"ఏమిటి? నాలుగు సంవత్సరాలనుండీ నువ్వు తిరుగుతున్నావా."

 

    "అవును."

 

    "ఎలా జీవించావు? ఏం చేశావు?"

 

    "బహుశా పతనమైపోయాననుకుంటాను. ఎలా జీవించానో, ఏం చేశానో స్పష్టంగా చెప్పలేను, దాచుకోవాలని కాదు. నాకు తెలియకుండానే నేను బ్రతికాను. నా మనస్సుతో సంబంధం లేకుండా శరీరం బ్రతికింది. నేను కలుసుకున్న వ్యక్తులూ, నాకు జరిగిన సంఘటనలూ లీలగా గుర్తువున్నాయి. నిన్ను కలుసుకున్న క్షణం నుండి వాటికి తమ అస్తిత్వాన్ని కోల్పోయి వుండవచ్చు. కాని అవి ఈ భూమ్మీద జరగిన యదార్థాలే, నీ ముందు వాటిని దాచవలసిన అవసరం లేదు. సమయమొచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను."        

 

    అతనాశ్చర్యంగా వింటున్నాడు. రైలు ఏదో స్టేషన్ లో ఆగి మళ్ళీ బయల్దేరింది.

 

    "నా గురించి యిన్ని ఇడుముల నెదుర్కొని యింత భయంకరమైన జీవితాన్ని అనుభవించావా వేదితా?" అన్నాడు కల్యాణమూర్తి బాధతో కూలిపోతూ.

 

    ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. యోగినిలా నవ్వింది.

 

    "ఇందాకట్నుంచీ అడుగుదామనుకుంటున్నాను. నువ్వు... ఎట్లా... ఎట్లా... నవ్వగలుగుతున్నావు వేదితా?"  

 

    "నిజంగా... నాకు తెలియదు" ఇది ఆమె జవాబు.

 

    "నీ జీవితం యింత దుర్భరంగా తయారవటానికి కారణం నేను. నన్ను చూస్తే కోపం లేదా?"

 

    "ఉహుఁ!"

 

    "ఎందుకని?"

 

    "అదీ తెలియదు."

 

    ఒక క్షణమాగి అతను "ఇంకా ఏం విన్నావు నా దుష్ట స్వభావాన్ని గురించి? ఇది చూడు" అంటూ జేబులోంచి ఓ శుభలేఖ తీసి ఆమెకు చూపించాడు. "పెళ్ళి -నాదే హైదరాబాద్ లో ఓ గొప్ప మిలియనీర్ కూతురితో. ఎల్లుండి ముహూర్తం నిశ్చయించబడింది" అన్నాడు.

 

    ఆమె శుభలేఖ అందుకుని చూసి "నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావా కల్యాణ్!" అంది. ఆమె గొంతులో ఏ భావమూ ధ్వనించలేదు.

 

    "అవును, ఈ భయంకరమైన వంటరితనం నుండి తప్పించుకోవటానికి, నన్ను వేధించే సమస్యలనుండి తప్పుకోవటానికి చివరకు బాహ్య ఒత్తిడికి లొంగిపోయి ఈ సంబంధానికి అంగీకరించిక తప్పలేదు" అన్నాడతను తప్పు చేసినట్లు.

 

    అప్పుడు చూసిందామె అతని ముఖంలోకి పరీక్షగా. అతని కన్నులలో అమాయకత్వం, స్వచ్చత నాలుగేళ్ళ క్రితం ఎలా కనిపించాయో యిప్పుడూ అలానే కనిపిస్తున్నాయి. అవి అతని సొత్తు అనుకుంది. మనిషి అప్పటికంటే కాస్త నల్లబడ్డాడు. దిగులుగా కనిపిస్తున్నాడు.

 

    కళ్ళు క్రిందకివాల్చి "అలాగైతే నీ పెళ్ళి చూసే వెడతాను" అంది.

 

    "నా పెళ్ళి జరగట్లేదుగా?"

 

    ఆమె ఆశ్చర్యంగా "అదేమిటీ? శుభలేఖ యింకా నా చేతిలోనే ఉంది.ముహూర్తం కూడా ఎల్లుండే."

