మామిడి కజ్జికాయలు

 


కజ్జికాయలు మన తెలుగువాళ్లకి ఇష్టమైన తీపి వంటకం. దాన్నితయారు చేసే పద్ధతి ప్రాంతాన్ని బట్టి మారుతుంది. లోపల ఫిల్లింగ్ మారిస్తే చాలు కజ్జికాయలు కొత్త రుచులతో తయారవుతాయి. అలా ఈసారి ఉగాదికి మామిడి తురుముతో ప్రయత్నించండి. మామిడి కాయలో కొబ్బరి మామిడి అని తియ్యగా ఉంటుంది. ఆ కాయ తురుము వాడాలి ఈ వంటకంలో

 

కావాల్సిన పదార్ధాలు:
కొబ్బరి మామిడి తురుము   - అరకప్పు
కొబ్బరి తురుము               - అరకప్పు
బెల్లం                               - ఒక కప్పు
నెయ్యి                             - ఆరు చెంచాలు
యాలకులపొడి                  - అరచెంచా
మైదా                              - ఒక కప్పు
నూనె                              - వేయించడానికి తగినంత
జీడిపప్పు, కిస్మిస్              - ఒక చెంచా
సన్నగా తురిని

 

 

తయారీ విధానం:
ముందుగా మైదాలో రెండు చెంచాల నెయ్యి వేసి, కొద్దిగా నీరు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో నాలుగు చెంచాల నెయ్యివేసి జీడిపప్పు, కిస్మిస్ లని వేసి ఎర్రగా వేయించి అందులోనే కొబ్బరి వేసి వేయించాలి. కొబ్బరి వేగాకా మామిడి తురుమును ( గ్రైండ్ చేయకూడదు. కోరుకోవాలి) వేసి రెండు నిమిషాలు కదిపి వెంటనే బెల్లం తురుము చేర్చి బాగా కదపాలి. కాసేపటికి బెల్లం పాకం వచ్చి దగ్గరగా అవుతుంది మిశ్రమం. అప్పుడు స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఇప్పుడు మైదాపిండిని చపాతీల్లా పలచగా వత్తుకొని అందులో తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయల మౌల్ట్ తో కజ్జికాయలు తయారుచేయాలి. సన్నని మంటమీద నూనెలో ఎర్రగా వేయించి తీస్తే రుచికరమైన కజ్జికాయలు రెడీ. కజ్జికాయ తింటుంటే కొబ్బరి, మామిడి రుచితో భలే ఉంటుంది.

 

 

 

 

 

-రమ