Home >>Sweets N Deserts >>Vinayaka Chavithi Special Recipes

 

 

వినాయక చవితి స్పెషల్ రెసిపీస్

 

 

 

రాగిలడ్డు (వినాయక చవితి స్పెషల్)

 

 

కావలసిన పదార్ధాలు :-

* రాగి పిండి                                  - 1 కప్పు 

* నెయ్యి                                       - 1/2 కప్పు 

* చెక్కర లేక బెల్లం                          - 1 కప్పు 

* అవిసె గింజలు లేక నువ్వుల పప్పు    - చెంచా 

* చిన్నగా ముక్కలు చేసిన జీడిపప్పు    -  2 చెంచాలు 

తయారీ విధానం..

* ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రాగిపిండి వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. 

* అది వేగి నోట్లో చిటికెడు వేసుకుంటే పొడి కరకరలాడాలి అలా కదుపుతూ కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకొని చేయి పట్టే వేడి ఉండేవరకు చల్లర్చుకోవాలి

* ఇప్పుడు కొద్ది బరకగా పొడి కొట్టుకున్న చెక్కర గాని, బెల్లం సన్నని తురుము గాని కలుపుకుని వేయించి ఉంచుకొని ఉన్న నువ్వులు, జీడిపప్పు పొడివేసి.. వేడి నేతిలో ఈ పిండిని సున్నుండలా కలుపుతూ ఉండలు చుట్టాలి. ఇవి రుచికి చాలా బావుంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

 

 

ఉండ్రాళ్ళు (వినాయక చవితి స్పెషల్)

 


వినాయకచవితి పండుగ రోజు గణపతికి పెట్టే ప్రసాదాల్లో ముఖ్యంగా ముందు వరుసలో ఉండేది ఉండ్రాళ్లు. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

కావలసిన పదార్దాలు:

* బియ్యం రవ్వ          - 1 కప్పు

* నూనె                    - 2 చెంచాలు

* జీలకర్ర                   -  1/2 స్పూన్

* ఉప్పు                     - 1/2 స్పూన్

* సెనగపప్పు              - 3 స్పూన్స్

* నీళ్ళు                    - 2 కప్పులు
 
తయారీ విధానం:

బియ్యంరవ్వను.... (మిక్సిలో బియ్యం ఆడించి.. వచ్చిన రవ్వను జల్లించి..పైన వచ్చిన రవ్వను) ఉండ్రాళ్ళకు వాడతారు.

ముందుగా దళసరి గిన్నె తీసుకుని 1 కప్పు రవ్వఅయితే... 2 కప్పుల నీళ్ళు గిన్నెలో పోసి...సెనగపప్పు వేసి జీలకర్రతో పాటు 2 స్పూన్స్ నూనె కలపాలి. బాగా మరుగుతున్న నీటిలో రవ్వ కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పూర్తిగా రవ్వ పోసికలిపి మూత పెట్టాలి. అలా సిమ్ లో 5 నుంచి పదినిమిషాలలోపు ఉంచితే రవ్వ పలుకు లేకుండా ఉడుకుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి మగ్గాక వెడల్పు పళ్ళెం లేక బేసినలోకి ఈ రవ్వను తీసి చల్లారనిచ్చి తడి చేతికి కొద్దిగా నేయి రాసుకుని ఉండలుగా చుట్టాలి...అంతే ఉండ్రాళ్ళు రెడీ....

-భారతి

 

 

 

జిల్లేడు కాయలు


 

 

వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములతో పాటు జిల్లేడు కాయలని కూడా ఆరగింపుగా పెడతారు. వినాయకుని నైవైద్యంలో ప్రతీ వంటంక ఆవిరి మీద  ఉడికించినదే. ఈ జిల్లేడు కాయలు కూడా అంతే. చేయడం సులువు... రుచిగా కూడా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు:

బియ్యపు పిండి            - 2 కప్పులు

బెల్లం                         - 1 కప్పు

కొబ్బరి తురుము          - 1/2 కప్పు

జీడిపప్పు                     - 4 చెమ్చాలు

కిస్మిస్                        - 4 చెమ్చాలు

నువ్వులు                   - పావుకప్పుడు

పల్లీలు                       - పావు కప్పుడు

నీళ్లు                          - రెండు కప్పులు

ఉప్పు                          - రుచికి తగినంత

యాలుకుల పొడి          - చిటికెడు
 
తయారీ విధానం:

1. ముందుగా నీళ్లని ఒక వెడల్పాటి గిన్నెలో పోసి బాగా మరిగించాలి. అవి కళపెళ మరుగుతుండగా బియ్యపు పిండిని కొంచం, కొంచం పోస్తూ కదుపుతూ ఉండాలి ( బియ్యపు పిండిలో ముందుగానే ఉప్పు కలిపి ఉంచాలి). ఉండలు చుట్టకుండా చూసుకోవాలి. పిండి ఉడికి గిన్నెని వదులుతుండగా స్టవ్ ఆపేసి దించాలి.