 

    "అవును. అదంతా నిజమే కాని నువ్వు కనిపించిన క్షణానే ఆ కాబోయే పెళ్ళి ముహూర్తమూ అన్నీ గాలిలో కలిసిపోయాయి. నేనిప్పుడు మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నానంటే అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు"

 

    "నిశ్చయింపబడిన పెళ్ళి ఆగిపోతే నీకెంత చెడ్డపేరు వస్తుందో ఆలోచించావా?"

 

    "చెడ్డపేరు. ఎదురుపడిన మహాదృష్టాన్ని కాలదన్నుకుని యే యంత్రం మెడలోనో పుస్తెకట్టి అవివేకాన్ని వరించమంటావా?"  

 

    నువ్వు ఎంత భ్రమలో వున్నావు కల్యాణ్? ఓ పవిత్ర జీవితాన్ని విడిచిపెట్టి సర్వనాశనాన్ని కోరితెచ్చుకున్న పతితురాల్ని నేను. ఈ భ్రష్టురాల్ని కలుసుకోవటం మహాదృష్టమని తలపోస్తున్నావా?"

 

    కల్యాణమూర్తి ఆమె రెండు భుజాలమీద చేతులు వేసి పొదివి పట్టుకుని తనవైపు త్రిప్పుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆవేశంగా. "సుకుమారమైన పుష్పంలాంటి దానివి. సూర్యకిరణంవంటి తేజస్వినివి. చంద్రకాంతివంటి నిష్కపట మనస్వినివి. మెత్తని హృదయం నీది. నీవా పతితురాలివి? నీవా భ్రష్టురాలివి?"  

 

    అతని ఆత్మవిశ్వాసానికి, నిశ్చల మనస్తత్వానికి వేదిత చలించిపోయింది. ఆమె కళ్ళవెంట బొటబొటా కన్నీరు కారుతూండగా "నువ్వెరుగవు కల్యాణ్! ప్రపంచంలో మనం కనీ వినీ ఎరుగని వింతలు కొన్ని జరుగుతుంటాయి. ఈ నాలుగేళ్ళ కాలమూ ఏ మాలిన్యమూ అంటకుండా యెలా బ్రతకగలననుకున్నావు నేను? యెప్పుడైతే ఆనందపురం విడిచి పెట్టానో, ఆనాడే తిరిగి తేరుకోలేని ఆగాధంలోకి దిగజారాను. యెందుకంత ఆశ్చర్యపడతావు నువ్వు? నీవిప్పుడు చూస్తున్న వేదిత యిదివరకు నీ వెరిగిన వేదితకాదు. ఈమె అనుభవాల పుట్ట. పీడకలల రాశి" అంది.

 

    అయినా అతని ఆత్మవిశ్వాసం, ఆమెపట్లవున్న గాఢ మైత్రీత్వ భావం, ఉన్నతమైన అనురాగం చెక్కు చెదరలేదు. "ఒకవేళ అదీ నిజమై నీవు యెంత పతనం చెందానని అనుకుంటున్నా సరే, ఆ పతనానికి, నీ సంగ్రామ జీవితానికి మూల కారణం నేనే కాబట్టి, నీ బాధ్యతకూడా నేనే వహిస్తాను. ఇది కేవలం సానుభూతి ప్రదర్శించటమనుకుని త్రోసి పారెయ్యకు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఆసన్నమైనా కూడా నీవు పొందవలసిన స్థానం. నేను నీ భక్తుడ్ని, ఆరాధకుడ్ని, నా దృష్టిలో యిది యిప్పటి వరమే. కాకపోతే వరమివ్వటంలో ఒకింత జాప్యం చేశావు. అంతే. అంతకు మినహా మిగతాదంతా సవ్యంగా జరిగింది. అనవసరంగా కలతలు పెట్టుకుని నీ మనస్సు పాడుచేసుకోకు" అంటూ ఆమె హృదయంలోని ఆవేదనను త్రోసిపారవేయటానికి ప్రయత్నించాడు.