తాటి ముంజల కూల్ ఖీర్

 

 

ఇది మన ప్రాంతానికి పూర్తిగా కొత్త స్వీట్. అయితే మన ప్రాంతంలో దొరికే పదార్థాలతో ఈ స్వీట్ చేసుకుని ఎంచక్కా లొట్టలేస్తూ జుర్రుకోవచ్చు. ఎండాకాలంలో మనకు తాటిముంజలు విరివిగా లభిస్తాయి. ముంజలను డైరెక్ట్‌గా తినడం, ముక్కలు చేసి పంచదార జల్లుకుని తినడం మాత్రమే చాలామంది చేసేపని. ఈ వేసవిలో ఈ సుగర్ పామ్ ఖీర్ చేసుకుని తిని చూడండి.. ప్రతి సీజన్‌లోనూ తప్పకుండా చేసుకుని తినేంత రుచిగా ఇది వుంటుంది.

 

కావలసిన వస్తువులు:

ముంజలు               - 12
కొబ్బరికాయ           - 1
బియ్యం                  - 50 గ్రాములు
ఉప్పు                     - చిటికెడు
బెల్లం                      - 200 గ్రాములు
యాలకులు            - 2

 

తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తాటి ముంజలను పైనున్న పొట్టు వలిచేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ముంజలను పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. కొబ్బరికాయను పగులగొట్టి, కొబ్బరితో పాలను తయారు చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో సిద్దం చేసుకున్న కొబ్బరిపాలలో సగం పోసి 5 నిమిషాలపాటు సిమ్‌లో కాగబెట్టాలి. ఇప్పుడు అందులో బియ్యం వేసి అవి కొంత ఉడికేంత వరకు స్టవ్‌ని సిమ్‌లోనే వుంచాలి. బియ్యం ఉడికిన తర్వాత అందుతో తాటి ముంజల ముక్కలు, ఉప్పు, బెల్లం (తాటిచెట్టుని ఇంగ్లీషులో సుగర్ పామ్ అంటారు.. అయినప్పటికీ ఈ ఖీర్‌లో పంచదార కంటే బెల్లం వేసుకుంటేనే రుచిగా వుంటుంది), యాలకుల పొడి వేసి 5 నిమిషాలపాటు కాచాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించుకుని, మరో 5 నిమిషాలు అగిన తర్వాత మిగిలిన సగం కొబ్బరిపాలను అందులో పోసి కలుపుకోవాలి. ఈ తాటి ముంజల ఖీర్‌ టేస్ట్ ఎలా వుంటుందో మేం చెప్పడం కంటే మీరే తయారు చేసుకుని ప్రత్యక్షంగా తెలుసుకోవడం న్యాయం.