మ్యాంగో శ్రీఖండ్

 

 

 

శ్రీఖండ్ గుజరాతీయులకి ఎంతో ఇష్టమయిన స్వీట్. పెరుగుని ఓ బట్టతో వడకట్టి  ఉంచితే గట్టిగా, పొడిగా వస్తుంది. అందులో రకరకాల ఫ్లేవర్స్ కలుపుతూ, ఎన్నో విధాలుగా చేస్తారు. అందులో మామిడి పండుతో చేసే శ్రీఖండ్ రుచి భలేగా వుంటుంది. పిల్లలు తప్పకుండా ఇష్టంగా తింటారు. ఒరిజినల్ శ్రీఖండ్ రెసిపీకి నేను కొన్ని జోడించి చేశాను. రుచి బావుంది.. మీరు ట్రై చేయండి.

 

కావలిసిన పదార్ధాలు:
మామిడి పండ్ల గుజ్జు  - ఒక కప్పు
పెరుగు                    - రెండు కప్పులు
పంచదార                 - 5 చెంచాలు
ఏలకుల పొడి           - చిటికెడు
జీడి పప్పులు           - 10
ఎండు ద్రాక్ష              - 20

 

తయారీ విధానం:
ముందుగా కమ్మటి పెరుగుని ఒక పొడి బట్టలో వడకట్టటానికి పెట్టాలి. ఒక గంటపాటు అలా ఉంచితే పెరుగులోని నీరు అంతా పోయి గట్టిగా వస్తుంది. ఆ సమయంలోనే జీడిపప్పును, ఎండు ద్రాక్షను విడివిడిగా నానపెట్టి వుంచుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కొంచెం నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను కూడా. ఆతర్వాత ఒక బౌల్ లో వడగట్టిన పెరుగు, మామిడి గుజ్జు, పంచదార వేసి బాగా కలపాలి. పెరుగు చాలా స్మూత్ గా రావాలి. అలా బాగా కలిపిన పెరుగు మిశ్రమంలో జీడిపప్పు, ఎండుద్రాక్ష పేస్టులను కూడా వేసి ఆఖరులో యాలకుల పొడి కూడా చేర్చి అన్నీ బాగా కలిసేలా కలపాలి. మెత్తగా కొంచెం జారుగా వుంటుంది ఆ మిశ్రమం. దానిని కప్పులలో  పోసి ఫ్రిడ్జ్ లో ఒక గంటపాటు వుంచి, తీసి చల్లచల్లగా వడ్డించండి.

 

 

-రమ