2.  ఇప్పుడు ఒక బాణలిలో పల్లీలని, నువ్వులని విడివిడిగా ఎర్రబడే వరకూ వేయించి ఆరనివ్వాలి. ఆరాకా మరీ మెత్తగా కాకుండా బరక బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

3. ఒక ప్లేట్ లోకి కొబ్బరి తురుము, పల్లీలు, నువ్వుల పొడి, బెల్లం తురుము, యాలుకుల పొడి, అలాగే జీడిపప్పు, కిస్ మిస్ ( వీటిని వేయించుకోవద్దు. సన్నగా కట్ చేసుకోవాలి) తీసుకొని వాటిని బాగా కలపాలి.

4. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బియ్యపు పిండిని చిన్న ఉండలుగా చేసి నెమ్మదిగా చేతితో వత్తుకోవాలి. ( పూరీలలా అరచేతి సైజులో ఉండాలి).

5. అలా వత్తిన పిండి మధ్యలో కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయలని మడిచినట్టు మధ్యకి మడవాలి (చూడటానికి కజ్జికాయలలా వస్తాయి). చూట్టూ చేతితో వత్తితే పిండి మధ్యలో మిశ్రమం ఉంటుంది.

6. ఆఖరిగా అలా సిద్దమయిన జిల్లేడు కాయలని ఒక కుక్కర్ గిన్నెలో పెట్టి ఆవిరిమీద ఒక పది నిమిషాలు ఉడికించాలి (ఎక్కువ సేపు ఉంచకూడదు విడిపోతాయి).

...రమ

 

 

పెసర పప్పు పాయసం

 

 

లక్ష్మీదేవికి తీపి ఆరగింపుకి ఈ పెసరపప్పు పాయసం చేస్తారు మా ఇంట్లో. ఈ రోజు ఆఖరి శ్రావణ శుక్రవారం. సాయంత్రం దీపాలు పెట్టి, పూజ చేసి తీపి నైవేద్యం పెట్టాలి కదా ..ఇదిగో అమ్మవారికి ఇష్టమయిన తీపి వంటకం. చేయటం కూడా సులువే.

కావలసిన పదార్థాలు :

* పెసర పప్పు            - ఒక కప్పుడు

* బెల్లం                    - 1 1/2 కప్పులు

* పాలు                   - ఒక లీటరు

* జీడి పప్పు              - తగినంత

* కిస్మిస్                  - తగినంత

* నెయ్యి                   - పావు కప్పుడు

* యాలకుల పొడి       - రుచికి తగినంత

తయారుచేసే విధానం:  

ముందుగా బాణలిలో ఒక నాలుగు చెమ్చాల నెయ్యి వేసి జీడి పప్పు, కిస్మిస్ లని ఎర్రగా వేయించాలి. వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకుని, అదే బాణలిలో పెసర పప్పుని వేసి కొంచం ఎర్రబడే వరకు వేయించాలి. మరీ ఎర్రబడ కూడదు. అలా వేయించిన పెసర పప్పుకి ఒక నాలుగు కప్పుల నీరు పోసి కుక్కరులో పెట్టాలి. ఒక అయిదు విసుల్స్ వచ్చేదాకా ఉంచితే పప్పు మెత్తగా ఉడుకు తుంది. ఈ లోపు బెల్లం లో కొంచం నీరు పోసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించాలి. బెల్లం మొత్తం కరిగాక కొంచం తీగ పాకం వచ్చేదాకా వుంచి దించాలి.

అలాగే పాలని కూడా మరిగించి వుంచుకోవాలి. పాలు కొంచం చిక్కగా మరిగేదాక తిప్పుతూ వుండాలి. అలా మరిగిన పాలల్లో, ఉడికించి పెట్టుకున్న పెసర పప్పు ని బాగా మెదిపి ..ఉండలు లేకుండా చూసి అప్పుడు కలపాలి. బాగా తిప్పుతూ వుండాలి, లేదంటే అడుగు అంటి మాడు వాసన వస్తుంది పాయసం. పాలల్లో పెసరపప్పు పూర్తిగా కలిసాక, అప్పుడు బెల్లం పాకాన్ని పోసి ఒక పది నిముషాలు పాటు ఉడికించాలి. అలా ఉడికించి నంత సేపు గరిటతో కలియ బెడుతూ వుండాలి. దించేముందు నెయ్యి, ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లని, అలాగే యాలకుల పొడి ని కూడా వేసి కలిపి దించాలి. యాలకుల పొడిని ఎప్పుడూ తీపి వంటకం అంతా పూర్తి అయ్యి దించేముందు వేస్తే ఆ పరిమళం వంటకానికి బాగా పడుతుంది.

