన్నాడు.

 

    "చూడడం నుంచి ఆస్వాదించేవరకూ వెళ్ళావే...అందుకేనా ఆ మాళవికని దొంగ చూపులు చూశావు? అందుకేనా షేక్ హాండ్ యివ్వబోయావు?" నవ్వుతూ అడిగింది పూజ.

 

    అది వింటూనే నెత్తిమీద బాంబు పడినట్టుగా ఫీలయ్యాడు శ్రీధర్.

 

    "నువ్వు షేక్ హాండ్ ఇవ్వబోయావు-ఆమె సుతిమెత్తని, సుందరమయిన చేతిని స్పృశించడానికి-అవునా? ఆమె సింపుల్ గా ఏం చేసింది?"

 

    "నమస్కరించింది. అయినా షేక్ హాండ్ ఇవ్వాలనుకోవడంలొ నువ్వనుకుంటున్న ఉద్దేశమేమీలేదు. అది కూడా ఎలా చూశావు? ఎక్కడ్నించి చూశావు?"

 

    కిలకిలా నవ్విందామె సమాధానం యివ్వకుండా.

 

    "కొంపదీసి నువ్వుగాని ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లొ పని చేయడం లేదుకదా!" అయోమయంలోంచి క్రమంగా తేరుకుంటూ అన్నాడు శ్రీధర్.