రచ్చ గెలిచిన తులసి

 

 

తులసిలోని ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఈ పెరట్లోని మొక్క ఎన్నో రకాలుగా, ఆరోగ్యం వరప్రదాయినిగా నిరూపించబడింది ఇప్పటికే. అయితే ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్‌కి చెందిన శాస్త్రవేత్తలు తులసితో సరికొత్త ప్రయోగం చేశారు. సాధారణంగా ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసినా, ఇ.కొలి, లిస్టెరియో వంటి బ్యాక్టీరియా కారణంగా ఆహారం త్వరగా పాడైపోతూ ఉంటుంది. ఇలా ఆహారం పాడైపోకుండా ఉంచే గుణం తులసిలో ఉన్నట్టు గుర్తించారు వారు. తులసి మొక్క నుంచి తీసిన రెండు రసాయనాలతో అంటే మిథైల్ ఛేవికల్, ఆల్కహాల్ లినలూల్‌లతో ప్లాస్టిక్ రేపర్‌ను తయారు చేసేందుకు ప్రయత్నించారు. 

తులసి మొక్క నుంచి తీసిన రసాయనాలతో ప్లాస్టిక్ రేపర్‌ను తయారు చేసి, అందులో ఆహారాన్ని నిల్వ చేస్తే, ఆ ఆహారం చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంటునట్లు గుర్తించారుట. పైగా ఈ తులసి వాసన ఆహారానికి పట్టక పోవటాన్ని కూడా గుర్తించారుట. అలాగే ఈ తులసి రేపర్స్ వలన ఆహారం కూడా కలుషితం కాదు. అలాగే తులసి నుంచి తీసిన రసాయనాలు ఎనిమిది రకాల బ్యాక్టీరియాలతో పోరాడతాయని గుర్తించారు పరిశోధకులు. పెరట్లో తులసిమొక్క వుంటే చాలు ఆరోగ్యం మీ స్వంతం అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతుంటే మనం వినిపించుకోవటం లేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు  తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నొక్కిచెబుతుంటే నమ్మకుండా ఎలా వుంటాం.

 

-రమ