అమ్మవారికి ఆరగింపు అయ్యాక, వేడిగా ఈ పాయసం తింటే బావుంటుంది. పిల్లలకి చల్లగా ఇష్టం అనుకుంటే ఫ్రిజ్ లో పెట్టి ఇవ్వచ్చు ..చాలా రుచిగా వుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ పాయసం బెల్లం, పాకం పట్టి, పాలని బాగా మరిగించి చేస్తాం కాబట్టి ఆ రుచి చాలా ప్రత్యేకంగా వుంటుంది..

....Rama

 

సొజ్జ బూరెలు

 


శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి , తీపి నైవేద్యం పెట్టాలి అంటారు. నిజమే కాని ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి రకరకాల వంటకాలు చేయటానికి సమయం సరిపోదు. కాస్త మన పద్ధతులకి దగ్గరగా, అలాగే సులువుగా చేయగలిగే స్వీట్స్ చేయటం తెలిస్తే బావుంటుంది కదా. అలా సులువుగా అయిపోయే స్వీట్ ఈ సొజ్జ బూరెలు. బూరెలు అన్న పేరు వినగానే నేను కూడా ముందు వద్దులే మనవల్ల అయ్యే పని కాదు అనుకున్నా..కాని చేసాక పర్వాలేదు సులువే అనిపించింది. మరి మీరు కూడా చేసి చూడండి. రేపు కృష్ణాష్టమి కూడా కదా.. క్రిష్ణయ్యకి కూడా ఇష్టమే తీపి వంటకాలు. కాబట్టి రేపు కూడా చేసుకోవచ్చు..

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ            :      ఒక కప్పుడు

పంచదార                    :      ఒక కప్పుడు

నీరు                           :      ఒక కప్పుడు

నెయ్యి                         :      రెండు చెమ్చాలు

యాలకుల పొడి             :     చిటికెడు

బియ్యం పిండి                :     పావు కప్పు

మైదా                           :    పావు కప్పు

ఉప్పు                            :    చిటికెడు

వంట సోడా                    :     చిటికెడు

నూనె                            :     వేపుకి తగినంత

తయారీ విధానం:

ముందుగా నూకని పొడి బాణలిలో కాస్త ఎర్రదనం వచ్చే దాక వేయించాలి. ఆ తర్వాత తీసి వేరే ప్లేట్ లో పోసి అదే బాణలిలో నీరు పోసి మసిలే వరకు ఉంచాలి. నీరు మసులు తుండగా అందులో ముందుగా నూక వేసి కలిపితే దగ్గరకి వస్తుంది. ఆ తర్వాత వెంటనే పంచదార కూడా వేసి కలపాలి. పంచదార వేయగానే నూక జారుగా వస్తుంది. కాని కదుపుతూ వుంటే మళ్ళి దగ్గర పడుతుంది. కొంచం దగ్గర పడుతుండగా నెయ్యి వేసి బాగా కలిపితే బాణలికి అంటుకోకుండా వస్తుంది. నూక ఉడికి ఉండ చేసుకునే వీలుగా రాగానే దింపి చల్లారనివ్వాలి . ఈ లోపు బియ్యం పిండి, మైదా పిండిలని కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి, వంట సోడా కూడా చిటికెడు వేసి తగినంత నీరు కలపాలి. దోశెల పిండిలా జారుగా వుండాలి. మామూలు బూరెలు చేయటానికి తోపు పిండి వాడతాం కదా అలా రావాలి.

నూక మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తోపు పిండి లో ముంచి నూనెలో వేయించాలి. మరి ఎర్రగా కాకుండా కాస్త బంగారు వర్ణం వస్తుండగా తీసి పేపర్ మీద పెడితే నూనె ఏమన్నా వుంటే పేపర్ పీల్చేస్తుంది. చేయటం ఎంతో సులువు కాని రుచిలో మాత్రం పూర్ణం బూరెలకి పోటి పడతాయి ఈ సొజ్జ బూరెలు. చేసి రుచి చూసి చెప్పండి. మా ఇంటి మహాలక్ష్మికి ఆరగింపు పెట్టిన ఈ బూరెలు చూడండి ..నోరురిస్తున్నాయి కదా..

టిప్స్ :

* నీటిలో నూక వేసిన వెంటనే పంచదార కూడా వేయాలి ..లేక పోతే నూక పూర్తిగా ఉడికి గట్టి పడితే పంచదార వేయగానే ఉండలు, ఉండలు కడుతుంది.

* అలాగే నూకతో పాటే పంచదార కూడా వేస్తె నూక పూర్తిగా ఉడకదు. ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే సొజ్జ బూరెలు సూపర్ గా వస్తాయి .

..రమ

Related Recipes