వెజ్ పట్టి

 


తయారీకి కొంచెం సమయం పట్టినా, దాని రుచి చూశాక కష్టం అంతా మర్చి పోవచ్చు. అంత రుచిగా వుంటుంది ఈ పట్టి. సాధారణంగా ఇంట్లో వారం ఆఖరులో మిగిలే కూరలతో దీనిని చేసుకోవచ్చు. మన అవకాశాన్ని బట్టి దానిలో వేసే కూరగాయలు మార్చుకుంటూ వెళ్ళచ్చు. నేను రకరకాల కాంబినేషన్స్ ట్రై చేస్తుంటా. ఈ రోజు బేసిక్ మోడల్ చెబుతున్నా.

కావలసిన పదార్థాలు

అలూ - 2
క్యారట్ - 2
గ్రీన్ పీస్ - ఒక కప్పు
స్వీట్ కార్న్ - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - రెండు చెమ్చాలు
సోయా నగ్గెట్స్ - చిన్న కప్పుతో
అల్లం తురుము - అర చెమ్చా
పచ్చి మిర్చి - రెండు
కారం - ఒక చెమ్చా
కసూరి మేతి - ఒక చెమ్చా
డ్రై మాంగో పౌడర్ - అర చెమ్చా
నిమ్మ రసం - అర చెమ్చా
ఉప్పు -  తగినంత
గరం మసాలా - ఒక చెమ్చా
నూనె - చిన్న కప్పుతో

తయారీ విధానం:
ముందుగా ఆలు, క్యారట్, గ్రీన్ పీస్‌లని కుక్కర్లో ఉడికించుకోవాలి. నీళ్ళు వంపేసి ఓ బౌల్‌లోకి తీసుకుని అందులో స్వీట్ కార్న్, సోయా నగ్గెట్స్‌తోపాటు  నూనె తప్ప అన్నిటినీ వేసి బాగా కలపాలి. అలా కలిపిన మిశ్రమానికి మూతపెట్టి ఫ్రిడ్జ్‌లో ఓ పది నిమిషాలు వుంచి తీయాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒకో ఉండని రెండు అరచేతుల మధ్య పెట్టి నెమ్మదిగా వత్తి పట్టి షేప్‌లో చేసుకోవాలి. ఆ తర్వాత పెనం మీద కొంచెం నూనె వేసి వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. డీప్ ఫ్రై చేస్తే నూనె ఎక్కువ పీలుస్తుంది, అలాగే విడిపోయే అవకాశం కూడా వుంది. ఫ్రై చేయటానికే కొంచం ఎక్కువ సమయం పడుతుంది. కొంచం త్వరగా అయిపోవాలి, శ్రమ తగ్గాలి అనుకుంటే ఓవెన్‌లో రోస్ట్ చేసుకోవచ్చు .

టిప్:  ఈ వెజ్ పట్టి తయారీలో బ్రెడ్ కూడా వాడతారు. బ్రెడ్ పొడిలో దొర్లించి ఫ్రై చేయచ్చు. కానీ అప్పుడు ముందుగా పొడి‌లో దొర్లించి పెట్టుకున్న పట్టీలని కాసేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి అప్పుడు వేయించాలి.

-రమ