నూనె లేని ఆవకాయ

 

 

 

 ఆవకాయలలో ఈరోజు చెప్పుకునే ఆవకాయది ఓ ప్రత్యేకత.. ఆవకాయనిండా అంత కారం, అంత నూనె అని భయపడేవాళ్ళు ఈ ఆవకాయని ఏ భయం లేకుండా తినచ్చు. ఇందులో నూనె వేయం. కేవలం నీటితో పిండిని కలుపుతాం. కారం కూడా ఎక్కువ ఉండదు. ఈ ఆవకాయ పెట్టడానికి పెద్ద పులుపు కాయ అక్కరలేదు. మరి ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకుందామా.

 

కావలసిన పదార్దాలు:

మామిడి కాయ ముక్కలు   -- ఒక కప్పు
ఆవాలు                            -- 6 చెంచాలు
ఎండు మిర్చి                     -- 6
బెల్లం కోరు                       -- 1 చెంచా
ఉప్పు                              -- 2 చెంచాలు
పసుపు                            -- ఒక చెంచా
ఇంగువ                            -- పావు చెంచా
మంచి నీరు                       -- పావు కప్పు

 

తయారీ విధానం:

ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత బెల్లం, నీరు కలిపి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమం దోశల పిండి అంత జారుగా రావాలి. కావాలంటే కొంచెం నీరు కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న మామిడి కాయ ముక్కలని అందులో వేసి బాగా కలపాలి. ఒక రోజు వుంచి ఆ తర్వాత వాడుకుంటే రుచిగా వుంటుంది. ఒక 15 రోజుల వరకు బావుంటుంది ఈ ఆవకాయ.

 

టిప్ :

1. ఆవపిండి కంటే ఆవాలు గ్రైండ్ చేసి వాడితేనే బావుంటుంది. ఆవకూరల రుచి వస్తుంది .

2. తీపి ఇష్టం లేని వారు బెల్లం వేయటం మానేయచ్చు.. కాని వేసేది ఒక చెంచానే కాబట్టి పెద్దగా తీపి పట్టదు పచ్చడికి.

 

-రమ